Site icon NTV Telugu

Off The Record : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై నెగిటివ్ టాక్..

Otr Kavitha

Otr Kavitha

Off The Record : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు గురించిన ఒక డిఫరెంట్‌, సెంటిమెంట్‌ అంశం ఇప్పుడు కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దీని గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం మంగళవారం సాయంత్రం శాసనమండలి చైర్మన్ ఆ సీటు ఖాళీ అయిందని ప్రకటించడమే. కల్వకుంట్ల కవిత ఇక్కడి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతూ వచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత రాజీనామా చేయడం వరుస పరిణామాలు. రాజీనామాను మొదట చైర్మన్ ఆమోదించకపోవడంతో కవిత నేరుగా శాసనమండలి సమావేశానికి హాజరై సభలో మాట్లాడి మరీ… తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో స్టాంప్‌ వేసేశారు ఛైర్మన్‌. అదంతా ఒక ఎత్తయితే…అసలు ఈ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం బీఆర్‌ఎస్‌కు కలిసి రావడం లేదన్న చర్చ తాజాగా మొదలైంది.

అందుకు ప్రధాన కారణం గతంలో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి కూడా సస్పెండ్‌ అవడమే. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత ఆ విషయం హైకోర్టు వరకు వెళ్ళింది. చివరకు ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేస్తూ అప్పటి మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవితని కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న రీజన్‌తోనే సస్పెండ్ చేశారు. దీంతో.. సెప్టెంబర్ 3న కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ స్థానానికి కూడా రాజీనామా చేశారు. దాదాపు నాలుగు నెలల తర్వాత రాజీనామా ఆమోదం పొందింది. ఇలా ఒకే స్థానం నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతిరెడ్డి, కవిత సస్పెండ్‌ అవడం, ఎమ్మెల్సీ పదవులు కోల్పోవడంతో రాజకీయ వర్గాల్లో సెంటిమెంట్‌ చర్చ మొదలైంది. ఈ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్‌కు కలిసి రావడం లేదని మాట్లాడుకుంటున్నారు పార్టీ నాయకులు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థానానికి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఎవర్ని అభ్యర్థిగా పెడుతుందన్నది సస్పెన్స్‌గా మారింది.

Exit mobile version