Off The Record: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ పార్టీని వదిలేసిన మంత్రి..!

  • నిడదవోలు నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలు వీక్‌..
  • మంత్రి ఉన్న చోట కేవలం 19వేల సభ్యత్వాలు..
  • దుర్గేష్‌ చూపు ఇప్పటికీ రాజమండ్రి రూరల్‌ వైపే ఉందా?..
  • నిడదవోలు జనసేన కేడర్‌ని ఓన్‌ చేసుకోలేకపోతున్నారా?..
  • రాజమండ్రి రూరల్‌లో పార్టీ ఆఫీస్‌ ఏర్పాటు అందుకేనా?..
  • మంత్రి అటు వెళ్ళగానే వదిలేస్తున్న నిడదవోలు కేడర్‌..
  • లోకల్‌ ద్వితీయ శ్రేణిలో సైతం నిస్తేజం..
  • కేవలం 4 గ్రామాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం..
  • నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ పార్టీని వదిలేసిన మంత్రి..
Otr Kandula Durgesh

Otr Kandula Durgesh

Off The Record: తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు కీలకమైన నియోజకవర్గాల్లో నిడదవోలు ఒకటి. కానీ…ఇక్కడే పార్టీ వీక్‌ అవుతోందన్న ఆందోళన ప్రస్తుతం ద్వితీయ శ్రేణిలో పెరుగుతోంది. స్వయంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ప్రాతినిధ్యం వహిస్తున్నా…. సెగ్మెంట్‌లో పార్టీ కార్యకలాపాలు నెమ్మదిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. లోకల్‌గా సభ్యత్వ నమోదే ఇందుకు ఉదాహరణ అంటూ చూపిస్తున్నారు నాయకులు. అత్యంత కీలకమైన చోట కేవలం 19 వేల సభ్యత్వాలు మాత్రమే అయ్యాయట ఇక్కడ. అలా ఎందుకంటే… కారణాలు చేలానే ఉన్నాయిగానీ, మంత్రి సరిగా ఫోకస్‌ పెట్టకపోవడమే మెయిన్‌ అని అంటున్నారు. వాస్తవానికి రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్‌సొంత నియోజకవర్గం. అందుకే ఆయన చూపు ఎప్పుడూ అటువైపే ఉంటుంది. అక్కడే నిలదొక్కుకుని రాజకీయం చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ… గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా ఆ సెగ్మెంట్‌ టీడీపీ కోటాలోకి వెళ్ళిపోయింది. దాంతో దుర్గేష్‌ కాస్త అయిష్టంగానే నిడదవోలుకు షిఫ్ట్‌ అవ్వాల్సి వచ్చిందని చెబుతారు. తనను గెలిపించి మంత్రిని చేసినాసరే…. ఆయన ఇప్పటికీ నిడదవోలు జనసేన కేడర్‌ని ఓన్‌ చేసుకోలేకపోతున్నారన్న అసహనం లోకల్‌ పార్టీలో ఉంది. ఎంతసేపూ చూపు రాజమండ్రివైపే ఉండటం కారణంగా…ఇక్కడి పార్టీ వ్యవహారాలను సరిగా పట్టించుకోవడం లేదని, సభ్యత్వ నమోదులో వెనుకబడటానికి అదే ప్రధాన కారణం అంటున్నారు కార్యకర్తలు.

జనసేన జిల్లా కార్యాలయాన్ని కూడా రాజమండ్రి రూరల్ ఏరియాలో ఏర్పాటు చేయడమే ఇందుకు ఉదాహరణ అని కూడా చెబుతున్నారు కొందరు. యధా రాజా తధా ప్రజ అన్నట్టుగా… ఈ పరిస్థితుల్లో నిడదవోలు జనసేన కేడర్‌ కూడా దూకుడుగా ఉండలేకపోతోందట. ఆయన వచ్చినప్పుడు, ఏదన్నా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాత్రమే పార్టీ శ్రేణుల్లో కదలిక, హంగామా కనిపిస్తున్నాయి తప్ప… ఆ తర్వాత ఎవరి దారి వారిదేనన్నట్టు పరిస్థితులు మారిపోతున్నట్టు చెబుతున్నారు. అసలు మంత్రి నియోజకవర్గం బోర్డర్‌ దాటగానే స్థానిక నాయకుల్లో ఎక్కడ లేని నిస్తేజం ఆవహిస్తోందని అంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం కనిపించకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోంది. మామూలుగా అయితే…. మంత్రుల నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి యాక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళు రాష్ట్ర వ్యాప్త పర్యటనల్లో బిజీగా ఉంటే… నియోజకవర్గ సమన్వయ బాధ్యతల్ని ఆ తర్వాతి స్థాయిలో చూసుకుంటారు. కానీ… నిడదవోలులో మాత్రం మొత్తం తేడాగానే ఉందట. ఇక్కడ అలాంటి వాతావరణమే లేదని అంటున్నాయి జనసేన వర్గాలు. చివరికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణలో కూడా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని అంటున్నారు.

నియోజకవర్గం మొత్తం మీద కేవలం నాలుగు గ్రామాల్లోనే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే విజ్జేశ్వరం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. స్థానిక జనసేన నేతలు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో కుమ్మక్కై ఈ వ్యవహారం నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కోడి పందాల వ్యవహారంలో కూడా కొంతమంది నాయకుల పాత్రపై అనుమానాలున్నాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్న ఆవేదన ఓ వర్గంలో వ్యక్తం అవుతోంది. నాయకులు తమను పట్టించుకోవడం లేదని, ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నామని శ్రేణులు వాపోతున్నాయి. మంత్రి జోక్యం చేసుకుని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీద చర్యలు తీసుకుని నిబద్ధత కలిగిన వారికి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. లేకపోతే నిడదవోలులో జనసేనకు భారీ నష్టం తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే…. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. దుర్గేష్‌ నిడదవోలు జనసేనను లైట్‌ తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నా…నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 349 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయం లాంటి కల్పిస్తున్నారు. ఆ పరంగా ఓకే అనిపించుకుంటున్నా… పార్టీని మాత్రం పూర్తిగా గాలికొదిలేశారని, రాజమండ్రి రూరల్‌ మీద మోజు తగ్గకపోవడం, తిరిగి అటు వెళ్ళాలని భావించడమే అందుకు కారణమా అన్న చర్చలు నడుస్తున్నాయి.