Off The Record: రెడ్ బుక్…. ఏపీ పాలిటిక్స్‌లో ఇదో హాట్ సబ్జెక్ట్. దీనికి సంబంధించే అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తరచూ ఆరోపణలు, సవాళ్ళ పర్వం నడుస్తూ ఉంటుంది. మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెడ్‌బుక్ ఓపెన్ చేస్తే… ఇప్పుడు టీడీపీ నాయకులు కొందరు లోకల్ బుక్స్‌ని ఓపెన్ చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా… లోకేష్ తన రెడ్‌బుక్‌ని క్లోజ్ చేసినా… నేను మాత్రం సంగతి తేలేదాకా మూసే ప్రసక్తే లేదని అంటున్నారట గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఇబ్బంది పెట్టిన, ఇతరత్రా వ్యవహారాలు నడిపిన వారి పేర్లు తన బుక్‌లో నోట్ చేశానని, వాళ్ళ సంగతి తేల్చేదాకా…. ఆ పుస్తకం తెరిచే ఉంటుందని సన్నిహితుల దగ్గర అంటున్నట్టు సమాచారం. మామూలుగానే… కేరాఫ్ కాంట్రవర్శీ అనే పేరున్న గుమ్మనూరు ఇప్పుడు రెడ్ బుక్ వ్యాఖ్యలతో మరోసారి టాక్ ఆఫ్‌ది పాలిటిక్స్ అయ్యారు. వైసీపీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన జయరామ్.. 2024 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి.. మూడో విడత ఎమ్మెల్యే అయ్యారు.
Read Also: Back-to-Back Murders: అనంతపురంలో వరుస హత్యల కలకలం..
అయితే… తన సొంత నియోజకవర్గంలో సీటు దక్కక.. పక్కనే ఉన్న గుంతకల్లులో పోటీ చేసి గెలిచారాయన. మొదట్లో గుమ్మనూరును గుంతకల్లు టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్థిక, అంగబలంతో నెట్టుకొచ్చారాయన. అయినాసరే… గెలిచిన రోజు నుంచి వివాదాల్లో చిక్కుకుంటునే ఉన్నారు గుమ్మనూరు. మూడు నెలల క్రితం మీడియా ప్రతినిధులనుద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. నా మీదగానీ… నా కుటుంబం మీదగాని ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే…. రైలు పట్టాల మీద పడుకోబెడతానంటూ వార్నింగ్ ఇవ్వడం దుమారం రేపింది. ఆ విషయంలో సర్ది చెప్పడానికి చివరికి టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని పార్టీ పెద్దలు ఖండించడంతోపాటు… ఆయన్ని వివరణ కోరినట్టు సమాచారం. ఇవన్నీ మరవక ముందే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. స్థానిక సంస్థల ఎన్నికల లోపు వైసీపీ నాయకులంతా టీడీపీకి జేజేలు కొడితే సరి, లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుందని వార్నింగ్ ఇచ్చేశారు. సంస్థాగత ఎన్నికలపై పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో గుమ్మనూరు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి.
Read Also: Off The Record: సీఎం రేవంత్ సొంత పార్టీ నేతలకే సీరియస్ వార్నింగ్ ఇచ్చారా?
రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులుగా మనవాళ్లనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారాయన. అక్కడి వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎవరూ నామినేషన్ వేయకుండా చూసుకోవాలని అనడం వివాదానికి దారితీసింది. గత ఎన్నికల్లో తనను రౌడీ, గుండా, ఖూనీకోరు అన్నారు గానీ తాను అందర్నీ ప్రేమించానని.. స్థానిక సంస్థల ఫలితాల్లో తేడా వస్తే తానేంటో చూపిస్తానంటూ సొంత పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు గుమ్మనూరు. అదే ఊపులో… మంత్రి లోకేష్ రెడ్ బుక్ మూసివేసినా.. తాను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెరుస్తానంటూ సంచలనానికి తెరలేపారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యల మీద ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో గుమ్మనూరుకు కౌంటర్ ఇస్తున్నారు. అసలే రాష్ట్రంలో రెడ్ బుక్, రప్పా రప్పా వ్యాఖ్యల మీద అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధమే జరుగుతోంది. ఇలాంటి సమయంలో గుమ్మనూరు అన్న మాటలు పొలిటికల్ హీట్ పెంచాయి.
