Off The Record: తెలంగాణ రాజకీయంలో ఎక్కువ భాగం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బైపోల్ అనివార్యమైంది. ఇంకో రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో… ఇప్పటి నుంచే పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ మరో అడుగు ముందుకేసింది. ఇక్కడ అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఎన్నికల రంగంలో దూకుడు పెంచే ప్రయత్నంలో ఉంది. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో తాజాగా సమావేశమయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో మాగంటి గోపీనాథ్‌కు ఎలా సపోర్ట్ చేశారో… అలాగే ఇప్పుడు ఉప ఎన్నికలో ఆయన కుటుంబానికి సపోర్ట్ చేయాలని అనడం ద్వారా కొత్త చర్చకు తెరతీశారాయన.
Read Also: AP Politics : జనంలోకి వెళ్ళడానికి సిద్ధమౌవుతున్న జగన్
ఇలా చెప్పడం ద్వారా… ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి కుటుంబం నుంచే ఉంటారన్న క్లారిటీ ఇచ్చేశారన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రధానంగా… కేటీఆర్ ఆ ప్రకటన చేస్తున్న టైంలో… వేదిక మీద కూర్చున్న మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇవ్వబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మాగంటి సునీతకు టికెట్ ఇవ్వడం ద్వారా సెంటిమెంట్‌ని ఉపయోగించుకోవచ్చన్న ప్లాన్‌లో ఉందట గులాబీ పార్టీ. నియోజకవర్గం మొత్తం మీద గోపీనాథ్‌కు మంచి పేరుందని, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళంతా… సునీతను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని పార్టీ పెద్దలు లెక్కలేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఈ టిక్కెట్ కోసం పార్టీకి చెందిన మరికొందరు నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ… ఈ సమయంలో మాగంటి కుటుంబం నుంచి కాకుండా వేరే నేతకు టికెట్ ఇస్తే మాగంటి అనుచరులు, అభిమానం ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చని భావిస్తున్నారట గులాబీ పెద్దలు. అందుకే ఆయన భార్యకే టికెట్ ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి న్యాయం చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్.
Read Also: 6000mAh బ్యాటరీ, అధునాత AI ఫీచర్లు, IP65 రెసిస్టెన్స్‌తో Itel Super 26 Ultra స్మార్ట్ ఫోన్ లాంచ్!
గతంలో కూడా దుబ్బాక, నాగార్జున సాగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వారి కుటుంబానికి టికెట్లు ఇచ్చామని, ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే… మాగంటి గోపీనాథ్ భార్యవైపు మొగ్గుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో 16 వేలకు పైగా మెజార్టీతో గెలిచారు గోపీనాథ్. ఇప్పుడు వేరే వాళ్లకు టికెట్ ఇస్తే… అన్ని వర్గాలు కలిసి పనిచేసే అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేస్తోందట బీఆర్‌ఎస్ అధిష్టానం. పైగా… ఆయన కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇస్తే… సానుభూతి కలిసి రావచ్చని లెక్కలేస్తున్నారట. ఇప్పటికే రెండు మూడు సర్వేలు చేయించారని, ఆ కుటుంబానికి టికెట్ ఇస్తేనే గెలిచే అవకాశాలు ఉన్నాయన్న రిపోర్ట్ రావడం వల్లే మాగంటి సునీత టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి గులాబీ వర్గాల నుంచి. మొత్తం మీద ఆఖరు నిమిషంలో అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప… జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ టిక్కెట్ మాగంటి కుటుంబానికి ఖాయమైనట్టేనని అంటున్నాయి రాజకీయవర్గాలు.
