NTV Telugu Site icon

Off The Record: సీతక్క అనుచరుల తీరుతో కేడర్ విసిగిపోయిందా?

Seethakka

Seethakka

Off The Record: తెలంగాణ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో ఆమె ప్రారంభించిన శిలాఫలకాల ధ్వంసం చర్చనీయాంశం అవుతోంది. మొన్న కొండాయి గ్రామంలో, నిన్న అబ్బాయిగూడెంలో వరుసగా సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలనే ధ్వసం చేశారు గుర్తు తెలియని దుండగులు. గిరిజనుల అవసరాలకు కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను పగలగొడుతున్నది స్వపక్ష నేతలా విపక్ష నాయకులా అన్నది హాట్‌ టాపిక్‌ అయ్యింది వరంగల్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై తొమ్మిదిన్నర లక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం కోసం 2024 మార్చి 16న శిలాఫలకం ఆవిష్కరించారు మంత్రి. కానీ…10 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి పనులు మొదలు కాలేదంటూ ఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆ చర్చ జరుగుతుండగానే… అబ్బాయిగుడెంలో రహదారి నిర్మాణం కోసం ఆవిష్కరించిన మరో శిలాఫలకం ధ్వంసమైంది. దీని వెనక ఎవరున్నారని ఆరా తీస్తే… సొంత పార్టీ నేతలేనని తేలుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Also: IND vs ENG: భారత్ ఘన విజయం.. అభిషేక్ శర్మ ఊచకోత..

సీతక్కపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ములుగు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్లో పెరిగిన అసంతృప్తికే ఇందుకు కారణమన్న వాదన ఉంది. అలాగే ములుగు జిల్లా కాంగ్రెస్ క్రింది స్థాయి కార్యకర్తల్లో పెరిగిన విభేదాలు కూడా రీజన్‌ అయి ఉండవచ్చంటున్నారు. సీతక్క పేరు చెప్పి కొందరు అనుచరులు వ్యవహరిస్తున్న తీరుతో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీలో చీలికలు మొదలయ్యాయట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిత్యం తమకు అందుబాటులో ఉన్న సీతక్క మంత్రి అయ్యాక పట్టించుకోవట్లేదన్న భావన పెరుగుతోందట ఆమె అనుచరగణంలో. దీన్ని అలుసుగా చేసుకుని కొందరు చెలరేగిపోవడం సమస్యను మరింత పెంచుతోందని అంటున్నారు. మంత్రి హోదాలో ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండాల్సి రావడంతో…స్థానికంగా ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారట ఆమె. ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుంటున్న కొందరు సీనియర్ నాయకులు… సాధారణ కార్యకర్తలు అసలామె దగ్గరికి కూడా వెళ్ళకుండా అడ్డుపడుతుండటంతో… మండిపోయి ఇలా శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అంతే కాదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టుబట్టి నిధులు తీసుకొచ్చి పనులు చేయించిన సీతక్క మంత్రి అయిన తర్వాత రాళ్ళు వేయడానికే పరిమితమయ్యారని, పనులు జరగడం లేదన్న అసంతృప్తి కూడా పెరుగుతోందట.

Read Also: Davos Tour: సన్​ పెట్రో కెమికల్స్​ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం.. 7,000 మందికి ఉద్యోగాలు

ఇలా అన్నీ కలగలిపి నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగానే ఫలకాలు పగుల్తున్నట్టు సమాచారం. ఇటీవల మంగపేట మండలం కమలాపురంలో ఈవో బదిలీపై సొంత పార్టీ శ్రేణులే పార్టీ కార్యక్రమాలు బహిష్కరిస్తామని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఘటన మరువకముందే…సంక్రాంతి పండుగ సందర్భంగా ఏటూరునాగారంలోని ఓ వ్యాపార సముదాయంలో డ్రా తీయడానికి మంత్రి సీతక్క వెళ్లితే .. ఇక్కడ కూడా రచ్చ అయింది. సీతక్కను ఆమె వెంట ఉన్న కొందరు తప్పుదారి పట్టిస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మోసిన వారిని కాకుండా వేరేవాళ్ళని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారశైలి నచ్చకనే శిలాఫలకాలు ధ్వంసం చేసి మంత్రి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక ఎన్నికలవేళ సొంత పార్టీ కార్యకర్తల తీరు మంత్రికి తలనొప్పిగా మారుతుందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. దీన్ని సీతక్క ఎలా సెట్‌ చేసుకుంటారో చూడాలి మరి.