Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?

  • తుది ఓటర్ల జాబితా రూపకల్పనకు ఇంకో నెలన్నర టైం..
  • ఖైరతాబాద్‌లో లక్షా 23వేల 472 మంది ఓటర్లకు నోటీసులు..
  • నియోజకవర్గంలోని 42 శాతం ఓటర్స్‌కు నిరూపించుకోమని నోటీసులు..
  • లక్షా 23 వేల 472 నోటీస్‌లకు గాను స్పందించింది 15 నుంచి 20వేల మందే..
  • ఎగిరిపోయే ఓట్లే ఎక్కువ ఉండవచ్చన్న అంచనా..
  • భారీగా ఓట్ల రద్దు ప్రభావం ఎవరిపై పడుతుందన్న చర్చలు..
  • ఖైరతాబాద్‌లో 60 నుంచి 70వేల ఓట్ల రద్దుకు అవకాశం..
Otr Khairatabad

Otr Khairatabad

Off The Record: ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ సెగ్మెంట్‌కు సుప్రీం కోర్ట్‌ తీర్పు తర్వాత…ఇక రెండో ఆలోచన లేకుండా బైపోల్‌కు రంగం సిద్ధమవుతోంది.అధికార, ప్రతిపక్షాలు ఒక వైపు అభ్యర్థుల వేటలో బిజీగా ఉంటే… మరోవైపు సర్‌.. సుర్‌ సుర్‌మనిపిస్తోందట. ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చివరి అంకంలో ఉంది. ఇందులో భాగంగా… నియోజకవర్గంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా… మీరే ఆ ఓటర్ అని నిరూపించుకోమంటూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి నోటీస్‌లు ఇచ్చింది ఈసీ. కానీ… వాటికి స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంటోంది. తుది ఓటర్ల జాబితా రూపకల్పనకు మరో నెలన్నర సమయం ఉండటంతో చివరి వరకు ఏమైనా జరుగొచ్చని అంచనా వేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇక ఉప ఎన్నిక జరగబోతున్న ఖైరతాబాద్‌ విషయానికి వస్తే… తెలంగాణ SIR 2026 డ్రాఫ్ట్ ఓటర్‌ జాబితా ప్రకారం, ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో లక్షా 23వేల 472 మంది పేర్లు ASDD కేటగిరీలోకి వెళ్లాయి.

అంటే… వాళ్ళంతా అది మేమేనని నిరూపించుకోవాలన్న మాట. ఆబ్సెంట్, అడ్రస్‌ మారినవారు, డూప్లికేట్‌ ఓట్లు, చనిపోయిన వారికి సంబంధించినవి…ఇలా వివిధ కేటగిరీలకు సంబంధించినవి ఇందులో ఉండగా… అందరికీ నోటీసులు జారీ అయ్యాయి. SIRకు ముందు ఖైరతాబాద్ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 2 లక్షల 93వేల 667కాగా…అందులో దాదాపు 42 శాతం ఓటర్లకు నోటీస్‌లు ఇచ్చారు. ఓటర్ ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం, ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన చిరునామా ట్రేస్ అవకపోవడం, శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారినట్లు గుర్తించడం, ఒక ఓటర్‌కు మరో ప్రాంతంలో కూడా ఓటు ఉన్నట్లు గుర్తించడం, చనిపోయినవారి పేర్లు ఉండటం లాంటివన్నిటినీ గుర్తించి నోటీస్‌లు ఇచ్చారు. అవన్నీ పోగా… ఇక ఖైరతాబాద్‌లో నికరంగా మిగిలినవి లక్షా 70వేల ఓట్లు. అయితే… నోటీస్‌లు అందుకున్న వారి వివరణలు, ఆధారాలు సమర్పించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నా… అది ఆశించిన మేర లేదంటున్నారు. లక్షా 23వేల 472 మందికి నోటీస్‌లు ఇస్తే…వారాలు గడిచిపోతున్నా…స్పందించింది 15 నుంచి 20 వేల మంది ఓటర్లేనట.

దీంతో… చివరికి వాళ్ళలో ఎంత మంది సమాధానం ఇస్తారు? ఎన్ని ఓట్లు ఎగిరిపోతాయన్న ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితి, స్పందనను బట్టి చూస్తుంటే…ఉండే వాటికంటే ఎగిరిపోయే ఓట్లే ఎక్కువగా ఉండవచ్చంటున్నారు. దీంతో… రేపు ఉప ఎన్నికలో ఆ ఎఫెక్ట్‌ ఎవరి మీద పడుతుందన్న రాజకీయ చర్చలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు ఉప ఎన్నిక ఖాయమైనా…. అది ఎప్పుడన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే… పోలింగ్‌కు పది రోజుల ముందు వరకు కూడా… ఫామ్-6 ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కును కల్పిస్తారు. దాంతో…చివరికి ఎన్ని ఓట్లు ఉంటాయో, ఆ పోయేవి ఎవరి మీద ప్రభావం చూపుతాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఓవరాల్‌గా ఖైరతాబాద్‌లో 60 నుంచి 70 వేల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందన్నది ప్రాధమిక అంచనా. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ఓట్ల గల్లంతు అంటే అదేం చిన్న విషయం కాదు. అందుకే ఏం జరగబోతోందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.