Site icon NTV Telugu

Off The Record: అక్కడ జనసేనలో నామినేటెడ్ చిచ్చు.. మూకుమ్మడిగా పవన్ దృష్టికి..

Janasena

Janasena

Off The Record: చింతలపూడి….. పార్టీ ఏదైనా సరే, వర్గపోరు కామన్‌గా ఉండే అసెంబ్లీ నియోజకవర్గం. ఇన్నాళ్ళు ఈ సమస్యతో టీడీపీ, వైసీపీ మాత్రమే సతమతమైతే… ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. ఇటీవల ప్రకటించిన నామినెటెడ్ పోస్టులు గ్లాస్‌ పార్టీలో చిచ్చు రేపాయట. కష్టపడి పనిచేసినవారికి కాకుండా కాకమ్మకధలు చెప్పినవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఇది మెల్లిగా ముదురుతూ… కుమ్ములాటలకు దారితీసి పార్టీ నేతలు రోడ్డెక్కే స్థాయికి దిగజారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓటింగ్ పరంగా జనసేనకు ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాస్తోకూస్తో పట్టున్నప్పటికీ సమన్వయపరిచే… సమర్ధ నాయకత్వం లేకపోవడం వల్లే… పరిస్థితి దిగజారుతోందన్నది చింతలపూడి టాక్‌. ఛోటా మోటా నేతలంతా… ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తూ… పరస్పరం పైచేయి కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవలు జరుగుతున్నాయట. అదంతా ఒక ఎత్తైయితే.. నిన్నమొన్నటి వరకు తమకు గుర్తింపు దక్కడంలేదంటూ నానా హడావుడి చేసిన ఇన్ఛార్జ్‌ మేకా ఈశ్వరయ్య ఇపుడు జనసైనికులకు టార్గెట్ అయ్యారట.

Read Also: Off The Record: తెలంగాణ కేబినెట్‌లో సమన్వయం లోపించిందా..?

నామినేటెడ్ పదవులు దక్కించుకునే విషయంలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఈశ్వరయ్య… చివరికి తమ కోటాలో వచ్చిన ఏఎంసీ ఛైర్మన్‌ పదవిని కూడా… సరైన వ్యక్తికి కేటాయించలేకపోయారన్న విమర్శలున్నాయి. మొన్నటి వరకు పదవులు లేవని హడావుడి చేసిన ఇన్ఛార్జ్‌ తీరా… కేటాయించే సమయానికి మాత్రం తేడాగా ప్రవర్తిస్తున్నారన్నది స్థానిక జనసైనికుల ఆవేదనగా తెలుస్తోంది. కూటమి నేతలకు ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో సొంతపార్టీ నేతలే తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సీనియర్ నాయకులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం ఇపుడు చింతలపూడి జనసేనలో హాట్ టాపిక్‌ అయ్యింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులను పక్కనపెట్టి.. పక్కపార్టీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారనేది వారి ఆవేదనగా తెలుస్తోంది. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వ్యవహారం నియోజకవర్గ జనసేనలో కాకరేపుతోంది. ప్రజారాజ్యం సమయం నుంచి పవన్ కళ్యాణ్‌తో కలసి నడిచిన నేతలను పక్కపెట్టి… ఇపుడు పక్కపార్టీ నుంచి వచ్చిన నేతకు ఏఎంసీ ఛైర్మన్‌ పోస్ట్‌ కట్టబెట్టారన్నది ముఖ్యమైన అభ్యంతరం. కేసులు ఉన్నవాళ్ళు, పార్టీలు మారేవారిని ఏరికోరి మరీ పదవులకు ఎంపిక చేయడం చూస్తుంటే మొత్తం బేరం పెట్టేశారా అన్న అనుమానం కలుగుతోందని అంటున్నారు కార్యకర్తలు.

పైగా చింతలపూడిలో జనసేన బలపడటానికి మంచి అవకాశం ఉన్నా…. ఇన్ఛార్జ్‌ తీరుతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేతలు ముందుకు రావడంలేదట. గతంలో పార్టీ కట్టే పేరుతో పెద్ద ఎత్తున గ్రామగ్రామాన చందాలు వసూలు చేశారు. కానీ… ఇప్పటికీ శాశ్వత భవనం ఎందుకు కట్టలేకపోయారని జనసైనికులే గుసగులాడుకుంటున్నారు. టిడిపితో వచ్చే ఇబ్బందుల విషయంలో సర్దుకుపొమ్మని చెబుతున్నారు సరే…. కిందిస్థాయిలో సొంత పార్టీలో నేతల మధ్య పెరుగుతున్న అగాధాన్ని ఎలా పూడుస్తారన్నది కార్యకర్తల క్వశ్చన్‌. నియోజకవర్గంలో జనసేనకు దక్కుతున్న ప్రాధాన్యత, కార్యకర్తలకు అండగా నిలిచే నాయకులు లేకపోవడం వంటి వ్యవహారాలను స్థానిక నాయకులు మూకుమ్మడిగా అధినేత దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియా పోస్ట్‌లతో హోరెత్తిస్తున్న చింతలపూడి జనసైనికుల ఆవేదనను అధిష్టానం వింటుందో లేదా చూడాలి.

Exit mobile version