NTV Telugu Site icon

Off The Record: జమ్మలమడుగు వైసీపీలో అసమ్మతి రాగం..

Jammalamadugu

Jammalamadugu

Off The Record: ఒక‌ప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డికి అనుంగుడుగా ఆయన స‌మీప బంధువు గంగ‌వ‌రం శేఖ‌ర్‌రెడ్డి ఉన్నారు. అయితే కొంతకాలంగా ఆయన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప‌నిచేస్తున్నారు. ఎమ్మెల్యేని కాద‌ని నియోజ‌క‌వ‌ర్గంలో సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే వ‌ల్ల న‌ష్టపోయిన‌, నిర్లక్ష్యానికి గురైన నేత‌ల‌ను ద‌గ్గర‌కు తీసుకుని వ‌ర్గం ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే అస‌మ్మతి నేత‌ల వ‌ర్గానికి ఆయ‌నే నాయ‌కత్వం కూడా వ‌హిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా గంగ‌వ‌రం శేఖ‌ర్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న సొంత మండ‌ల‌మైన‌ ఎర్రగుంట్లలో వ్యక్తిగ‌తంగా ఓ పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించాడు. ఈ కార్యాల‌యం ప్రారంభోత్సవానికి పెద్దఎత్తున అస‌మ్మతి నేత‌ల‌ను పిలిచి… వారితో మంత‌నాలు జ‌రిపారట గంగ‌వ‌రం శేఖ‌ర్ రెడ్డి. పార్టీ కోసం పనిచేస్తాం… జగన్‌ ఏం చెబితే అది చేస్తామంటూ అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూనే… ఎమ్మెల్యేపై అసహనాన్ని కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించారు. దీంతో జమ్మలమడుగు వైసీపీలో అసమ్మతి రాగాలు ఊపందుకున్నాయి.

Read Also: Off The Record: అసెంబ్లీకి గవర్నర్‌ తమిళిసై.. గవర్నర్‌, సర్కార్‌ మధ్య స్నేహం బలపడేనా?

2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి వ్యతిరేకిస్తూ వ‌స్తున్నారు. పార్టీ పెద్దలు క‌లుగ‌జేసుకుని ఎంత చెప్పినా ఎమ్మెల్యే మాత్రం మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డితో క‌లిసి ప‌నిచేసేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. దీంతో చేసేదేమీ లేక రామసుబ్బారెడ్డి వర్గంతో పాటు ఇటు పార్టీ అధిష్టానం ఊరుకుండిపోయింద‌ట‌. తాజాగా క‌ర్నూలు జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న రామ‌సుబ్బారెడ్డి… ఇటీవల అక్కడి నేత‌ల పంచాయితీకి వెళ్లగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కలిశారట. ఈ సంద‌ర్భంలో రామ‌సుబ్బారెడ్డికి ఖాళీ అయ్యే ఎమ్మెల్యే సీటు ఇస్తాన‌ని సీఎం హామీ ఇచ్చార‌ట‌. దీంతో రామ‌సుబ్బారెడ్డి ప్రస్తుతం మౌనంగా ఉంటూనే… త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. మొత్తంమీద జ‌మ్మల‌మ‌డుగు వైసీపీలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి, గంగ‌వ‌రం శేఖ‌ర్ రెడ్డి వ‌ర్గాలు ఉన్నాయి. దీంతో అధిష్టానం కూడా ఈ వ్యవ‌హారంపై ఎటూ తేల్చుకోలేక‌పోతోంది. పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప‌నిచేస్తున్నారు త‌ప్ప‌, పార్టీకి కాద‌న్న ధోర‌ణిని కూడా అధిష్టానం ప‌రిశీలిస్తోంద‌ట‌. ఎమ్మెల్యే తీరుపై అనేక మార్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా ఎలాంటి చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం, ప‌రిస్థితిని చక్కబెట్టకపోవడం వ‌ల్లే ఇప్పుడు జ‌మ్మల‌మ‌డుగు వైసీపీలో అస‌మ్మతి రాగాలు పెరుగుతున్నాయ‌న్న అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక్కడ అధికార పార్టీలో వ‌ర్గపోరు, అస‌మ్మతిని ప్రతిప‌క్ష పార్టీ క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డింద‌ట‌. ఇప్పటికైనా అధిష్టానం… ఈ వర్గాల పోరుపై చర్యలు తీసుకోకపోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇబ్బందులు త‌ప్పవ‌న్న భావ‌న పార్టీ వర్గాల్లో వ్యక్తవుతోంది.