NTV Telugu Site icon

Off The Record: ఇంఛార్జ్‌ పాలనలోనే హైదరాబాద్‌ కలెక్టరేట్‌.. పూర్తిస్థాయి కలెక్టర్‌ వస్తారా లేదా?

Hyderabad Collector

Hyderabad Collector

Off The Record: తెలంగాణలోని మెజార్టీ జిల్లాలకు ఈ మధ్యే కొత్త కలెక్టర్లను నియమించారు. కానీ హైదరాబాద్‌కు పూర్తిస్థాయి కలెక్టర్‌ రాలేదు. ఇప్పుడూ కలెక్టర్‌గా ఇంఛార్జ్‌నే వేశారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్‌గా ఉన్న అమయ్‌ కుమార్‌కు హైదరాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మొన్నటిదాకా అమయ్‌ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌. తాజా బదిలీల్లోనైనా హైదరాబాద్‌కు పూర్తిస్తాయి కలెక్టర్‌ను నియమిస్తారని అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మరో తొమ్మిది నెలలే ఉండటంతో రెండేళ్ల కంటే ఎక్కువుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీలు చేశారు. అయినప్పటికీ రాజధాని హైదరాబాద్‌కు మాత్రం కొత్త కలెక్టర్ రాలేదు. అంతకుముందూ హైదరాబాద్ పరిస్థితి ఇంతే. రంగారెడ్డి కలెక్టర్‌గా ఉన్న అమయ్‌ కుమారే హైదరాబాద్‌కు ఇంఛార్జ్‌ కలెక్టర్‌గా కొనసాగారు. కొన్నాళ్లు శర్మన్‌ హైదరాబాద్‌ కలెక్టర్‌గా చేసి ఇక్కడే పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఇంఛార్జ్‌ పాలనలోకి వెళ్లింది. శర్మన్‌ కంటే ముందు పనిచేసిన IASలు పూర్తి స్థాయిలో ఇక్కడ విధుల్లో లేరు. శ్వేతా మహంతి కలెక్టర్‌గా వచ్చిన కొన్నాళ్లకే విదేశీ చదువు కోసం లాంగ్‌ లీవ్‌లో వెళ్లిపోయారు. ఆ తర్వాత చాన్నాళ్లు ఇంఛార్జే దిక్కయ్యారు.

Read Also: Vijayawada Traffic Restrictions: గుణదల మేరిమాత ఉత్సవాలు.. బెజవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

శ్వేతా మహంతి కంటే ముందు హైదరాబాద్ కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా ఉన్నారు. ఆయన పరిస్థితి అంతే. రాహుల్ బొజ్జా కూడా లాంగ్‌ లీవ్‌ పెట్టి విదేశాలకు వెళ్లిపోయారు. మొత్తానికి ఈ జిల్లాకు స్థిరంగా ఒకటి రెండేళ్లపాటు ఒక కలెక్టర్‌ అంటూ లేకుండా పోయారు. GHMC పరిధిలోనే హైదరాబాద్ ఉంది. GHMC కమిషనర్‌గా కూడా IAS అధికారే ఉంటారు. అందుకే హైదరాబాద్ కలెక్టర్ సీటుపై చిన్నచూపనే వాదన అధికారుల్లో ఉందట. కానీ సమస్యలతో మాత్రం జనం కలెక్టరేట్‌కు నిత్యం వస్తుంటారు. రెండు కలెక్టరేట్లకు ఒకే IAS న్యాయం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఐదుగురు సీనియర్ అధికారులకు ఐఎఎస్‌గా ప్రమోషన్ రానుందని సమాచారం. వారిలో ఎవరికో ఒకరికి హైదరాబాద్‌ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది.

Show comments