Site icon NTV Telugu

Off The Record: కనిగిరి వైసీపీలో ఆధిపత్యపోరు.. ఎమ్మెల్యే వర్సెస్‌ పార్టీ నేత..!

Kanigiri

Kanigiri

Off The Record: బుర్రా మధుసూదన్‌ యాదవ్‌. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే. ఆ మధ్య వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ పనితీరును కొలమానంగా చూపిస్తూ.. ఆరు నెలలు తిరక్కుండానే అధ్యక్ష బాధ్యతల నుంచి బుర్రాను తప్పించింది పార్టీ అధిష్ఠానం. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బుర్రాకు కేడర్‌కు మధ్య గ్యాప్‌ వచ్చింది. సొంత సామాజికవర్గానికి చెందిన నేతలతోపాటు.. రెడ్డి సామాజికవర్గంతోనూ ఎమ్మెల్యేకు పడటం లేదు. దీంతో కనిగిరి వైసీపీలో రెండు గ్రూపులు తయారయ్యాయి. రెడ్డి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి మరో పవర్‌ సెంటర్ అయ్యారనేది ఎమ్మెల్యే వర్గం ఆరోపణ. ప్రస్తుతం బుర్రా, చింతలచెరువు మధ్య ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈసారి టికెట్‌ తమ నేతకే అని రెడ్డి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అనుచరులు ప్రచారం మొదలు పెట్టేశారు. సమస్యను ఆలస్యంగా గుర్తించిన బుర్రా దిద్దుబాటు చర్యలు చేపట్టినా.. ఆయనకు లోపల గుబులుగానే ఉందట.

Read Also: Off The Record: అమిత్ షా అంత సమయం ఎలా ఇచ్చారు?.. హాట్‌ టాపిక్‌గా మారిన రామచంద్రయాదవ్‌..

ఈ మధ్య రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల విషయంలో అధికారులు కొందరిని టార్గెట్‌ చేసి నోటీసులు ఇవ్వడం కొత్త వివాదాన్ని రాజేసింది. ఎమ్మెల్యేకు దూరంగా ఉన్నవారిని టార్గెట్‌ చేశారని చర్చ మొదలైంది. కొందరు అసమ్మతి నేతలు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి ఆయన్ను ప్రసన్నం చేసుకున్నారట. మరికొందరు ఏదైతే అదవుతుందని బూర్రాకు దూరంగానే ఉన్నారట. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలకు పోతున్నారని నిప్పులు తొక్కుతున్నారట. కనిగిరి, వెలిగండ్ల, హెచ్ఎం పాడు జడ్పీటీసీలు, పలువురు వైసీపీ నేతలు ఎమ్మెల్యేపై పార్టీ పెద్దలు బాలినేని, వైవీలతోపాటు రీజనల్ కోఆర్డినేటర్లు బీదా మస్తానరావు, భూమన కరుణాకర్ రెడ్డిలకు ఫిర్యాదులు చేశారట. ఇక జనవరి ఒకటిన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలోనూ బుర్రా, చింతలచెరువు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరి ఫ్లెక్సీలకు అడ్డుగా మరొకరు ఫ్లెక్సీలు పెట్టారని దుమారం రేగింది. ఇది రెండు వర్గాల మధ్య ఢీ అంటే ఢీ అనుకునే పరిస్థితికి దారితీయడంతో సమస్య పార్టీ పెద్దల దగ్గరకు వెళ్లింది. 2019 నుంచి జరిగిన.. జరుగుతున్న గొడవలను ఏకరవు పెట్టారట. దీంతో కనిగిరి వైసీపీలో గొడవలను అధిష్ఠానం ఎప్పుడు పరిష్కారిస్తుందో అని కేడర్‌ ఎదురు చూస్తోంది.

Exit mobile version