Site icon NTV Telugu

Off The Record: సాగర్‌లో సయ్యాట.. ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీ..!

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Off The Record: నోముల భగత్‌.. ఎంసీ కోటిరెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఇద్దరూ కలిసి ఉన్నట్టు కనిపించినా.. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య చాలా గ్యాప్‌ ఉంది. సీనియర్ రాజకీయ వేత్త నోముల నర్సింహయ్య 2018లో నాగార్జున సాగర్‌ నుంచి అధికారపార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హఠాన్మరణంతో వచ్చిన ఉపఎన్నికల్లో నర్సింహయ్య కుమారుడు భగత్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్తవానికి ఉపఎన్నికలోనే ఎంసీ కోటిరెడ్డి టికెట్‌ ఆశించారు. కానీ.. పార్టీ పెద్దల బుజ్జగింపులతో మెత్తబడ్డారు. కోటిరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ తర్వాత నిలబెట్టుకున్నారు కూడా. ఇలా నాగార్జున సాగర్‌కు చెందిన ఇద్దరు నేతలకు కీలక పదవులు లభించడంతో అంతా సర్దుకున్నట్టు భావించారు. కానీ.. అసలు కథ ఇక్కడే మొదలైందట.

Read Also: Off The Record: ఎమ్మెల్యే వసంత తీరుపై వైసీపీలో చర్చ.. చర్యలు భిన్నం..!

కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగిన కోటిరెడ్డి తర్వాత గులాబీ కండువా కప్పుకొన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక నాగార్జుసాగర్‌లో తనదైన శైలిలో రాజకీయాలకు తెరలేపినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్‌ అని ప్రచారం చేసుకుంటూ.. ఆ మేరకు పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. ఈ అంశాలపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హాలియా పర్యటనలో బహిరంగ వేదికపై ఎమ్మెల్సీ కోటిరెడ్డిని పార్టీ పెద్దలు పరోక్షంగా హెచ్చరించారు కూడా. ఆ తర్వాత కొద్దిరోజులు కోటిరెడ్డి సైలెంట్‌ అయ్యారు. కానీ.. తాజాగా ఆయన స్పీడ్‌ పెంచడంతో సాగర్‌లో నేతల మధ్య సయ్యాట మళ్లీ మొదటికొచ్చిందని అనుకుంటున్నారు .

Read Also: Off The Record: పక్కా ప్లాన్‌..! రేవంత్‌ పాదయాత్రపై కాంగ్రెస్‌ పార్టీలో చర్చ

నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం అని అధికారపార్టీ ఎప్పుడో చెప్పింది. అయినప్పటికీ నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్సీ అన్నింటిలో తలదూరుస్తున్నట్టు ఎమ్మెల్యే భగత్‌ గుర్రుగా ఉన్నారట. పోలీస్‌ స్టేషన్లలో పంచాయితీలు, తహశీల్దార్‌ కార్యాలయాల్లో తలెత్తే వివాదాల్లో ఒకరివైపు ఎమ్మెల్యే ఉంటే.. మరొకరివైపు ఎమ్మెల్సీ ఉంటున్నారట. దీంతో అధికారులు ఇద్దరు నేతల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే వర్గం చేస్తున్న ఆరోపణలను కోటిరెడ్డి వర్గం ఖండిస్తోంది. ఎమ్మెల్యే భగత్ మాత్రం నియోజకవర్గం బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రెండువర్గాలు తగ్గేదే లేదన్నట్టుగా ఎత్తులు వేస్తున్నారు. మరి. ఈ సమస్యకు అధిష్ఠానం ఎలాంటి పరిష్కారం సూచిస్తుందో కాలమే చెప్పాలి.

Exit mobile version