Off The Record: పిఠాపురం…. ఆ పేరు వింటేనే జనసేన కేడర్‌లో ఓ వైబ్ క్రియేట్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ కిక్కు ఫీలవుతారు. అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్‌కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాక లోకల్ పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. ఇక ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక ప్రతి జనసేన కార్యకర్త పిఠాపురం మా సొంతం అన్నట్టు ఓన్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే టీడీపీ, జనసేన లోకల్ లీడర్స్ మధ్య తేడాలు వచ్చాయి. అవి రకరకాలుగా మారి… చివరికి పిఠాపురం టిడిపి కో ఆర్డినేటర్‌గా ఉన్న వర్మను తప్పించేదాకా వెళ్ళింది. దీంతో… అసలీ మొత్తం ఎపిసోడ్‌పై ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గం మనకు అస్సలు కలిసి రావడం లేదని టీడీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయట. అందుకు తగ్గట్టే…. చిట్టచివరిగా 1994లో ఇక్కడ సైకిల్ చక్రం తిరిగింది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవలేదు. 94 తర్వాత ఆరు ఎన్నికలు జరిగినప్పటికీ… కొన్ని సందర్భాల్లో పొత్తులో భాగంగా ఈ సీటును వదులుకోవడం, మరి కొన్ని సందర్భాల్లో పోటీ చేసి ఓడిపోవడం లాంటివి జరిగాయి. ఆ పరిణామాలను, ప్రస్తుత పరిస్థితులను పోల్చుకుంటూ… ఇది మనకు అంత కంఫర్ట్ నియోజకవర్గం కాదని టీడీపీ నేతల్లో చర్చ మొదలైందట.
ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించిన వర్మ కూడా పిఠాపురం టీడీపీ అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. కానీ…ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగినప్పుడు మాత్రమే వర్మ గెలవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇలా… ఎట్నుంచి ఎటు చూసినా, తిప్పితిప్పి, మలితిప్పి ఎన్ని లెక్కలేసుకున్నా…. పసుపు జెండాకి, పిఠాపురానికి పెద్దగా సెట్ అవ్వదని సొంత పార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారట.. ప్రస్తుతం టిడిపి జనసేన కలిసి ఉన్నాయి. ఇలా కూటమి కొనసాగినన్నాళ్లు ఉమ్మడిగా పవనే బరిలో దిగుతారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో తర్వాత లెక్కలు మారినప్పటికీ…. జనసేనాని ఉన్న సీట్లో ఇతరులకు అంత ఈజీ కాదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇలా…. ఆ ఈక్వేషన్స్ అన్నిటినీ బేరీజు వేసుకున్నాకే… పసుపు పార్టీ పెద్దలు వర్మ వికెట్‌ను డౌన్ చేసేశారన్న విశ్లేషణలున్నాయి. సాధారణంగా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలకు కంఫర్టబుల్ నియోజకవర్గాలు ఉంటాయి. తాము అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఆ నియోజకవర్గాల నుంచి వాళ్ళు గెలుస్తూ ఉంటారు. కుప్పం, పులివెందుల ఈ కోవలోకే వస్తాయి. ఇక మీదట పిఠాపురంలో పవన్‌కు కూడా అదే పరిస్థితి ఉంటుందని టీడీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. అందుకే అక్కడ అంత స్పీడ్ అయిపోకూడదని వర్మని సైడ్ వేసేశారని అంటున్నారు. అదే సమయంలో… అస్సలు పూర్తిగా వదిలేయకుండా…. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి మాత్రమే డమ్మీలను ముందు పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు. వాళ్ళ పని కూడా వచ్చామా వెళ్ళామా అన్నట్టుగానే ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఠాపురంలో వేరే పవర్ సెంటర్ తయారవడానికి టీడీపీ అధినాయకత్వం కూడా అంత సుముఖంగా లేదట. దానికి అనుగుణంగానే మాజీ ఎమ్మెల్యేని సైడ్‌కు పెట్టి అలా సెట్ రైట్ చేశారని అంటున్నారు.
ఇక, ఇన్ఛార్జ్‌గా తప్పించిన వర్మకి ఇప్పటికిప్పుడు అంత ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఆయన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పోస్ట్‌తో అలా బండి నడిపేస్తుండవచ్చన్న చర్చ నడుస్తోంది. ఇక పొత్తు ఉన్నన్నాళ్ళు జిల్లా రాజకీయాల్లోకి వర్మను ఇన్వాల్వ్ చేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఒకవేళ కాదని మరీ స్పీడ్ అయిపోతే స్పీడ్ బ్రేకర్లు వస్తాయని, పార్టీ ఇలాంటివి చాలా చూసిందని అంటున్నారట తెలుగుదేశం నేతలు. కొన్ని సందర్భాల్లో హైపర్ యాక్టివ్ కూడా పనికిరాదని, వాస్తవాలకు దగ్గరగా మసులుకోవాలని అంటున్నారు. మొత్తానికి కలిసి రాని నియోజకవర్గాన్ని సైకిల్ సైడ్ చేసేసింది. అక్కడ పార్టీ జెండా ఎగిరి దశాబ్దాలు గడిచింది కాబట్టి ప్రస్తుతానికి సైలెంట్ మోడ్‌లో పెట్టేసింది. మాజీ ఎమ్మెల్యే వర్మని పక్కకు తప్పించేసి… మిత్రపక్షానికి తన ఉద్దేశ్యాన్ని డైరెక్ట్‌గానే చెప్పేసింది. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో డిస్టబెన్స్ లేకుండా చూసుకుంటుంది టీడీపీ అధిష్టానం.
