Site icon NTV Telugu

Off The Record: వైసీపీ అధిష్టానం ఇమేజ్‌ డ్యామేజ్‌ చేసే వాళ్లను దూరం పెట్టాలని డిసైడ్ అయిందా..?

Off The Record Ycp

Off The Record Ycp

Off The Record: పార్టీ ప్రతినిధులు కాదు. ప్రజా ప్రతినిధులు అంతకంటే కాదు. ఎవరూ ఎవర్నీ ప్రోత్సహించినట్టు కనిపించలేదు. కానీ…. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది సోషల్‌ మీడియాలో, బయటా తెగ చెలరేగిపోయారు. కనీసం వైసీపీ ప్రాధమిక సభ్యత్వం లేని వాళ్ళు కూడా పార్టీకి తామే బ్రాండ్‌ అంబాసిడర్స్ అన్నట్టు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. జ‌గ‌న్ అభిమానులం, వైసీపీ సానుభూతిప‌రులం అన్న ట్యాగ్ లైన్స్‌తో… అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా… ఎవరు దొరికితే వాళ్ళని సోషల్‌ మీడియాలో చెడుగుడు ఆడేసుకున్నారు. వాళ్ళ నోటికి, రాతకు హద్దూ పద్దూ లేకుండా విచ్చలవిడి చేసేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, పంచ్ ప్రభాకర్ లాంటి వారంతా… మేం జగన్ అభిమానులం అంటూ…
అడ్డగోలు, అసభ్య పదజాలంతో అప్పటి ప్రతిపక్ష నేతల్ని నానా మాటలు అన్నారు. కట్‌ చేస్తే… ఓడిపోయాక వైసీపీ అధిష్టానం నిర్వహించిన ఇంటెన్సివ్‌ పోస్ట్‌మార్టంలో ఈ ఎక్స్‌ట్రా కేరక్టర్స్‌ వల్ల కూడా పార్టీకి బాగానే డ్యామేజ్‌ అయినట్టు తేలిందట. అందుకే ఇక నుంచి ఆ అదనపు ఆర్టిస్ట్‌లను పార్టీకి దూరం పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బోరుగడ్డ అనిల్‌తో మాకు సంబంధం లేదని తాజాగా ప్రకటించడం కూడా అందులో భాగమేనని అంటున్నాయి వైసీపీ వర్గాలు. అప్పట్లో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ను కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వరుస కేసులు వెంటాడాయి. జైలు నుంచి బయటికి వచ్చాక ఇచ్చిన రకరకాల ఇంటర్వ్యూల్లో కూడా తనకు తాను వైసీపీ లీడ‌ర్‌గానే చెప్పుకుంటున్నాడు.

Read Also: Pakistan: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతం.. మీరు వింటున్నది నిజమే..

అదే ఊపులో ప్రత్యర్ధి పార్టీల నాయకుల్ని మాట్లాడినట్టుగానే వైసీపీ లీడర్స్‌పై కూడా మాట్లాడాడు బోరుగడ్డ. అంతేకాదు, అనిల్‌కు, పార్టీకి సంబంధం లేదని చెబుతున్న వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంక‌ట‌రెడ్డి లాంటి నేతలపై తీవ్ర పదజాలంతో దూషణలు మొదలుపెట్టాడు. వాడెవ‌డు.. వీడెవ‌డు అంటూ… వాయిస్‌ పెంచడంపై వైసీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. త్వరలో జగన్ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరుతానని కూడా బోరుగడ్డ అనిల్‌ చెప్పడంతో… వైసీపీ ఉలిక్కిపడిందట. బోరుగడ్డ మాటల్ని తేలిగ్గా వదిలేస్తే పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్న భావనకు వచ్చిన వైసీపీ.. అతనితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి జగన్‌ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. అలా బోరుగడ్డ ఓవర్‌ యాక్షన్‌ ప్రభావం పార్టీ మీద గట్టిగా పడిందని, ఇక మీదట కూడా అలాగే వదిలేసి ఉపేక్షిస్తే…పార్టీకి చెడ్డపేరు ఖాయమన్న భావనతోనే అధికార ప్రతినిధి వెంటనే స్పందించారట. ఇక శ్రీరెడ్డి కూడా వైసీపీ హయాంలో తరచూ వార్తల్లో ఉండేవారు. పార్టీకి అనఫిషియల్ స్పోక్స్ పర్సన్‌ని అన్నట్టు మాట్లాడుతూ బోర్డర్‌లైన్‌ దాటి అసభ్య పదజాలంతో రెచ్చిపోయేవారు. ముఖ్యనేతల కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో కూటమి పార్టీల కేడర్‌ రగిలిపోయేవారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలిసో.. తెలియ‌కో మాట్లాడిన మాట‌లు ఎవ‌రినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరి తన వ్యక్తిగత అభిరుచులకే పరిమితం అయ్యారు.

ఇదే తరహాలో పంచ్ ప్రభాకర్ కూడా టీడీపీ, పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో మాట్లాడేవారు. సోషల్‌ మీడియాలో లిటరల్గా బూతులు మాట్లాడుతూ నానా రచ్చ చేశాడు. ఒక దశలో న్యాయ మూర్తులను ఉద్దేశించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో చివరికి అది వైసీపీ ప్రభుత్వం వర్సెస్ న్యాయవ్యవస్థ అన్నట్టు మారింది. అలాంటి వాళ్ళతో తమకు సంబంధం లేదన్నా… బయట నమ్మే పరిస్థితి లేకపోవడంతో… ఇక నుంచి జాగ్రత్త పడాలని, గతంలోని పొరపాట్లు రిపీట్‌ అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటోందట పార్టీ అధిష్టానం. పార్టీతో సంబంధం లేకపోయినా జగన్ అభిమానులమన్న పేరుతోనో, సానుభూతి పరుల ముసుగులోనో ఎక్కువ తక్కువ మాట్లాడితే ఉపేక్షించకూడదని డిసైడైనట్టు సమాచారం. ఏదో.. మనకు ఫేవర్‌గానే ఉందికదా అని ఊరుకోకుండా….అలాంటి వారిని కట్టడి చేస్తేనే మేలన్న నిర్ణయానికి వచ్చిందట ఫ్యాన్‌ పార్టీ. బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులకు పార్టీతో సంబంధం లేదని నేరుగా చెప్పేయడంతోపాటు.. ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని కూడా గుర్తించే పని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.రాజకీయాల్లోకి కుటుంబాలను లాగటం వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని, అందుకే అలాంటి వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన పని లేదన్న నిర్ణయానికి వచ్చిందట వైసీపీ.

Exit mobile version