మంత్రి పినిపె విశ్వరూప్ రాజకీయ వారసుడిగా చిన్న కొడుకు శ్రీక్రాంత్ ఎంట్రీకి వైసీపీ అధిష్ఠానం ఓకే చెప్పిందట. విశ్వరూప్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అమలాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కుమారుడిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశారట. దీంతో కొంతకాలంగా విశ్వరూప్ వారసుడి ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఇటీవల ముంబైలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు మంత్రి. హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటూ.. అప్పుడప్పుడూ అమలాపురం, తాడేపల్లికి వచ్చి వెళ్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమలాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆగిపోయింది. వచ్చే ఎన్నికల్లో విశ్వరూప్ పోటీ చేస్తారా లేదా అనే చర్చ కూడా మొదలైంది. ఈ గందరగోళానికి తెరదించేందుకు చిన్న కుమారుడికి బాట వేస్తున్నారు మంత్రి.
Read Also: OTR about Janasena Party: జనసేనాని వడపోతలు..! పీఆర్పీలో పనిచేసిన నేతలకు గాలం..!
విశ్వరూప్‌కు ఇద్దరు కుమారులు. పెద్దోడు కృష్ణారెడ్డి. రెండోవాడు శ్రీకాంత్. కృష్ణారెడ్డి పొలిటికల్‌గా యాక్టివ్. కాకపోతే అమలాపురం అల్లర్ల తర్వాత కృష్ణారెడ్డి వైఖరి మంత్రికి రివర్సైందనే అభిప్రాయం ఉంది. దాంతో ఇద్దరిలో ఎవరికి రెడ్ కార్పెట్ పరచాలనేదానిపై మంత్రి ఇంట్లో చర్చలు జరిగినట్టు సమాచారం. తల్లి కృష్ణారెడ్డికి మద్దతుగా నిలవగా.. విశ్వరూప్ చిన్నోడు శ్రీకాంత్‌కు ఓటేశారట. ఈ సందర్భంగా అమాత్యులవారి ఫ్యామిలీలో చిన్నపాటి కలహం వచ్చినట్టు సమాచారం. కృష్ణారెడ్డిని బుజ్జగించి.. కుటుంబసభ్యులందరినీ విశ్వరూప్ ఒప్పించారట. ఆ నిర్ణయాన్ని వైసీపీ పెద్దలకు చెప్పి.. శ్రీకాంత్‌ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది.
వారసుడికి పగ్గాలు అప్పగిస్తే మంత్రి విశ్వరూప్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కోనసీమలో చర్చగా మారింది. విశ్వరూప్ అమలాపురం అసెంబ్లీకి పోటీ చేయకపోతే జిల్లా పార్టీ పగ్గాలు చేపడతారని అనుకుంటున్నారట. అలాగే వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్ పోటీపైనా సందిగ్ధత నెలకొందట. చిన్నోడు అసెంబ్లీకి పోటీ చేస్తారా.. అమలాపురం పార్లమెంట్ బరిలో ఉంటారా అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువని కొందరి వాదన. ప్రస్తుతం అమలాపురంలో గడప గడప కార్యక్రమం పెంచాలని పార్టీ పెద్దలు సూచించారట. ఎంపీ చింతా అనురాధ.. శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్యక్రమం తిరిగి ప్రారంభించాలని అధిష్ఠానం ఆదేశించిందట. ఎంపీ అనురాధ సైతం.. వచ్చే ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ లేదా పిగన్నవరం అసెంబ్లీ టికెట్ కోరుతున్నారట. ఒకవేళ పార్టీ పెద్దలు ఆమెను అసెంబ్లీ బరిలో దించితే.. విశ్వరూప్ కుటుంబంలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఈ అంశంపై ఎవరూ పెదవి విప్పకపోయినా.. తెరవెనక మాత్రం ప్రయత్నాలు ప్రారంభించారట.
