NTV Telugu Site icon

Off The Record: జనసేన ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ స్టార్ట్‌ అయిందా?

Janasena

Janasena

Off The Record: జనసేన అధ్యక్షుడిగా నాడు పవన్‌ కళ్యాణ్‌ను ఏకబిగిన ఏకిపారేసి…. లెక్కలేనితనంగా మాట్లాడిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఝలక్ ఇచ్చే పని మొదలైందట. ఇదే విషయాన్ని సూటిగా… సుత్తిలేకుండా చెప్పేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మొదట విజయవాడలో తనిఖీలు చేశారు… ఆ తర్వాత నేరుగా కాకినాడ దగ్గరికి వచ్చేశారు. వస్తూనే ఉద్దేశం ఏమిటో కుండ బద్దలు కొట్టేశారాయన. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం వ్యవస్థీకృత రేషన్ మాఫియాను నడిపిస్తోందంటూ ఓపెన్ అయిపోయారు మంత్రి. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ బియ్యం తరలించి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారని, దీని మీద సీఐడీ ఎంక్వైరీ జరుగుతుందని ప్రకటించేశారాయన. దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేసి గెలవాలని గతంలో పవన్‌కు సవాల్‌ చేశారు ద్వారంపూడి. అంతకు మించి డిప్యూటీ సీఎంపై వ్యక్తిగత ఆరోపణలు సైతం చేశారు.

ఇక, ఆ తర్వాత పవన్‌ కూడా జిల్లాలో ఎక్కడ సభలు జరిగినా ద్వారంపూడి టార్గెట్‌గా మాట్లాడేవారు. విదేశాలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే మాఫియాని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నడిపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారాయన. అందుకు తగ్గట్టే… ఇప్పుడు మంత్రి పర్యటనలో కూడా ద్వారంపూడి మూలాలు ఉన్న గోడౌన్ల పైనే ఎక్కువగా ఫోకస్ చేశారట.. అసలు రేషన్ బియ్యం ఇక్కడికి ఎలా వస్తున్నాయి? ఎవరు చేరుస్తున్నారు వంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారట మంత్రి.. మీ వెనక ఉన్న పెద్ద మనుషుల గురించి తెలుసునని, ఓపెన్ అయితే ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుందని, లేకపోతే పద్ధతి మరోలా ఉంటుందని డైరెక్ట్ గానే చెప్పినట్టు తెలిసింది. అలాగే మంత్రి ఉత్తుత్తిగా వార్నింగ్స్‌ ఇవ్వలేదని,పక్కా లిస్ట్‌తో ఫీల్డ్ లోకి వచ్చారన్న చర్చ జరుగుతోంది జిల్లాలో. దీంతో ఎవర్ని ఏ విధంగా లైన్ లో పెట్టాలో తమకు తెలుసునంటున్న జనసేన వర్గాలు.. అందుకే క్యాబినెట్‌లో ఏరి కోరి ఆ పోర్ట్‌ఫోలియో తీసుకున్నట్టు క్లారిటీ ఇస్తున్నాయి. రేషన్‌ బియ్యం అక్రమాలకు చెక్‌ పెడితే… ఒకవైపు పేదలకు ఉపయోగపడుతుందని, మరోవైపు అక్రమార్కుల ఆటకట్టించడం, అదే సమయంలో తమ టార్గెట్ కూడా రీచ్ అవుతుందన్న క్లారిటీతో ఉన్నారట జనసేన నేతలు. తన టూర్‌లో పోర్టు నుంచి ఎగుమతులు చేసే గోడౌన్లను పరిశీలించారు మంత్రి.. అసలు రేషన్ బియ్యంతో మీకు సంబంధం ఏంటని అక్కడున్న వారిని ప్రశ్నించారు.

అలాగే 6a కింద నోటీసులు ఇచ్చి సీజ్ చేయాలని ఆదేశించారు మంత్రి. నీకు నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడిని సవాల్‌ చేశారు పవన్‌. ఇది దానికి ముందస్తు ప్రిపరేషన్ అన్న చర్చ జరుగుతోంది జిల్లాలో. ద్వారంపూడి ఫ్యామిలీ రైస్‌ మిల్లుల వ్యాపారంలో ఉంది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గత ప్రభుత్వంలో సివిల్ సప్లైస్‌ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు.. తమ్ముడు వీరభద్రారెడ్డి స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 36వేల 300 కోట్లు అప్పులు చేశారని, ఆ లెక్కలన్నీ బయటికి తీస్తామని క్లారిటీ ఇస్తున్నారు మనోహర్. దీంతో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇరుక్కోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. టార్గెట్‌ ఫిక్స్ అయిందని, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే మిగిలి ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి జనసేన వర్గాల నుంచి. మొత్తం మీద ద్వారంపూడి మీద ఫోకస్‌ పెట్టిన మంత్రి పక్కా లెక్కలు, ఎక్కాలతోనే ఫీల్డ్‌లోకి దిగినట్టే కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. అబ్జర్వేషన్ లో ఉంటే సరిపోతుందా? లేక ఆపరేషన్ అవసరమా అనేది తేలుతుందన్న సెటైర్స్‌ సైతం వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కాకినాడ పొలిటికల్‌ పరిణామాలు ఎంత ఇంట్రస్టింగ్‌గా మారతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.