NTV Telugu Site icon

Off The Record: కాకినాడ రూరల్‌ కొత్త సమీకరణాలు..? సైకిల్ హ్యాండిల్‌ కొత్త వారికి ఇస్తారా?

Tdp

Tdp

Off The Record: కాకినాడ రూరల్ నియోజకవర్గానికి టీడీపీకి ఇన్చార్జి లేరు. ప్రస్తుతం ఉన్న నేతల్లో ఎవరికీ టిక్కు పెట్టడం లేదు అధిష్ఠానం. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన విభేదాల వల్ల పిల్లి ఫ్యామిలీ టీడీపీకి దూరంగా ఉంది. పార్టీ అధినేత జిల్లాకు వచ్చినా కనీసం అటువైపు కూడా చూడలేదు కానీ.. తర్వాత టీడీపీ అధినేతను కలిసి మళ్లీ రూరల్‌ నియోజకవర్గంలో పిల్లి కుటుంబం తళుక్కుమంది. మాజీ ఎమ్మెల్యేకే ఇంఛార్జ్‌గా పగ్గాలు ఇస్తారని భావించినా.. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాడి వదిలేసిన వారిని అందలం ఎలా ఎక్కిస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నించారట. ప్రస్తుతం పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాలు కాకుండా సొంతంగా ప్రొగ్రామ్స్‌ పెట్టుకుని తిరుగుతున్నారు పిల్లి అనంతలక్ష్మి. మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానిక టీడీపీలో ఓ టీమ్‌ కూడా పుట్టుకొచ్చింది. ఈ రెండు వర్గాల గొడవలు ఎలా ఉన్నా.. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న తరుణంలో టీడీపీ నేత కటకంశెట్టి ప్రభాకర్ కార్యక్రమాల స్పీడ్‌ పెంచడం చర్చగా మారింది. తన సామాజికవర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉండటంతో.. ఛాన్స్‌ ఇస్తే సత్తా చాటుతానని టీడీపీ అధిష్ఠానానికి సంకేతాలు పంపుతున్నారట ప్రభాకర్‌.

Read Also: Off The Record: అసెంబ్లీ ఎన్నికల బరిలో బండి సంజయ్‌.. అనుచరుల సమావేశంలో చెప్పేశారా?

గతంలో మూడుసార్లు టీడీపీ జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు కటకంశెట్టి ప్రభాకర్‌. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. మొదటి నుంచీ టీడీపీలో ఉన్నానని.. పార్టీ గెలిచినా, ఓడినా పసుపు జెండా విడిచి పెట్టలేదనే స్లోగన్‌తో తెలుగు తమ్ముళ్ల దగ్గరకు వెళ్తున్నారట. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబంతో ఉన్న రాజకీయ సాన్నిహిత్యం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారట ప్రభాకర్‌. తనను టీడీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించి.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తే గెలిచి సత్తా చాటుతామని ఆంతరంగిక సమావేశాల్లో ప్రభాకర్‌ వ్యాఖ్యానిస్తున్నారట. ఇప్పటి వరకు శెట్టిబలిజలకు కాకినాడ రూరల్‌ టికెట్‌ కేటాయిస్తూ వస్తోంది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో మాత్రం కాపు సామాజికవర్గానికి సీటు ఇస్తారని చర్చ సాగుతోంది. పక్కనే ఉన్న రామచంద్రపురం ఇంఛార్జ్‌గా శెట్టిబలిజ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యంను ప్రకటించడం… కాకినాడ సిటీ ఇంఛార్జ్‌గా మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఉండటంతో.. రూరల్‌ సీటు కాపులకే ఇస్తారనే చర్చ ఊపందుకుంది. కటకంశెట్టి ప్రభాకర్‌ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడే కావడంతో కుల సమీకరణాలు కలిసివస్తాయని ప్లస్‌లు మైనస్సులు వేసుకుంటున్నారట.

Read Also: Off The Record: అశ్వారావుపేట అధికారపార్టీలో హీట్‌

పిల్లి వ్యతిరేకవర్గంలో వాసిరెడ్డి ఏసుదాసు, పేరాబత్తుల రాజశేఖర్‌, శ్రీనివాసబాబా ఉన్నారు. వీరిలో ఏసుదాసు.. టీడీపీపై విరుచుకుపడే ముద్రగడ అనుచరుడిగా ముద్ర ఉంది. ఇక రాజశేఖర్‌కు నియోజకవర్గంతో సంబంధం లేదనే చర్చ సాగుతోంది. గతంలో ముమ్మిడివరం జడ్పీటీసీ. శ్రీనివాసబాబా గురించి కేడర్‌కే పెద్దగా తెలియదని టీడీపీ వర్గాల టాక్‌. ఈ సమీకరణాలు.. పరిణామాలు చూశాక.. ప్రభాకర్‌కు ఛాన్సెస్‌ ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారట. టీడీపీ పెద్దలతో ఉన్న పరిచయాలు ఆయనకు కలిసి వస్తాయనే చర్చ మొదలుపెట్టారు. మరి.. కాకినాడ రూరల్‌పై టీడీపీ అధిష్ఠానం క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.