Site icon NTV Telugu

Off The Record: ఆ జనసేన ఎమ్మెల్యే ఒక్క ఏడాదిలో 100 కోట్లు సంపాదించారా?

Mla Chirri Balaraju

Mla Chirri Balaraju

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్‌ పోలవరం. కానీ… అదే పోలవరం ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివాదాలు రేగుతూ… రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వ్యవహారాల్లో ఈ జనసేన ఎమ్మెల్యే ప్రమేయం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే… వోవరాల్‌గా హైలైట్‌ అవుతోంది మాత్రం ఆయనే. అది ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తలనొప్పిగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే రకరకాల వివాదాలు నడుస్తుండగా… ఇటీవల ఆయన గురించి మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన నేత, డిసీసీబీ మాజీ ఛైర్మన్‌ కరాటం రాంబాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట రెండు పార్టీల నాయకులు. పోలవరం జనసేన ఎమ్మెల్యే ఏడాదిలోనే… 100 కోట్లు సంపాదించారని, ఇదంతా పవన్ కళ్యాణ్ కి ఎందుకు తెలియడం లేదంటూ దేవినేని ఉమా కామెంట్‌ చేసినట్టుగా ఓ ఆడియో వైరల్‌ అవుతోంది. ఇప్పుడు పోలవరం నియోజకవర్గం రాజకీయం మొత్తం ఈ ఆడియో చుట్టూనే తిరుగుతోంది.

Read Also: Off The Record: సీఎం వార్నింగ్‌ ఇచ్చినా మారడం లేదా..? ఎమ్మెల్యేలే కూటమి కొంప ముంచబోతున్నారా?

ఎమ్మెల్యే బాలరాజు గురించి స్థానిక మండల స్థాయి టీడీపీ నేత ఒకరు తప్పుడు సమాచారం ఇచ్చారని, తన ఫోన్‌లో రికార్డ్‌ మోడ్‌ ఆన్‌ చేసి ఇద్దరు నేతలతో మాట్లాడించి ఆ ఫైల్‌ను వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి షేర్‌ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు బాలరాజు అనుచరులు. అసలు పోలవరం లాంటి రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో ఏడాదిలో వంద కోట్లు ఎలా సంపాదించగలుగుతారన్నది ఎమ్మెల్యే వర్గం క్వశ్చన్‌. వాళ్ళ వాదన ఎలా ఉన్నా… సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. గత ఎన్నికల్లో… ఊహించని విధంగా సీటు దక్కించున్న చిర్రి బాలరాజు మొదట్నుంచి ట్రోల్‌ మెటీరియల్‌గానే ఉన్నారన్నది స్థానిక రాజకీయ వర్గాల అభిప్రాయం. అందుకు కారణం కూడా సొంతోళ్ళేనన్నది ఇంకో వెర్షన్‌. మిగతా వాళ్ళ కంటే మా MLA ఎక్కడా తగ్గ కూడదంటూ… ఎన్నికైన తొలినాళ్లలోనే  జనసేన కార్యకర్తలంతా కలిసి బాలరాజుకు కారు కొనిచ్చారు. అది ఎటెటో తిరిగి రచ్చ అవడంతో… నాకా కారు వద్దు .. గీరు వద్దంటూ వెనక్కి ఇచ్చేశారాయన. అలాంటిది ఇప్పుడు ఏకంగా వందకోట్లు వెనకేసుకున్నారనే ప్రచారం జరగడం, అదీ కూడా మాజీ ఇరిగేషన్‌ మినిస్టర్‌ నోటి నుంచే ఆ మాటలు రావడంతో… ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట చిర్రి.

Read Also: AP Crime: ఉద్యోగిని కిడ్నాప్‌.. ఆఫీసుకు వచ్చి బలవంతంగా కారులో ఎక్కించి..!

గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా… పోలవరంలో లెక్కలేనన్నిసార్లు పర్యటించిన దేవినేని ఉమకు ఇక్కడి పరిస్థితులు తెలిసి కూడా ఏకంగా వంద కోట్లు సంపాదించినట్టు ఎలా చెప్పగలుగుతున్నారన్నది స్థానిక జనసేన నాయకుల ప్రశ్న. ఇక్కడే రాజకీయ కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు కొందరు. కార్యకర్తగా రాజకీయాలు మొదలుపెట్టిన ఎమ్మెల్యే…నియోజకవర్గంలో తన ప్రాబల్యం పెంచుకునే పనిలో ఉన్నారని, ఇది నచ్చని కొంతమంది స్థానిక టిడిపి నాయకులు… కావాలనే ఆయన్ని టార్గెట్‌ చేస్తున్నారని, దేవినేని ఉమాకు కూడా వాళ్ళే తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారట. ఉమా ఆడియో బయటికి రావడం, అది వైరల్‌ అవడం కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగిన వ్యవహారమేనన్నది జనసేన నాయకుల అనుమానం. మా నాయకుడంటే నియోజకవర్గ టీడీపీ నేతలకు ఎంత కసి ఉందో దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు జనసేన ఎమ్మెల్యే అనుచరులు.ఇదిలా ఉంటే.. అటు జనసేనలోనే ఓవర్గం బాలరాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు సమాచారం. మేమే దగ్గరుండి ఆయన్ని గెలిపించాం, అందుకు తగ్గట్టుగా ఆయన మాకు పని చేయాలని భావిస్తున్నారట ఓ సామాజిక వర్గం నేతలు. అందుకు సహకరించకపోవడంతో  బాలరాజుకు వ్యతిరేకంగా పనిచేసే వారి సంఖ్య పెరిగిందని, నియోజకవర్గంలో ఆయన అడుగు తీసి అడుగు వేస్తే వివాస్పదం చేస్తున్నారనేది బాలరాజు సన్నిహితుల మాట.

Read Also: Street Vendor: ఈ పకోడీలు వద్దు బాబోయ్.. వేడి నూనెలో ఆయిల్ ప్యాకెట్లు ముంచుతున్న వీధివ్యాపారి (వీడియో)

ఎమ్మెల్యే తమకు సహకరించడం లేదన్న కోపంతో వైసీపీ వాళ్ళతో కలిసి కూడా కొందరు జనసేన నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే వర్గం అనుమానం. నియోజకవర్గంలో అంతంతమాత్రంగా ఉన్న జనసేన టిడిపి సహకారంతో గెలిచినా… ఇప్పుడు బలపడితే భవిష్యత్తులో ఇబ్బంది అన్న ఉద్దేశ్యంతోనే ఇలా రకరకాల వివాదాలను తెర మీదికి తెస్తున్నట్టు అనుమానిస్తున్నారు బాలరాజు వర్గం జనసైనికులు. ఓవైపు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం.. మరో వైపు మిత్రపక్షం నుంచి నెగిటివ్ ప్రచారం, ఇంకోవైపు అవకాశం కోసం చూస్తున్న వైసిపి. ఇన్ని అవరోధాలను దాటుకుని పోలవరం నియోజకవర్గంలో తన ఉనికి చాటుకోవడమన్నది చిర్రి బాలరాజుకు సవాలేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చేస్తున్న పని కంటే… వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం ఎక్కువ కావడంతో భవిష్యత్తులో జనసేన అధినేత నుంచి ఆయనకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉండబోతోందన్న చర్చ సైతం నడుస్తోంది పోలవరంలో. ఎమ్మెల్యే బాలరాజు ఈ వ్యవహారాలను ఎలా హ్యాండిల్‌ చేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.

Exit mobile version