Off The Record: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం జనసేనలో అసంతృప్తులు అంతకంతకూ పెరిగిపోతున్నాయట. సొంత పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీరును గ్లాస్ నేతలు తీవ్రంగా నిరసిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా…. భజన బృందాలనే ఆయన చేరదీస్తున్నారని, చిడతలు వాయించేవారినే నామినేటెడ్ పదవులు వరిస్తున్నాయంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కష్ట కాలంలో పార్టీకి అండగా నిలిచినా… తమకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ నాయకులు. గత ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, అప్పటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరి ఆశించారు. అయితే, కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన కోటాలోకి వెళ్ళిపోయింది. దీనిపై భగ్గుమన్న బొడ్డు వర్గీయులు అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ ముఖ్య నాయకులనే నిలదీశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం పట్టుతగ్గకుండా నియోజకవర్గంలో బత్తులకు అండగా నిలబడ్డామని, అంతటి సపోర్ట్ ఇచ్చిన మాకు ఇప్పుడు దక్కుతున్న గౌరవం ఇదేనా…? ఎమ్మెల్యేకి భజన చేయకుండా… పార్టీ కోసం నిలబడటమే మేం చేసిన తప్పా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాట జనసేన సీనియర్స్. అండగా నిలబడ్డ వారిని కాదని….. అధికారంలోకి రాగానే చిడతల బ్యాచ్‌ని ఎంటర్‌టైన్ చేయడమంటే… ఒక రకంగా రాజానగరంలో జనసేనను డేంజర్ జోన్‌లోకి నెట్టడమేనన్నది సీనియర్స్ మాట.
కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా చేపట్టిన సొసైటీ ప్రెసిడెంట్, ఆలయ కమిటీ చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టుల భర్తీలో సైతం తన భజపరులకు, చుట్టూ ఉన్నవాళ్ళకే పదవులు ఇ్చచారంటూ ఎమ్మెల్యే మీద మండిపడుతోంది జనసేనలోని ఓ వర్గం. ఎమ్మెల్యే అల్లుడు తోట అనిల్ వాసుకు సైతం నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. జిల్లావ్యాప్తంగా నీటి సంఘాలు, సొసైటీ అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేయగా, వీటిలో సింహభాగం ఎలాంటి రాజకీయ అనుభవం లేని, పార్టీ కోసం ఏనాడూ పనిచేయని వారికి దక్కాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చంటన్నారు నాయకులు. జనసేన కోసం ఎన్నడూ ఏమీ చేయని వారికి సైతం ఇప్పుడు పదవులు ఎలా ఇస్తారంటూ నిలదీస్తోంది ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం. అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో సైతం వీరికి ప్రాధాన్యం కల్పించడంపై ఆగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. పార్టీకి సంబంధం లేని, రాజకీయం తెలియని వారికి పదవులు కట్టబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోందని అంటున్నారు గ్లాస్ కార్యకర్తలు. ఇంటర్నల్గా జనసేన వ్యవహారం ఇలా ఉంటే… అటు కూటమిలోని మిగతా రెండు భాగస్వామ్యపక్షాలు టీడీపీ, బీజేపీ నాయకుల్లో కూడా అసంతృప్తి పెరుగుతోందట. తాము సహకరిస్తే… తమ తోడ్పాటుతో గెలిచి ఇప్పుడు తమనే విస్మరిస్తున్నారన్నది ఆ రెండు పార్టీల నాయకుల ఆవేదన. అదే సమయంలో ఇంకో ఇంట్రస్టింగ్ డిస్కషన్ సైతం నడుస్తోంది పార్టీల మధ్య. మద్యం, ఇసుక వ్యాపారాలన్నిటిని టీడీపీ నేతలకే కట్టబెట్టారని, కనీసం నామినేటెడ్ పదవుల్లోనైనా తమకు న్యాయం చేయకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు బీజేపీతో పాటు జనసేన సీనియర్స్.
ఈ రకంగా రాజానగరం కూటమిలో నిశ్శబ్దంగా అంటుకుంటున్న మంటలు…ప్రస్తుతానికి పెద్దగా బయటికి కనిపించకపోయినా, లోపల మాత్రం బాగా దహించి వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన వర్గాల్లో పదవుల పంచాయితీ పెద్ద రచ్చగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికల సమయంలో చెమటోడ్చిన వాళ్లు ఒక పక్క, అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గరగా ఉన్నవాళ్లు మరో పక్క. ఇదే ఇప్పుడు రాజానగరం జనసేనలో ప్రధాన చర్చ. ఈ మొత్తం వివాదానికి కారణం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వ్యవహారశైలేనని సొంత పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. మనల్ని పక్కన పెట్టి, తనకు దగ్గరగా ఉన్నవాళ్లకే పదవులు ఇస్తున్నారంటూ ఆఫ్ ది రికార్డ్‌గా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాయకులు. గత ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయ డ్రామాను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. అప్పుడు టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నా చివరికి జనసేన అభ్యర్థికి అండగా నిలిచారు. అంత కష్టపడి గెలిపించాం కానీ… ఇప్పుడు గుర్తు కూడా పెట్టుకోవడంలేదంటూ మండిపడుతున్నారట జనసేనలోని అసంతృప్త నేతలు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామంటూ వాళ్ళంతా సవాల్ విసురుతున్నట్టు సమాచారం.
