Off The Record: సాధారణ ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉండగానే కొంత మంది ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. 70కి చేరువ అవుతున్న వారంతా తాము ఇక రాజకీయాల నుంచి తప్పుకుని వారసుల్ని రంగంలోకి దింపాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఇలాంటి వారి జాబితాలోకి హిందూపురం మాజీ ఎంపీ పార్థసారథి కూడా చేరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో పార్థసారథి సీనియర్ నాయకుడు. పెనుకొండ నియోజవర్గం రొద్దం మండలానికి చెందిన ఆయన మొదట జడ్పీటీసీగా గెలిచారు. జడ్పీ ఛైర్మన్ గా, ఎంపీ, ఎమ్మెల్యేగా ఇలా అనేక పదవులు చూశారు. సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. కానీ 2019 ఎన్నికలలో పెనుకొండ లాంటి కంచుకోట ప్రాంతంలో ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఎందుకిలా జరిగింది…ఎలా ఓడిపోయారంటూ పెద్ద ఎత్తునే చర్చ జరిగింది.
అసలు పెనుకొండలో పార్థసారథికి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడే ఉండే వారు కాదు. కానీ 2024ఎన్నికల్లో పెనుకొండ టికెట్ విషయంలో ఇటు పార్థ, అటు సవిత మధ్య పోటీ ఏర్పడింది. అధిష్టానం అన్ని అంశాలు పరిశీలించి సవిత వైపు మొగ్గు చూపింది. ఆమె ఫస్ట్ టైం పోటీ చేసినా మంచి మెజార్టీతో గెలవడమే కాకుండా ఏకంగా మహిళ, బీసీ కోటాలో మంత్రి కూడా అయ్యారు. అయితే పార్థసారథిని ఎక్కడా తగ్గించుకుండా ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆయన కూడా మంచి విజయం సాధించారు. కేంద్ర మంత్రి వర్గంలో ఆయనకు చోటు ఉంటుందని భావించారు. కానీ అది కూడా దక్కలేదు. ఇంకోవైపు పెనుకొండలో పార్థసారథి వర్గీయులు మంత్రి సవిత వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అసలు సై అంటే సై అని తలపడ్డారు. కానీ నేతలు ఇద్దరు మాత్రం తమ మధ్య విభేదాలు లేవని చెప్పడానికే చాలాసార్లు ప్రయత్నించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం ఎంపీ పార్థసారథి, మంత్రి సవిత హాజరై తమ మధ్య విభేదాలు అని చెప్పే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎంపీ పార్థసారథి కుమారుడు సీన్ లోకి వచ్చారు.
పార్థసారథి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నా.. తన కుమారున్ని పొలిటికల్ కెరియర్ కు బలమైన పునాదులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. విదేశాల నుంచి ల్యాండ్ కాగానే గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడం లోకల్ టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. పక్కా ప్రణాళికతోనే ఈ ఘన స్వాగతానికి పార్థసారథి ప్లాన్ చేశారన్న మాటలు వినిపించాయి. ఇక తాను రాజకీయాలు చాలించి, వారసున్ని రంగప్రవేశం చేయించాలన్న ప్రణాళికలో భాగమే ఇదంతా అంటూ పార్టీలో డిస్కషన్ సాగింది. పార్థసారథి వారసుని ఎంట్రీ సరే..ఇప్పుడు ప్రస్తుతం అక్కడున్న మంత్రి సవిత పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న. అయితే, ఆమె మాత్రం ఇవ్వన్నీ లైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించినప్పుడు, అప్పుడు అసలు సంగతి చూద్దామని వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. వారసున్ని ఆరంగేట్రం ఖాయమైతే, పెనుకొండలో ప్రచ్చన్నయుద్ధం కాస్తా..ప్రత్యక్షయుద్ధంగా మారే ప్రమాదం వుందని టీడీపీలో హాట్‌హాట్ డిస్కషన్ సాగుతోంది.