NTV Telugu Site icon

Off The Record: విజయనగరం, నెల్లిమర్ల జనసేనలో విభేదాలు..! పవన్‌ జన్మదిన వేడుకల సాక్షిగా ఏం జరిగింది?

Janasena

Janasena

Off The Record: విజయనగరం, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన నాయకుల మధ్య విభేదాలు ఆపార్టీ శ్రేణులను టెన్షన్‌ పెడుతున్నాయట. మరీ ముఖ్యంగా మహిళా నేతల మధ్య తగవులాటలు కేడర్‌లో చర్చనీయంశం అవుతున్నాయి. రెండు నియోజక వర్గాల్లో వ్యక్తిగత ప్రతిష్ఠకుపోయి నాయకులు వేర్వేరు కేంద్రాలను నడపడమే సమస్యకు మూల కారణం అంటున్నారు. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గాల బాధ్యతలను చూసిన మహిళా నేతలు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఎన్నికలకు ముందు నుంచే కాస్త తేడాగా ఉన్నా… ఇప్పుడు పవర్‌లోకి వచ్చాక కూడా తీరు మారకుంటే ఎలాగన్నది సగటు కార్యకర్త క్వశ్చన్‌. ముఖ్యంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి నియోజకవర్గంలోని పార్టీ సీనియర్స్‌ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ టైం నుంచి మెగా ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్న నాయకురాలు తూము లక్ష్మీరాజ్యంను ఎమ్మెల్యే కావాలని పక్కనబెడుతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయట. నామినేటెడ్ పోస్ట్‌లతో ఆమె పుంజుకునో, లేక ప్రోటోకాల్‌ వస్తేనో తనకెక్కడ ఏకు మేకవుతారోనన్న భయంతో ఎమ్మెల్యే కావాలనే పక్కన బెడుతున్నారంటూ పార్టీ కేడరే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.

కేడర్ కష్టాల్లో ఉన్నప్పుడు భరోసా ఇచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఏ మాత్రం ప్రోత్సాహం లేదని మధనపడుతున్నారట నెల్లిమర్ల జనసేన సీనియర్స్‌. అలాగే విజయనగరంలో పార్టీ ఇన్ఛార్జ్‌ యశస్విని అందర్నీ కలుపుకోకుండా ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్న అసంతృప్తి పెరుగుతోందట. ఇటీవల పవన్‌కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ర్యాలీ నిర్వహించారు యశస్విని. ఆ ర్యాలీకి పార్టీ సీవియర్స్‌ ఎవరికీ ఆహ్వానాలు లేవట. దీంతో వాళ్ళు రగిలిపోతున్నట్టు తెలిసింది. ఇలా ఈ ఇద్దరు మహిళా నేతల వ్యవహారశైలి నచ్చక కొందరు అసలు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఎవర్నీ ఎంకరేజ్‌ చేయడం లేదు సరే, పోనీ… ఈ మహిళా నేతలైనా పార్టీని బలోపేతం చేస్తున్నారా అంటే… అదీలేదని జనసైనికులే చెప్పుకుంటున్న పరిస్థితి. పార్టీ క్రియాశీలక సభ్యత్వాల విషయంలో కూడా ఈ ఇద్దరు నాయకురాళ్ళు శ్రద్ద తీసుకోలేదని రెండు నియోజకవర్గాల ద్వితీయ శ్రేణి నాయకులే అంటున్నారట.

విజయనగరం నియోజకవర్గ పరిధిలో జనసేన పటిష్టంగా ఉన్న గ్రామంలో సభ్యత్వ రుసుము విషయంలో కాస్త వెసులుబాటు కలిగేలా అధిష్ఠానంతో మాట్లాడమని అక్కడి జనసైనికులు చేసిన విజ్ఞప్తిని కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారట. శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉండి.. అక్కడి నుంచి విజయనగరం వచ్చి…సొంత పార్టీ అభ్యర్థిపైనే బహిరంగంగా నెగెటివ్‌ కామెంట్స్‌ చేసిన నాయకురాలి చిత్తశుద్ధిని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారట స్థానిక జనసేన నాయకులు. అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే వన్‌ ఉమన్‌ షో నచ్చక చాలామంది నియోజకవర్గ నాయకులు కామ్‌ అయిపోతున్నట్టు సమాచారం. ఎలాగోలా ఎమ్మెల్యే అయిపోయాను కాబట్టి ఇక ఎవర్నీ పట్టించుకోకున్నా… పోయేదేం లేదన్నట్టుగా ఆమె వ్యవహారశైలి ఉందన్నది లోకల్‌ కేడర్‌ అభిప్రాయం. మొత్తం మీద రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్‌ను కంగారు పెడుతున్నాయట. పార్టీ పెద్దలు ఇప్పటికైనా జోక్యం చేసుకుని పరిస్థితిని మార్చకుంటే రాబోయే రోజుల్లో వివాదాలు మరింత ముదురుతాయన్నది కేడర్‌ అభిప్రాయంగా తెలుస్తోంది.