Site icon NTV Telugu

Off The Record: మాజీ మంత్రి వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పడేస్తాయా..?

Gudivada Amarnath

Gudivada Amarnath

Off The Record: వాగ్ధాటితో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పడేసే వైసీపీ నేతల్లో ఒకరు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. పార్టీ అధ్యక్షుడు జగన్‌కు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకుంటారు. అలాంటి నాయకుడు ఇప్పుడు గత ఎన్నికల్లో వైసీపీ వైఫల్యాల గురించి బహిరంగ వేదికల మీద విశ్లేషిస్తుండటం హాట్‌ అవుతోంది. ఆ విషయాల గురించి ఆయన ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నారన్న డౌట్స్‌ పార్టీ వర్గాల్లోనే వస్తున్నాయట. ఉత్తరాంధ్రలో వైసీపీకి గుడివాడకంటే సీనియర్స్‌ చాలా మందే ఉన్నా.. ఆయనే పబ్లిక్‌గా ఫెయిల్యూర్స్‌ గురించి మాట్లాడుతూ… కొత్త చర్చకు సెంటర్ పాయింట్ అవుతున్నారు. పార్టీ ఓడిపోయాక ఈ ఏడాదిన్నర కాలంలో అమర్ చేసిన వ్యాఖ్యలు పలుమార్లు పార్టీని ఇరకాటంలో పెట్టాయన్న అభిప్రాయం సైతం ఉంది. జగన్ సైన్యంగా చెప్పుకున్న వాలంటీర్స్‌ వ్యవస్థ కారణంగానే ప్రజలకు, పార్టీకి మధ్య సత్సంబంధాలు లేకుండాపోయాయని గతంలో అన్నారు మాజీ మంత్రి. అధికారం కోల్పోవడానికి ఇదీ ఓ కారణం అన్న టెంపో నేతలకు నచ్చకపోయినా.. కేడర్‌కు మాత్రం బాగా కనెక్ట్ అయ్యిందట. సరే… జరిగిందేదో ….జరిగిపోయింది… జెండాపట్టిన కార్యకర్తలకు భవిష్యత్‌లో అగ్రస్థానం అన్న అభిప్రాయం కలగడం పార్టీలో పాజిటివ్ వాతావరణం సృష్టించిందనే అభిప్రాయం కూడా ఉంది. అమర్నాథ్ తర్వాత దక్షిణ కోస్తాలో ఒకరిద్దరు సీనియర్ నేతలు ఇదే ధోరణిలో మాట్లాడారు. చెప్పిన విధానం వేరైనా… రాయలసీమ లీడర్ షిప్ కూడా దాదాపుగా ఇదే ఫీల్‌తో స్పందించింది. అసలు ఆ మాటల కారణంగానే… ఇవాళ కాకుంటే రేపయిునా మనకు గుర్తింపు దక్కుతుందన్న నమ్మకంతో కేడర్‌ గట్టిగా నిలబడగలుగుతోందన్న వాదన బలపడుతోంది వైసీపీలో.

Read Also: Sachin Tendulkar: కాబోయే వదినతో కలిసి పైలేట్స్ స్టూడియో ప్రారంభించిన సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున అవి ఎప్పుడు జరిగినా…. కేడర్ తెగించి కొట్లాడటం, వాళ్ళలో ఆత్మ స్దైర్యాన్ని నింపడానికి అమర్నాథ్ లాంటి నాయకులు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ ఉపయోగపడతాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా జరుగుతుండగానే…ఇటీవల మరోసారి ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి చేసిన విశ్లేషణ చర్చనీయాంశంగా మారింది. వివిధ సామాజికవర్గాల వారీగా వైసీపీకి పడ్డ ఓట్లు….కూటమి పార్టీలకు లభించిన మద్దతు గురించి ఓపెన్ డిస్కషన్ పెట్టారాయన. విశాఖలో జరిగిన వైసీపీ SC విభాగం ప్రాంతీయ సమావేశంలో ఆసక్తికరమైన లెక్కలు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ నా SC, నా ఎస్.టి., నా బీసీ., నా మైనారిటీ అని ఎంతగా చెప్పినా…. పోలింగ్‌ బూత్‌ దగ్గరకు వచ్చేసరికి అవేమీ పెద్దగా వర్కౌట్‌ కాలేదన్నది అమర్నాథ్‌ వాదన. బీసీలు 30 నుంచి 35శాతం, కాపులు 20 శాతం, రెడ్లు 50శాతం మాత్రమే ఆదరించినట్టు కేలిక్యులేషన్స్‌ చెప్పారాయన. వీళ్ళందరికీ అతీతంగా… వైసీపీని ఏకపక్షంగా ఆదరించింది ఎస్సీలు మాత్రమేనని అన్నారాయన. 75శాతం ఓటింగ్‌తో ఆ సామాజిక వర్గాలు ఓటేసినా… అగ్రకులాలు, బీసీ సామాజికవర్గాల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరించని కారణంగానే వైసీపీ ఓడిపోయిందన్నారు గుడివాడ అమర్నాథ్‌. ఘోర పరాజయం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే పార్టీ వర్గాలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న టైంలో…. అమర్నాథ్ వ్యాఖ్యలు పాజిటివా….నెగెటివా….!!, అసలిప్పుడెందుకు ఆయన విశ్లేషణల పేరుతో మానుతున్న గాయాన్ని రేపుతున్నారని మాట్లాడుకుంటున్నాయట వైసీపీ వర్గాలు.

Read Also: AP ministers Ranks: ఏపీ మంత్రులకు ర్యాంకులు.. ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే…?

అయితే… మాజీ మంత్రి వ్యూహాత్మకంగానే… బహిరంగ వేదిక మీద ఆ మాటలు అన్నారన్నది ఇంకొందరి అభిప్రాయం. ఆ లాజిక్ ఏంటయ్యా అంటే….2019లో ఆదరించిన వివిధ వర్గాలు ఐదేళ్ల పాలన తర్వాత తిరస్కరించాయని, అధికారంలో ఉన్నప్పుడు తమకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్న అసహనమే అందుకు కారణం అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు మెజారిటీ టీడీపీకే వెళ్తాయన్న అంచనాలు ముందు నుంచీ వున్నా… అనూహ్యంగా ఇతర కులాలు కూడా దూరం జరగడమే ఓటమికి కారణం అన్నది తాజా విశ్లేషణ. జరిగిన లోటు పాట్లను వైసీపీ అధిష్టానం గుర్తించిందని, భవిష్యత్తులో అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తామని వివిధ సామాజికవర్గాలకు చెప్పే ప్రయత్నంలో భాగంగానే అమర్నాథ్ కొత్త కొత్త విశ్లేషణలు తెరపైకి తెస్తున్నట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ కొత్త రాగం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి.

Exit mobile version