NTV Telugu Site icon

OTR about Ganta Srinivasa Rao: ‘అమ్మో గంటా’..! దూరం జరుగుతున్న నేతలు.. ఆ పేరు చెబితే నేతల ఉలికిపాటు

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్‌ పార్టీలతో పెనవేసుకున్న నాయకుడు… గంటా శ్రీనివాస్‌రావు. గడచిన ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత గంటా సీన్ మారింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీతో టచ్‌ మీ నాట్‌గా ఉంటున్నారు. ఈ వైఖరి టీడీపీలోని గంటా ప్రత్యర్థులకు కలిసి వచ్చింది. అడపా దడపా టీడీపీ వేదికలపై మాజీ మంత్రి కనిపిస్తున్నా.. పార్టీ ఫ్లేవరుకు దూరమయ్యారనే ప్రచారం ఉంది. గంటా వైసీపీలో చేరిపోతారనే ప్రచారం ఈ మధ్య గట్టిగానే జరిగింది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయో లేదో కానీ.. ఎక్కడున్న గంటా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఆయనపై అనుమానపు నీడలు తొలగలేదు. ఈ మధ్య కాలంలో గంటా శ్రీనివాసరావు కాపు నినాదాన్ని భుజాన వేసుకున్నారు. దానిపై టీడీపీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ నెల 26న కాపునాడు సమావేశం జరపాలని కాపు సామాజికవర్గానికి చెందిన పెద్దలు నిర్ణయించారు. ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా కాపునాడు కార్యక్రమం నిర్వహించాలని భావించినా.. అది విజయవాడకు మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేతలను ఒక్కొక్కరిని గంటా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశం ఆ వ్యూహంలో భాగమేనట. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆ సమావేశంలో పాల్గొన్నారు. రాత్రి పదిన్నరకు మొదలైన సమావేశం.. అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగింది. ఆ భేటీలో గంటా, బొండాతోపాటు కన్నా కూడా ఉన్నారు. ఆ సమావేశంపైనే టీడీపీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపు సామాజికవర్గ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా.. అడుగులు వేయాలన్న ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారట. కాపులను బూచిగా చూపించి.. బీసీలను వైసీపీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తోందనే వాదన టీడీపీలో ఉంది. టీడీపీలో కాపు నేతగా ఉన్న బొండా ఉమ.. పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న గంటాతో భేటీ కావడం తప్పుడు సంకేతాలిస్తుందనే చర్చ జరుగుతోందట. దీనిపై బహిరంగంగా ఎవ్వరూ చెప్పకపోయినా.. ఆ సమావేశానికి ఉమా వెళ్లడాన్ని తప్పు పడుతూ గుసగుసలాడుతున్నారట.

టీడీపీలోని మరికొందరు కాపు నేతలకు గంటా ఫోన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీలున్నప్పుడు భేటీ అవుదాం.. చర్చిద్దామని మాటలు కలుపుతున్నారట. అయితే బొండా ఎపిసోడుతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ ఏదో సాకు చెప్పి.. గంటా ఛాయల నుంచి తప్పించుకుంటున్నారట. పార్టీ అధినాయకత్వం ఈ తంతును సీరియస్‌గా తీసుకుంటే అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారట. ఇదే సమయంలో టీడీపీ కాపు నేతలకు మరో చిక్కొచ్చి పడింది. కాపు సంక్షేమం కోసం.. ఓ సమావేశం పెట్టుకుందామని ఆహ్వానిస్తే.. దానికి వెళ్లడం లేదనే ఫీలర్లు బయటకు వెళ్తే.. సొంత సామాజికవర్గంలోనూ.. కాపు ఓటర్లకూ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందంటున్నారట. ఈ క్రమంలో టీడీపీ కాపు నేతల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందట.