NTV Telugu Site icon

Off The Record: కాంగ్రెస్ పార్టీలో వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కు..?

Mancherial

Mancherial

Off The Record: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న నేతలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో ఇంకొకరి పెత్తనాలను జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగ వేదికలపైనే ప్రశ్నిస్తున్న ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీని డిసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావ్ నడిపిస్తున్నారు. జిల్లాలో మంచిర్యాలతోపాటు బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రేమ్ సాగర్ రావ్ కాంగ్రెస్‌పార్టీలో చేరికలను పర్యవేక్షిస్తున్నారు. ఇదే మిగతా రెండు నియోజవర్గాల్లోని పార్టీ నేతలతో తగువులకు కారణం అవుతోందట. చెన్నూర్‌లో రమేష్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించారు ప్రేమ్‌ సాగర్‌రావు. రమేష్‌కు.. ఈ నియోజకవర్గంలో ప్రేమ్‌ సాగర్‌రావు వర్గంగా ముద్ర ఉంది. ఇదే సమయంలో బెల్లంపల్లిలోనూ కొత్త వ్యక్తులను పార్టీలోకి పిలిచి వారిని ప్రోత్సహిస్తున్నట్టు మాజీ మంత్రి జి వినోద్‌ వర్గం అనుమానిస్తోంది. బెల్లంపల్లి టికెట్‌ను వినోద్‌ ఆశిస్తున్నారు. కానీ.. ప్రేమ్‌ సాగర్‌రావు కదిలికలు తనకు మద్దతిచ్చేలా లేవని.. పొగ పెట్టేలా ఉన్నాయని వినోద్‌ గుర్రుగా ఉన్నారట. కాంగ్రెస్‌లో పదవులు.. అన్నీ సొంత వర్గానికే ఇస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట మాజీ మంత్రి.

Read Also: Off The Record: దర్శి టీడీపీలో అయోమయం.. మాజీ ఎమ్మెల్యేకు సీటు టెన్షన్..?

చెన్నూరులో రమేష్‌ను అభ్యర్థిగా ప్రకటించినట్టే.. బెల్లంపల్లిలో వినోద్‌ను కాంగ్రెస్‌ క్యాండిడేట్‌గా ప్రకటించే సాహసం ప్రేమ్‌ సాగర్‌రావు చేయగలరా అని నిలదీస్తున్నారట. అయినా.. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో సంబంధం లేకుండా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని మాజీ ఎమ్మెల్సీపై కయ్‌ మంటున్నారు మాజీ మంత్రి అనుచరులు. చెన్నూరు, బెల్లంపల్లి కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికే పీసీసీ చీఫ్‌ చెవిలో ఒక మాట వేసి వచ్చారట. తమ నియోజవర్గాల్లో ఇతరుల పెత్తనాన్ని గట్టిగానే నిలదీసినట్టు చెబుతున్నారు. పీసీసీ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఢిల్లీలో హైకమాండ్‌ వరకు ఈ సమస్యను తీసుకెళ్తామని అల్టిమేటం ఇస్తున్నారట నాయకులు. ప్రేమ్‌ సాగర్‌రావును పార్టీ నాయకుడిగా తాము గౌరవిస్తామని.. అలాగని మంచిర్యాల దాటి వచ్చి ఇతర సెగ్మెంట్లలో వేలు పెడితే ఎలా అని లోకల్‌ కాంగ్రెస్‌ శ్రేణులు వాపోతున్నాయట. అసలే ఎన్నికల ఏడాది కావడంతో.. టికెట్స్‌పై చాలా మంది కాంగ్రెస్‌ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. టికెట్ కోసం ఎవరికివారు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. మరి.. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో రేగిన ఈ పంచాయితీ టీ కప్పులో తుఫానుగా చల్లారిపోతుందో.. లేక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీలు ఆధిపత్యపోరును మరింత దూరం తీసుకెళ్తారో చూడాలి.