NTV Telugu Site icon

Off The Record: పిఠాపురంలో ఒకే గూటికి బద్ద శత్రువులు..! పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ మారబోతున్నాయా..?

Pithapuram Politics

Pithapuram Politics

Off The Record: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పొలిటికల్‌ స్క్రీన్‌ మీద సరికొత్త సీన్స్‌ కనిపించబోతున్నాయట. ఆ సన్నివేశాలు నియోజకవర్గంలో పాజిటివ్‌ వైబ్స్‌ తీసుకు వస్తాయా? లేక నెగెటివిటీని పెంచుతాయా అని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరడం ఖరారైపోయింది. ఆయన కండువా కప్పుకోవడం ఇక లాంఛనమే. ఇక్కడే ఈక్వేషన్స్‌కు సంబంధించిన సరికొత్త చర్చ మొదలైంది. 2004లో బీజేపీ, 2019లో వైసీపీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు పెండెం. 2024కు వచ్చేసరికి సిట్టింగ్‌గా ఉన్న దొరబాబును పక్కన పెట్టింది వైసిపి. తర్వాత ఆ పార్టీకి దూరం జరిగిన మాజీ ఎమ్మెల్యే… ఇప్పుడు జనసేనలో చేరడం ఖాయమైపోవడంతో… స్థానికంగా కూటమిలో పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

దాదాపు రెండు దశాబ్దాల నుంచి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు వర్మ, దొరబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఇద్దరు ప్రత్యర్థులుగా ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచారు వర్మ.. 2019లో ఓడిపోయారాయన. అటు నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన ద్వితీయశ్రేణి నాయకులు, వర్మకి మధ్య గ్యాప్ ఉంది. ఒక్క పవన్ కళ్యాణ్ టూర్‌లో తప్ప….మిగతా అన్ని సందర్భాల్లో ఎవరి కార్యక్రమాలు వాళ్ళవే. కూటమిలో ఉన్నాం… సమన్వయంతో వెళదామన్న ధ్యాస ఎవరికీ లేదంటారు స్థానికులు. గెలుపు ఇచ్చే కిక్కుకు సంబంధించి ఆ మధ్య వర్మ చేసిన ట్వీట్ కూడా వివాదం రేపింది. దాంతో రెండు పార్టీల కేడర్‌ మధ్య దూరం మరింత పెరిగిందట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ దొరబాబును జనసేనలోకి ఎలా ఎంకరేజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారట వర్మ. ఆయన ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమని ఇబ్బందులు పెట్టారని గుర్తు చేస్తున్నట్టు తెలిసింది. ఏకంగా డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో గత ప్రభుత్వం మూలాలు ఉన్న వారిని ఎంకరేజ్‌ చేయడం ఏంటి? వారివల్ల ఒనగూరే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తోందట వర్మ వర్గం. నాడు పవన్‌ని ఓడించమని ప్రచారం చేసిన వాళ్ళే నేడు ముద్దయ్యారా? అంటూ సెటైర్స్‌ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయినవాళ్ళకు ఆకుల్లో… కాని వాళ్ళకి కంచాల్లో పెట్టడం అంటే ఇదేనేమోనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన దొరబాబు వర్గం కూడా అంతే స్థాయిలో రియాక్ట్‌ అవుతోందట. తాము ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని,

గత ఎన్నికల టైంలో వైసీపీలో ఉన్నప్పటికీ పిఠాపురం వరకు పవన్ కోసం పని చేశామని, ఆ విషయం అధినేతకు కూడా తెలుసునని వివరిస్తున్నారట. అంతా తెలుసుకాబట్టే… పవన్‌ తమ చేరికకు ఒప్పుకున్నారని దొరబాబు వర్గం అంటుండగా… ఇంకా చేరకముందే ఇలా వార్‌ మొదలవడం పిఠాపురం కూటమి భవిష్యత్‌ చిత్రాన్ని చూపుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే పట్టు కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. దొరబాబు చేరిక తమకు ప్లస్‌ అవుతుందని జనసేన భావిస్తుంటే, తమను టార్గెట్ చేస్తున్నారని వర్మ వర్గం ఫైర్ అవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే… మాజీ ఎమ్మెల్యేల మధ్య వ్యవహారం మరింత ముదురుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆధిపత్య పోరులో భాగంగా… దొరబాబును టార్గెట్‌ చేస్తూ… అవసరమైతే గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాల పై పోరాటాలకు వర్మ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అధికారం కోసం తాను పార్టీలు మారే బాపతు కాదని, దొరబాబు ఇప్పటివరకు ఐదు పార్టీలు మారారని అని గుర్తు చేస్తున్నారట. అటు పెండెం వర్గం కూడా అంతే ఘాటుగా రియాక్ట్‌ అవుతూ… నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని సెటైరికల్‌గా అంటోందట. ఇలా మాటల తూటాలు పేలుస్తూ పిఠాపురంలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి రెండు శిబిరాలు. మాజీ ఎమ్మెల్యేలు, బద్ద శతృవులు ఇద్దరూ ఒకే గొడుగు కిందకు చేరడంతో ఇకనుంచి ఆట ఎంత రసవత్తరంగా మారుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద పవన్‌కళ్యాణ్‌ నియోజకవర్గం ఆయనవల్ల కాకుండా…ఇలా మరో రూపంలో… హాట్‌ టాపిక్‌ అవడం ఇంట్రస్టింగ్‌ గానే ఉందని అంటున్నారు. గెలిపించిన తమను కాదని, పవన్ ఓటమి కోసం పనిచేసిన దొరబాబుని పల్లకిలో ఎక్కిస్తారా అని వర్మ వర్గం గుర్రుగా ఉన్న క్రమంలో పిఠాపురం పొలిటికల్‌ స్టోరీ ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి మరి.