Off The Record: నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా నాగం వర్షిత్ రెడ్డి నియామకం కమల దళంలో కల్లోలం రేపుతోందట. నియామకం తర్వాత రేగిన అసమ్మతి జ్వాలల్ని ఆర్పేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నిస్తున్నా… తిరిగి ఎక్కడో ఒక చోట రేగుతూనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వర్షిత్ రెడ్డి మొదటి నుండి క్యాడర్‌ను కలుపుకుని పోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలతో చేటు చేస్తున్నారన్నది ఆయన వ్యతిరేకుల ప్రధాన ఆరోపణ. ఇకపై సమష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తామని, రాష్ట్ర కొత్త అధ్యక్షుడు వచ్చాక సమీక్షిస్తానని భరోసా ఇచ్చినా… సంయమనం పాటించమని పార్టీ పెద్దలు అసమ్మతి నాయకులకు నచ్చజెప్పినా మాట వినడం లేదట. వ్యూహాత్మకంగా వ్యవహరించి… రెండోసారి కూడా జిల్లా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్న నాగం వర్షిత్ రెడ్డి.. మొదట్లో అసమ్మతినేతల మీద పైచేయి కోసం యత్నించినప్పటికీ ఆ వ్యూహం బెసిడికొట్టడంతో రూటు మార్చి వాళ్ళ గడపలు తొక్కుతున్నారట. అసమ్మతి నేతలతో బ్రేక్ ఫాస్ట్, లంచ్ మీటింగ్స్ నిర్వహిస్తూ…. నష్ట నివారణ చర్యలకు తీసుకుంటున్నట్టు సమాచారం. అయినా కూడా పెద్దగా వర్కౌట్ కావడంలేదని కాషాయ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. పార్టీ పెద్దల నుండి బుజ్జగింపులే తప్ప… తమకు పెద్దగా ఉపయోగపడే హామీ రాకపోవడంతో… దూకుడు పెంచిన అసమ్మతి నాయకులు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సమాచారం. తమ బలం, బలగం ఏంటో కమలం పార్టీ జిల్లా నేతలకు, రాష్ట్ర పార్టీ పెద్దలకు చూపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే పార్టీ మారేందుకు కూడా కొందరు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఆనోటా, ఈనోటా… ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు…… కమ్ కమ్ వెల్కమ్….మీరొస్తామంటే మేం వద్దంటామా అంటూ… రెడ్ కార్పెట్స్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అసమ్మతి నేతల్లో ఎక్కువ మందికి అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉండటంతో పాటు సామాజిక సమీకరణాలు పక్కాగా సరిపోవడంతో…. మొత్తం టీం టీమ్‌నే లాగేస్తే పోలా అని అనుకుంటున్నారట కాంగ్రెస్ ముఖ్యులు. వాళ్ళంతా వచ్చేస్తే…. మున్సిపల్ ఎన్నికల్లో లబ్దితో పాటు జిల్లా రాజకీయాల్లో ప్రయోజనం ఉంటుందన్నది హస్తం పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు ముందే ఓ ప్రధాన రాజకీయ ప్రత్యర్దిని బలహీన పరిచేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పక్కాగా స్కెచ్ వేస్తోందట హస్తం పార్టీ. స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదండోయ్…. అధికార పార్టీ నుండి ఆహ్వానం అందుకున్న బీజేపీ అసంత్రుప్త నేతల కోసం అటు కారు డోర్స్ కూడా ఓపెన్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మీ కోసం మేం కూడా రెడ్ కార్పెట్స్ ఆర్డర్ చేశామంటూ బీఆర్‌ఎస్ ముఖ్యులు కూడా సందేశం పంపినట్టు తెలుస్తోంది. ఇక్కడే కాస్త గంరగోళం కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఆహ్వానాలతో
ఎటుపోవాలో తేల్చుకోలేక, ఉన్నపార్టీలో ఇమడలేక.. సతమతం అవుతున్నారట సదరు కమలం పార్టీ అసంత్రుప్త నేతలు. అలాగే… సిచ్యుయేషన్‌ని తమకు అనుకూలంగా మల్చుకునే క్రమంలో… మా బలం ఏంటో ఇప్పటికైనా తెలిసిందా అంటూ రాష్ట్ర పార్టీ పెద్దలకు సందేశాలు పంపుతున్నారట. మీరుగనక మా డిమాండ్ లపై సానుకూలంగా స్పందించకుంటే పార్టీ మారడం ఖాయమని పరోక్షంగా తేల్చిచెప్తున్నట్టు సమాచారం.
తాజా పరిస్దితుల్లో ఎవరినీ వదులుకోవడానికి సిద్ధంగాలేని బీజేపీ అధిష్టానం… తాజా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యతను వాళ్ళకు వీళ్ళకు కాకుండా.. ఏకంగా ఈ వివాదానికి కేంద్ర బిందువైన నాగం వర్షిత్ రెడ్డికే అప్పజెప్పిందట. అందుకే వాళ్ళని బుజ్జగించేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓ వైపు దారికి రాని అసంతృప్తులు, మరోవైపు పొంచి ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లతో నల్గొండ బీజేపీ రాజకీయం రక్తి కడుతోంది. కాషాయంలో ప్యాచ్ వర్క్ ఎలా పూర్తవుతుందో చూడాలి మరి.