Site icon NTV Telugu

Off The Record: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్క ట్వీట్‌తో ఇరుకున పడ్డారా..?

Pawan Kalyan

Pawan Kalyan

Off The Record: ఒక్క రీ ట్వీట్‌… ఒకే ఒక్క రీ ట్వీట్‌…. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. దాని వాస్తవ సారాంశం, అలా మెసేజ్‌ పెట్టడం వెనక ఆయన ఉద్దేశ్యం ఏదైనా కావచ్చు. అది మంచా చెడా అన్నదాంతో… అస్సలు సంబంధమే లేదు. కానీ… పవన్‌ రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం ఆ ట్వీట్‌ కాస్త డిఫరెంట్‌గా అర్ధమైందట. హవ్వ… డిప్యూటీ సీఎం అయి ఉండి అంత మాట అంటారా? అవే తేడా మాటలు అప్పుడు ఎందుకు అనలేదు? అని ఉంటే అప్పుడే తెలిసేదికదా అంటూ.. సోషల్‌ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తిత్లీ తుపాను బాధితులను 2018లో పవన్ కళ్యాణ్‌ పరామర్శించినప్పుడు ఆయనతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్‌ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్‌. దాన్ని ట్యాగ్‌ చేస్తూ పవన్‌ చేసిన రీ ట్వీట్‌ వివాదాస్పదమైంది. వాళ్లేమీ ఉచితాలు, విపరీతమైన సంక్షేమ పథకాలు అడగడం లేదు. మాకు పాతికేళ్ళ భవిష్యత్ ఇవ్వమని కోరారు. యువతలోని నిజమైన శక్తి సామర్థ్యాల్ని మనం గుర్తించాలి. అందుకోసం నేను ఎప్పుడూ వాళ్ళని కలుస్తూనే ఉంటానని మెసేజ్‌లో రాసుకొచ్చారాయన. అదే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఆ పదాల వెనక పవన్‌ అంతరంగం ఏదైనా కావచ్చు. కానీ… అవి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధం అవుతున్నాయట. అందులోనూ… సోషల్‌ మీడియాలో అయితే… చెప్పేపనేలేదు. ఎవరికి నచ్చిన కామెంట్స్‌ వాళ్ళు పెడుతూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు.

యువత ఉచితాలు కోరడం లేదు.. పాతికేళ్ళ భవిష్యత్‌ అడుగుతున్నారన్న మాటలు మొదట్లో కొందరికి స్ఫూర్తిదాయకంగానే అనిపించాయట. కానీ… మెసేజ్‌ పెట్టిన కొన్ని గంటల తర్వాత మాత్రం రకరకాల విశ్లేషణలు బయటికి వచ్చి… రచ్చ రంబోలా అవుతోంది. ఇంకా చెప్పాలంటే పవన్‌కు అది బూమరాంగ్‌ అయి కొత్త తంటాలు తెచ్చిపెట్టిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. పవన్‌ ఉద్దేశ్యం యువతలోని శక్తి సామర్ధ్యాలను రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కావచ్చు, ఉచితాలకు అతీతంగా వాళ్ళలోని టాలెంట్‌ని వెలికి తీయాలన్న ఉద్దేశ్యం అయితే అయి ఉండవచ్చు. కానీ… నెటిజన్స్‌, వివిధ రాజకీయ పార్టీల మద్దతుదారులకు మాత్రం ఇంకోలా అర్ధం అయిందట. ఎన్నికల సమయంలో లక్షా 20వేల కోట్ల రూపాయల విలువైన ఉచితాల వాగ్దానాలు చేసి, మేనిఫెస్టోలో పెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని సరిగా అమలు చేయలేక పక్కకు తప్పుకుంటోందా? అందులో భాగంగానే పవన్‌ యువత, భవిత, ఉచితాలు వద్దంటున్నారంటూ… వ్యతిరేక కామెంట్స్‌తో సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు… కూటమి పార్టీల ప్రచారం మొత్తం ఉచిత హామీల మీద ఆధారపడే జరిగిందని, ఇప్పుడు ఆ సంగతి మర్చిపోతే ఎలాగంటూ గుర్తు చేస్తున్నారు. కొందరైతే… డైరెక్ట్‌గా మానిఫెస్టో పేజీల్ని షేర్ చేస్తూ…. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్‌ ట్వీట్‌ మంచా చెడా అన్న సంగతి కాసేపు పక్కనబెడితే… ఇక్కడ సమస్య అంతా టైమింగ్‌లోనే ఉందంటున్నారు విశ్లేషకులు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలైంది. ఒక్కొక్కటిగా…ఉచిత పథకాలు అమలవుతున్న టైంలోనే… పవన్‌ ఫ్రీ బీస్‌కు వ్యతిరేకంగా మెసేజ్‌ పెట్టడం వల్లే వల్లే టార్గెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ప్రచారంలో ఉచితాలతో ఓట్లు సంపాదించి, ఇప్పుడు నీతులు చెప్పడం, మోరల్ లెక్చర్స్‌ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్‌ అన్నది సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ. సాధారణంగా పవన్‌ చేసే ట్వీట్స్‌ బుల్లెట్స్‌లా దూసుకుపోతుంటాయి. కానీ… ఈసారి మాత్రం ఆ బుల్లెట్‌ బూమరాంగ్‌ అయి… ఆయన మీదికే దూసుకువచ్చిందని అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. మామూలుగా వేరే ఎవరన్నా ఇలాంటి ట్వీట్‌ చేసి ఉంటే పెద్దగా రియాక్షన్స్‌ ఉండకపోయేవిగానీ…. డైరెక్ట్‌గా ఉప ముఖ్యమంత్రి అభిప్రాయం కావడంతో… రాజకీయ రచ్చ అవుతోంది. ఆయన మాట కరెక్ట్‌ అయిఉండవచ్చుగానీ… టైమింగ్‌ మాత్రం పూర్తిగా రాంగ్‌ అంటున్నారు పరిశీలకులు.

Exit mobile version