Site icon NTV Telugu

Off The Record: కాంట్రవర్సీ వివాదాలకు కేర్ ఆఫ్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి..!

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

Off The Record: రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వివాదాల్లో ఇరుక్కోవడం కామన్‌. ఆ మాత్రం లేకపోతే… మనకు కిక్కు ఉండదు, జనంలో గుర్తింపు దక్కదనుకునే వాళ్ళే ఎక్కువ. కానీ… నిరంతరం ఇంకా మాట్లాడుకుంటే…24/7 వైఫైలా వివాదాల్ని వెంటేసుకుని తిరుగుతుంటారు కొందరు నాయకులు. పోజిషన్‌లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా… మామాటే నడవాలంటారు, అలా జరగదని తెలిస్తే… ఏదో ఒక వివాదాన్ని రేపుతుంటారు. అలాంటి గొడవలతోనే కేరాఫ్‌ కాంట్రవర్శీగా మారారు తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇటీవల తరచూ ప్రభుత్వ అధికారుల మీద ఏదోరకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారాయన. అలా ఎందుకంటే వాళ్ళు రూల్స్‌ పాటించడం లేదన్నది సార్‌ వైపు నుంచి వచ్చే సమాధానం. అయితే ఇక్కడే సెటైరికల్‌ క్వశ్చన్స్‌ వేస్తున్నారు కొందరు. రూల్స్‌ అంటే… సదరు ఆఫీసర్స్‌ గవర్నమెంట్‌ రూల్స్‌ పాటించడం లేదా? లేక జేసీ రూల్స్‌ని పట్టించుకోవడం లేదా అని అడుగుతున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి వివాదాలు ఇవాళ కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో, కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పటి నుంచే…ఆయన తీరు గురించి రకరకాలుగా మాట్లాడుకునే వారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జేసీ ట్రావెల్స్‌ విషయమై రవాణాశాఖతో వివాదం తలెత్తింది. అప్పుడు హైదరాబాద్‌లో రవాణా శాఖ అధికారిపై నోరు పారేసుకున్నారు ప్రభాకర్ రెడ్డి. దాని మీద అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చినా… ఆయన తీరు మాత్రం మారలేదు. అధికారం ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో కూడా జేసీ తీరు మారలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడి ఓటమితో తాడిపత్రిలో మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో వాహనాల కొనుగోలు కేసుకు సంబంధించి తండ్రి, కొడుకులు జైలుకు వెళ్ళి వచ్చారు. ఆ తర్వాతి నుంచి మరింత దూకుడు పెంచారు మున్సిపల్‌ ఛైర్మన్‌. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద నిత్యం ఏదో ఒకటి మాట్లాడుతూ… వాటికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కానీ.. ఆ ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోకపోవడంతో జేసీ ఆగ్రహం కట్టలు తెంచుకునేదట. ఈ క్రమంలో ఒకసారి కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ కలెక్టర్ నాగలక్ష్మి సరిగా స్పందించలేదంటూ పేపర్లు టేబుల్ పై విసిరి పారేశారు. ఒక మహిళా అధికారి, అందునా జిల్లా కలెక్టర్‌ మీద ఇలా ఫైలు విసిరేయడం ఏం సంస్కారం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ ఘటన మీద ఐఏఎస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది. అలాగే…ప్రతిపక్షంలో ఉన్నప్పుడే డిఎస్పీ చైతన్యపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక పోలీసు అధికారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కూడా చాలాసార్లు విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు తన కుమారుడు ఎమ్మెల్యే అయ్యాక కూడా ఆయన మాటతీరులో ఏమాత్రం మార్పు రాలేదు.

ఇటీవల జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే. తాను చెప్పిన పనులు చేయడం లేదంటూ ఆఫీసర్‌ని ఇష్టానుసారంగా తిట్టారు. ఆ వీడియోలు వైరల్‌ అవడంతో… అధికారులంటే.. తన ఇంట్లో పాలేర్లని భావిస్తున్నారా అంటూ… పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా పోలీస్ అమరవీరుల దినోత్సవాల టైంలో ఒక పోలీస్‌ ఆఫీసర్‌ని తీవ్ర స్థాయిలో కించపరిచేలా ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద రచ్చ జరుగుతోంది. ఆ విషయంలో పోలీస్‌ అధికారుల సంఘం కూడా తీవ్రంగా రియాక్ట్‌ అయింది. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పోలీస్‌ అమరవీరు దినోత్సవంలో పాల్గొని పోలీసుల సేవలను కీర్తిస్తే….. అదే సమయంలో జేసీ మాత్రం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని తీవ్రంగా దూషించారు. నా దగ్గర కూడా లైసెన్స్‌డ్‌ గన్ ఉంది.. మీ ఇంటికి వస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. డ్యూటీలో ఉన్న ఒక ఉన్నతాధికారిని అలా బెదిరించడం, పైగా నీకు పోలీస్‌ ఉద్యోగం ఇచ్చింది ఎవడంటూ….కించపరితేలా మాట్లాడ్డంతో…. అధికారులంటే ఎందుకంత లెక్కలేనితనం? అన్న చర్చలు నడుస్తున్నాయి. అసలు జేసీది నోటి దురదా? లేక అంతకు మించిన మరొకటా అన్న ప్రశ్నలు వస్తున్నాయట అధికార వర్గాల్లో. ఎందుకిలా అని ఆయన సన్నిహితుల్ని అడిగితే… ఇక్కడ ఎవరూ రూల్స్‌ ఫాలో అవడం లేదన్నది ఆయన సమాధానంగా చెబుతున్నారు. దాంతో… రూల్స్‌ అంటే… ఎవరికి గవర్నమెంట్‌ రూల్సా? లేక జేసీ సొంత రాజ్యాంగంలోనివా అంటూ రివర్స్‌ క్వశ్చన్స్‌ వేస్తున్నారు పలువురు. ఒకవేళ నిజంగానే…. ఎవరైనా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే… వాళ్ళకు పనిష్మెంట్‌ ఇవ్వడానికి కూడా వ్యవస్థలు ఉన్నాయి కదా…? వాటిని కాదని నా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటానని ఒక సీనియర్‌ ప్రజాప్రతినిధి అనడం ఎంతవరకు కరెక్ట్‌? అది పద్ధతేనా? అన్న మాటలు వినిపిస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో.

Exit mobile version