Site icon NTV Telugu

Off The Record: దుబ్బాక కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ..!

Dubbaka

Dubbaka

Off The Record: తెలంగాణలోని హాట్ సీటుల్లో దుబ్బాక నియోజకవర్గం కూడా ఒకటి. 2018 ఎన్నికల వరకు ఇదో సాధారణ సెగ్మెంటే అయినా… తర్వాత జరిగిన ఉపఎన్నికతో ఎక్కడలేని హైప్‌ వచ్చేసింది. దాంతో దుబ్బాకలో చీమ చిటుక్కుమన్నా.. ఏ పార్టీలో ఏం జరిగినా హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా దుబ్బాక కాంగ్రెస్‌లో నడుస్తున్న మూడు ముక్కలాట పార్టీలో గందరగోళానికి దారితీస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎవరికివారు టికెట్‌ తమకే అని ప్రచారం చేసుకుంటున్నారు. దుబ్బాక కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారు. మరో నేత శ్రావణ్‌కుమార్‌రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ వేడి పుట్టిస్తున్నారు. వీరిద్దరి మధ్య పంచాయితీలు ఎన్నికల నాటికి ఎటు దారితీస్తాయో అని అనుకుంటున్న తరుణంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చారు కత్తి కార్తీక.

Read Also: Off The Record: ఏఐసీసీ కోఆప్షన్‌ మెంబర్‌గా నీలిమ నియామకంపై రగడ.. అది ఒట్టి మాటేనా?

దుబ్బాక ఉపఎన్నికకి ముందు చెరకు శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీలో ఉండేవారు. ఉపఎన్నికలో టికెట్ ఇవ్వకపోయే సరికి కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఉపఎన్నికలో ఫార్వర్డ్ బ్లాక్‌ నుంచి పోటీ చేశారు కత్తి కార్తీక. ఆ ఉపఎన్నికలో ఆమెకు వచ్చిన ఓట్లు 363. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ కూడా చేశారు. ఆపై బీజేపీలో చేరారు కత్తి కార్తీక్‌. అంతే వేగంగా బీజేపీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌ శిబిరంలో ప్రత్యక్షం అయ్యారు మేడమ్‌. కాంగ్రెస్‌లో చేరాక కొన్ని రోజులు సైలెంట్‌గానే ఉన్న కార్తీక.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో దుబ్బాకలో హల్చల్‌ చేస్తున్నారు. ఓ రేంజ్‌లో నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు కూడా. శ్రీనివాసరెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కత్తి కార్తీకలు ఎవరికివారు తమకే దుబ్బాక టికెట్‌ అని ప్రచారం చేసుకుంటూ జనాల్లో తిరిగేస్తున్నారు. దీంతో దుబ్బాక కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? ఎవరికి టికెట్‌ ఇస్తారు అనే కన్ఫ్యూజన్‌ కేడర్‌లో నెలకొంది.

Read Also: Off The Record: చీరాల వైసీపీలో జగడాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్టేనా?

శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కత్తి కార్తీకలకు కాంగ్రెస్‌ అధిష్ఠానంలో కొందరి అండదండలు ఉన్నాయట. శ్రీనివాసరెడ్డికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అండ ఉంటే.. తనకు నేరుగా హైకమాండ్‌ ఆశీసులు ఉన్నాయని శ్రావణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారట. ఇక కత్తి కార్తీకకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ సపోర్ట్‌ ఉందట. ఇలా ఎవరికి వారు తమకున్న బలమైన బ్యాక్‌గ్రౌండ్‌ను అడ్డం పెట్టుకుని దుబ్బాక కాంగ్రెస్‌లో కథ నడిపించేస్తున్నారట. కలిసి సాగాల్సిన చోట యమునా తీరే అన్నట్టుగా పాదయాత్రలు చేస్తుండటంతో కేడర్‌కు ఎవరిని అనుసరించాలో తెలియడం లేదట. హాత్‌ సే హాత్‌ జోడో అని జనాల్లో తిరగడం కాదు.. ముందు ముగ్గురు నేతలూ చేతులు కలిపితే చూడాలని ఉందని చురకలు వేస్తున్నారట కార్యకర్తలు.

Exit mobile version