Site icon NTV Telugu

Off The Record: రాజగోపాల్ రెడ్డి మునుగోడు మద్యం వ్యాపారానికి షరతులు పెట్టారా?

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

Off The Record: మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు స్పెషల్‌ రూల్స్‌ అప్లయ్‌ చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నా నియోజకవర్గం, నా ఇష్టం అన్నట్టుగా ఆయన పెట్టిన కండిషన్స్‌ ప్రభావం తాజా లిక్కర్ టెండర్లపై స్పష్టంగా కనిపిస్తోందట. రాజగోపాల్ రెడ్డి న్యూ రూల్స్ అండ్ కండీషన్స్‌తో ఇప్పటికే టెండర్లు వేసిన వ్యాపారులు కూడా దేవుడా… లక్కీ డ్రా మాకు తగలకుండా చూడమని దండాలు పెట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇక కొత్తగా టెండర్స్‌ వేయడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారట. తన పరిధిలోని వైన్‌ షాపులకు స్థానికులో టెండర్‌ వేయాలన్నది రాజగోపాల్‌రెడ్డి ఫస్ట్ రూల్. ఇక షాపులను ఊరికి దూరంగా పెట్టుకోవాలని, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి..వ్యాపారం చేసుకోవాలని, పర్మిట్ రూమ్స్‌కు అస్సలు పర్మిషన్‌ లేదని, సిండికేట్‌ను సహించే ప్రసక్తే లేదంటూ…తన సొంత రాజ్యాంగం రాసేశారు ఎమ్మెల్యే. దీంతో మద్యం వ్యాపారులకు వణుకు పుడుతోందట. భయపడుతూ బిజినెస్‌ చేసే బదులు అసలు మానుకుంటే పోలా అని ఆలోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 29 మద్యం దుకాణాలకు 2023-2025లో 1499 టెండర్లు దాఖలవగా…. తాజాగా 25-27 కోసం వెయ్యిలోపే వచ్చాయట.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నయా రూల్సే ఇందుకు కారణమని తెలుస్తోంది. దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఒక కారణం అయితే.. ఆయన గెలిచిన నాటి నుండి బెల్ట్ షాపులకు చెక్ పెట్టడం, కొత్త షాపుల్లో కూడా పర్మిట్ రూమ్ లకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పడం కూడా మరో కారణమంటున్నారు. వైన్స్ షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్‌ నడిస్తేనే లిక్కర్ వ్యాపారం సవ్యంగా ఉంటుందని అంటున్నారు వ్యాపారులు. కానీ… రాజగోపాల్ రెడ్డి గెలిచిన నాటి నుండి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు మూత పడటంతో లిక్కర్ వ్యాపారుల గల్లాపెట్టె కళ తప్పిందట. ఇక కొత్తగా వచ్చే షాపులకు పర్మిట్ రూమ్స్‌ని కూడా అనుమతించకపోతే తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిందేనని అంటున్నారు లిక్కర్ వ్యాపారులు. ఇక్కడ బెల్ట్ షాపులను మూసివేయడంతో.. నియోజకవర్గ సరిహద్దు గ్రామాల్లో బెల్ట్ షాపుల డైలీ క్యాష్ కౌంటర్.. మునుగోడు నియోజకవర్గంలోని మెయిన్‌ వైన్స్‌ షాపులకంటే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. టెండర్లు ధాఖలు చేస్తే దివాళా తీయడం ఖాయమని భావిస్తూ… ఈసారి దూరంగా ఉంటున్నారట ఎక్కువ మంది వ్యాపారులు. తన స్టేట్‌మెంట్స్‌తో ఎమ్మెల్యే… మా నోటి కాడి ముద్ద… మందు బాబుల నోటికాడ సీసాను లాగేస్తున్నారంటూ పెదవి విరుస్తున్నారు లిక్కర్ వ్యాపారులు.

Exit mobile version