Off The Record: తెలంగాణ రక్షణసేన చీఫ్.. కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం ఆమె నిజామాబాద్ జిల్లా పై ఫోకస్ పెంచుతున్నారన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నట్లుగా… తాను ఎంపీగా ఓడిన జిల్లాలోనే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తాను గట్టి ప్రత్యర్థిగా భావిస్తున్న బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తన పార్టీ టీఆర్ఎస్ ప్రాబల్యం పెంచే దిశగా కసరత్తులు చేస్తున్నారట ఆమె. అందులో భాగంగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో… తన అత్తారిల్లు ఉన్న నియోజకవర్గం బోధన్ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లా నుంచే పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన కవిత…. ఇప్పుడిక మెట్టినింటి నుంచే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
కవిత బోధన్ బరిలో దిగడం దాదాపు ఖాయమని అంచనా వేస్తున్న క్రమంలో… అధికార కాంగ్రెస్‌తో పాటు గులాబీ పార్టీలో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించగా…. ఇక గెలుపు నాదే అంటూ సన్నిహితుల దగ్గర ధీమా వ్యక్తం చేశారట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్. అయితే… ఇప్పుడు కవిత బరిలో దిగుతారన్న ప్రచారం షకీల్ టీమ్‌ను టెన్షన్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో… ఒక రకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను శాసించారు కవిత. పార్టీతో పాటు పాలనా వ్యవహారాల్లో కూడా.. తిరుగులేని ఆధిపత్యం చెలాయించడంతో…. అప్పట్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బాగా ఇబ్బందిగా ఫీలయ్యారని అంటారు. దీంతో … తాము మాజీలయ్యాక కూడా 2019 లోక్‌సభ ఎన్నికల్లో వాళ్ళంతా కలిసి ఎంపీగా కవితను ఓడించారట. ఇదే విషయాన్ని కవిత అవకాశం దొరికినప్పుడల్లా.. రాజకీయ వేదికలపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కవిత.. సొంత పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే.. నాడు తనను ఓడించిన వాళ్ళ మీద రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని, సొంత జిల్లా నుంచే అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు… నిజామాబాద్ జిల్లా నుంచే తాను పోటీ చేస్తానని సన్నిహితులతో అన్నట్టు తెలిసింది. జిల్లా నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నందున పట్టు ఉందని,ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారట ఆమె.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన మాజీ ఎమ్మెల్యేలకు రిటర్న్ గిప్ట్ ఇస్తానని గట్టిగానే చెబుతున్నారట కవిత. అందులో భాగంగా ముందు తన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారామె. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసుల భయంతో దుబాయ్‌కి పరిమితం అయ్యారట. తన భార్య ఆయేషా ఫాతిమాను బరిలో దించే ఆలోచనలో ఫన్నారట షకీల్. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే… బోధన్ నుంచి పోటీ తనకు కలిసొస్తుందని కవిత లెక్కలేసుకుంటున్నట్టు సమాచారం. రాజకీయ సమీకరణల దృష్ట్యా చూసుకున్నా….బోధన్ అనువైన క్షేత్రంగా అనుకుంటున్నట్టు తెలిసింది. కవిత పోటీపై దాదాపుగా క్లారిటీ రావడంతో.. కాంగ్రెస్-బీజేపీ నేతలు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలనే యోచనలో ఉన్నారట. ఆమెను ఎమ్మెల్యేగా ఓడించాలని వ్యతిరేక వర్గం, గెలిపించాలని అనుకూల వర్గం ఎవరికి వారే కసరత్తులు మొదలు పెడుతున్నారు.
