Off The Record: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం.. ఏపీలోనే కాస్ట్‌లీయస్ట్ నియోజకవర్గంగా పేరున్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల వరకు గ్రానైట్ కింగ్‌లే రెండు పార్టీల తరఫున బరిలో నిలిచేవారు. అయితే గత ఎన్నికల్లో అనూహ్య పరిణామాల కారణంగా గ్రానైట్ నేపథ్యం లేని మద్దిశెట్టి వేణుగోపాల్, కదిరి బాబూరావులు వైసీపీ, టీడీపీ తరఫున బరిలో నిలిచారు. ఫ్యాను గాలిలో మద్దిశెట్టి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత కదిరి బాబూరావు నియోజకవర్గానికి ముఖం చాటేసి… కొన్నాళ్లకు వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికలలో దర్శి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన శిద్దా రాఘవరావు… గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అదే పార్టీ తరఫున ఒంగోలు ఎంపీగా ఆయన పోటీచేసి ఓడారు. అనంతరం అనూహ్యంగా శిద్దా రాఘవరావు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కొన్నాళ్లకు టీడీపీ అధిష్టానం పమిడి రమేష్‌ను కోఆర్డినేటర్‌గా నియమించింది. పార్టీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించింది.
Read Also: Off The Record: సిట్టింగులలో ఎంతమందికి టిక్కెట్లు? కొత్తవారికి అవకాశం ఉంటుందా?
గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన పమిడి రమేష్… పార్టీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టారనే ఇమేజ్‌ను కార్యకర్తల్లో తెచ్చుకున్నారు. అయితే పమిడి రమేష్‌ను తప్పించి మరొకరికి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించటంతో పాటు టిక్కెట్ కూడా కన్ఫామ్ చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై పార్టీ అధిష్టానం ఏం మాట్లాడకపోవటంతో కలత చెందిన పమిడి రమేష్… ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయినా పార్టీ కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటున్నారు. ఆయన బాధ్యతల నుండి తప్పుకుని దాదాపు ఎనిమిది నెలలు గడిచినా… ఇప్పటివరకు ఎవరినీ ఇన్‌ఛార్జ్‌గా నియమించలేదు అధిష్టానం. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలతోనే ఏదో ఒక విధంగా పార్టీ కార్యక్రమాలను నెట్టుకుంటూవస్తోంది. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యేకు… దర్శి నియోజకవర్గానికి పార్టీ ఇన్‌ఛార్జ్‌ని చూడాలని పురమాయించారట అధినేత చంద్రబాబు. దీంతో ఆయన వైసీపీ నేత బాదం మాధవరెడ్డితో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన విద్యాసంస్ధల అధినేత గోరంట్ల రవికుమార్‌లను ఒప్పించి అధినేత వద్దకు తీసుకెళ్లారట. అయితే ఇద్దరితో చర్చించిన చంద్రబాబు… ముందుగా దర్శికి వెళ్లి పనిచేయాలనీ, ఆ తర్వాత టిక్కెట్ సంగతి చూద్దామనీ చెప్పారట. ఈ ఇద్దరు చంద్రబాబును కలిసి వచ్చారన్న సమాచారంతో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల మధ్య కొత్త చర్చ మొదలైంది.
Read Also: Off The Record: రేవంత్ రెడ్డి పాదయాత్ర వేదిక ఎందుకు మారింది? సయోధ్య కుదరలేదా?
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా… పార్టీ కోసం పనిచేసి ఊపు తెచ్చిన నాయకుడ్ని బయటకు పంపి… కొత్త వాళ్ల కోసం వెతకడం ఏమిటని గుసగుసలాడుకుంటాన్నారు. దర్శి సీటును పొత్తులో భాగంగా జనసేనకు ఖరారు చేసే ఉద్దేశం ఉన్నందునే… చంద్రబాబు కూడా ఎటు తేల్చడం లేదని భావిస్తున్నారట. పొత్తు ఖరారైతే సీట్ల పంపకాలను బట్టి అప్పుడు చూడవచ్చన్న భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం. దర్శి సీటును ఒకవేళ జనసేనకు కేటాయిస్తే… మొన్నటివరకు దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పమిడి రమేష్‌ను జనసేనకు పంపి బరిలో నిలపాలని భావిస్తున్నారట. ఇలా చేయడం వల్ల అటు టీడీపీ శ్రేణులతో పాటు జనసేన సైనికులు కూడా కలిసికట్టుగా పనిచేస్తారనే అంచనాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ నేత బాదం మాధవరెడ్డి, విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్‌లు రహస్యంగా కలిసి రావడం ఏంటి? పమిడి రమేష్‌నే సర్దుబాటు చేయాలనుకున్నప్పుడు… వారిద్దరిని ఎందుకు పిలిపించి మాట్లాడారు? అనేది దర్శి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అసలు దర్శి నియోజకవర్గం విషయంలో చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి? ముగ్గురిలో టికెట్ ఎవరికి ఇస్తారు? ఒకవేళ పొత్తు ఖరారైతే పమిడి రమేష్‌ను జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయిస్తారనడంలో నిజమెంత? అనేది తెలియాలంటే… ఇంకొంతకాలం వేచిచూడాల్సిందే.