Off The Record: ఉత్తరాంధ్రలో చేరికలపై ఫోకస్ పెట్టిన జనసేన.. తొలి ప్రయత్నం భీమిలి నుంచే ప్రారంభించింది. వైసీపీ నాయకులను ఆహ్వానించి కండువాలు కప్పేస్తోంది. ఇటీవల ముగ్గురు సీనియర్లు మంగళగిరిలో అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేరారు. వీరిలో మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డ చంద్రరావు వున్నారు. 2009లో ప్రజారాజ్యం టికెట్ ఆశించిన చంద్రరావు.. అవంతి ఎంట్రీతో వెనుకపడ్డారు. ఆయన కాకుండా మరో ఇద్దరు వ్యాపారులు సైతం జనసేనలోకి వచ్చారు. అయితే ఈ ఎత్తుగడ అంతా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అవంతికి చెక్ పెట్టే ఆలోచనగా కనిపిస్తోంది.
Read Also: AP Assembly: హీరో గారు అంటూ మంత్రి పలకరింపు.. జోకులు పేల్చిన బాలయ్య..
అవంతి రాజకీయంగా ఎంత ఎదిగారో.. ఆయన దుందుడుకు చర్యలతో అదే స్ధాయిలో విమర్శలకు కారణం అయ్యారు. మంత్రి పదవి, జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఒకేసారి చేజారిన తర్వాత అవంతిలో అసహనం బాగా పెరిగిందనే చర్చ నడుస్తోంది. మంత్రిగా వున్న సమయంలో జనసేనతోపాటు ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై విరుకుపడేవారు అవంతి. వ్యక్తిగత నిందారోపణలతో వాతావరణం వేడెక్కించే ప్రయత్నాలు చేసేవారు. ఆడియో టేపుల వ్యవహారంలో అవంతి అవమానపడిన నేపథ్యంలో జనసేన ఎదురు దాడి చేసింది. ఇప్పటం సభలోనే పవన్ కల్యాణ్ కడిగిపారేశారు. వెటకారం ధ్వనించే విధంగా జనసేనాని చేసిన కామెంట్లు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు భీమిలిలో బలోపేతం దిశగా జనసేన అడుగులు వేయడం వెనుక రెండు బలమైన ప్రయోజనాలను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి అవంతి శ్రీనివాస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టడం అయితే.. రెండోది ఈ స్ధానంలో ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదల. పొత్తులపై క్లారిటీ వచ్చినా రాకున్నా.. భీమిలిలో మాత్రం పోటీ చేయాలని జనసేన వర్గాలు కత్తులు దూస్తున్నాయి.
Read Also: YS Viveka murder case: అవినాష్‌రెడ్డి పిటిషన్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
ఆ ప్రయత్నంలో భాగంగానే చేరికలు ఊపందుకున్నట్టు తెలుస్తోంది. మరికొందరు వైసీపీ నాయకులు, ఒకప్పుడు ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా పనిచేసిన వారితో టచ్‌లోకి వెళ్తున్నారట. ప్రతీ మండలం నుంచి ముఖ్య నాయకత్వాన్ని ఆకర్షించడం ద్వారా సంస్ధాగతంగా బలోపేతం కావాలని జనసేన భావిస్తోంది. అవంతి సైతం తాను మరోసారి భీమిలి నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు. ప్రత్యర్ధి ఎవరైనా గెలిచేది తానేనని ధీమాగా వున్నారు. జనసేన దూకుడును అధిగమించేందుకు మాజీ మంత్రి కొత్త ప్రచారం తెరపైకి తీసుకొస్తున్నారట. మెగా ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలు వున్నాయని ప్రచారం చేస్తున్నారట. తద్వారా పవన్ కు తనకు మధ్య ఎటువంటి వ్యక్తిగత దూరం లేదని తెలియజెప్పే వ్యూహంలో అవంతి ఉన్నట్టు జనసేన అనుమానిస్తోంది. దీనిని ఎదుర్కోవడానికి భీమిలిలో చేరికలను ప్రోత్సహిస్తోందట. మరి.. భీమిలిలో అవంతి లక్ష్యంగా జనసేన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.