Off The Record about Hath Se Hath Jodo Yatra in Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల ప్రస్తావన మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈనెల 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలు ప్రారంభం కానున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ములుగు నియోజకవర్గంలోని సమ్మక్క సారలమ్మ నుండి పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు. మొదట భద్రాచలం నుంచి ఉంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి పాదయాత్ర.. తర్వాత సమ్మక్క జాతరకు ఎందుకు షిఫ్ట్ అయింది? అనేది కూడా ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు.. భద్రాచలం నుంచి రేవంత్ పాదయాత్ర చేస్తానంటే ఒప్పుకోలేదా? ఎవరికి అనుకూలమైన నియోజకవర్గాల్లో వాళ్లు పాదయాత్ర చేయండి అని పార్టీ చెప్పింది కాబట్టి సీతక్క నియోజకవర్గం ఎంచుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డిల పేర్లు కూడా పాదయాత్ర జాబితాలో ప్రస్తావించారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ థాక్రే.
Read Also: Off The Record: సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు? కొత్తవారికి అవకాశం ఉంటుందా?
పాదయాత్ర చేయాలని భావించిన నాయకులు అందరూ షెడ్యూల్ ఇవ్వాలని పార్టీ ఇన్‌ఛార్జ్ థాక్రే తొలుత సూచించారు. అయితే ఇంతలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రను సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తామని గతంలోనే ప్రకటించారు. సీఎల్పీ నేత హోదాలో రాష్ట్రమంతా పర్యటించే అవకాశం ఉంటుంది. అయితే ఆయన ఎక్కడి నుంచి పాదయాత్ర చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. ఇక ఉత్తంకుమార్‌రెడ్డి, మధుయాష్కీలు కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నారు. వీరికి సంబంధించిన షెడ్యూలు కూడా ఇంకా అధికారికంగా రాలేదు. అయితే ఇన్‌ఛార్జ్ థాక్రే… ఈనెల 4న ఉదయం పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పాదయాత్రలపైనే చర్చ జరిగే అవకాశం ఉంది.
Read Also: Off The Record: బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరు..? ఈటలకే అవకాశం..?
నిజానికి పార్టీ ఫిబ్రవరి 6న భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని టి.కాంగ్రెస్ భావించింది. ఈ సభకు ప్రియాంక గాంధీని లేదంటే సోనియా గాంధీని పిలవాలని విస్తృతస్థాయి సమావేశంలో చర్చించారు. కానీ ప్రస్తుతం ఆ సభ ప్రస్తావన లేదు. దీంతో నాయకుల మధ్య సభ ఏర్పాటుకు సంబంధించిన అంశంలో ఏకాభిప్రాయం రాలేదనేది తేటతెల్లమైంది. దీనికితోడుగా భద్రాచలం నుంచి పాదయాత్ర చేస్తానన్న రేవంత్ షెడ్యూల్ సమ్మక్క సారలమ్మ జాతరకు షిఫ్ట్ అయింది. వీటన్నింటిని చూస్తుంటే నాయకుల మధ్య ఇంకా సయోధ్య కుదిరినట్టు కనిపించడం లేదు. ఎప్పుడెప్పుడు పాదయాత్ర చేయాలన్న ఆలోచనతో రేవంత్ ఉన్నారు. దీనికి అధిష్టానం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో అనుమతి రాలేదు. ఇలాంటి అంశాల మధ్య అసలు ఈ పాదయాత్రల సంగతేంటనేది అర్థం కావడం లేదని పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పాదయాత్రను అందరూ నాయకులు చేయొచ్చని ఇన్‌ఛార్జ్ థాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ, ఎవరు ఎక్కడి నుంచి అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మరి ఇన్‌ఛార్జ్ రాష్ట్ర పర్యటనతోనైనా.. పాదయాత్రల విషయంలో స్పష్టత వస్తుందో లేదో చూడాలి మరి.