NTV Telugu Site icon

Off The Record: అమ్మకానికి సొసైటీల త్రిసభ్య కమిటీ పదవులు..? అక్కడ వైసీపీ వర్గాల్లో కలకలం..!

P. Gannavaram

P. Gannavaram

ఇదే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం. కోఆపరేటివ్‌ సొసైటీలకు ఎన్నికలు లేకపోవడంతో వేస్తున్న త్రిసభ్య కమిటీలు ఇక్కడ అధికార వైసీపీ ప్రజాప్రతినిధికి కాసులు కురిపిస్తున్నాయట. ఇందుకోసం అధికారులపై తీవ్రస్థాయిలో ఆ నేత ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. త్రిసభ్య కమిటీలో చోటు కల్పించేందుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. త్రిసభ్య కమిటీలో ఒకరిని ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకునేందుకు కూడా చెయ్యి తడపాల్సిందేనట. ఈ అంశంపై నియోజకవర్గంలో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది.

Read Also: Off The Record: తెలంగాణలో కాంగ్రెస్‌ త్రిశూల వ్యూహం..!

ప్రస్తుతం ఉన్న కమిటీలను తొలగించి కొత్తగా కమిటీలు వేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని ఓ మహిళా అధికారి ఫైల్స్‌ పెండింగ్‌లో పెడితే.. ఆ ప్రజాప్రతినిధికి చిర్రెత్తుకొచ్చిందట. ఆ మహిళా అధికారిపై ఒంటికాలుపై లేచారట. ఈ విషయాన్ని పి.గన్నవరంలో కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఆ మహిళా అధికారి.. సమస్యను మంత్రి విశ్వరూప్‌ దృష్టికి తీసుకెళ్లారట. అయినప్పటికీ ఆ ప్రజాప్రతినిధి వెనక్కి తగ్గలేదట. రెండేళ్లు పదవీకాలం ముగిసిన కమిటీలను తొలగించి కొత్త కమిటీలు వేయాల్సిందేనని పట్టుబట్టారట. ఓ సామాజికవర్గం వారిని కమిటీల నుంచి తొలగించి.. మరో సామాజికవర్గం వారికి చోటు కల్పిస్తున్నారట. ఈ మార్పులు చేర్పులు.. నోట్ల కట్టలు చేతులు మారుతున్న యవ్వారాలను.. ఫోన్ సంభాషణలను కొందరు వైసీపీ అధిష్ఠానానికి పంపించారట. తమకు తీరని అన్యాయం జరుగుతోందని వాదిస్తోన్న ఓ సామాజికవర్గం నాయకులు వైసీపీని వీడే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

Read Also: Off The Record: బైరెడ్డి టోన్‌ మారుతోందా? మళ్లీ టీడీపీకి చేరువ అవుతున్నారా..?

పి. గన్నవరం పరిధిలోని దాదాపు పది సొసైటీల్లో త్రిసభ్య కమిటీలను మారుస్తున్నారట. ఆ ప్రజాప్రతినిధి జిల్లా సహకార శాఖ ఆఫీసుకు ప్రతిపాదనలు పంపారట. వీటిలో మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక, అంబాజీపేట మండలం గంగలకుర్రు, పుల్లేటికుర్రు, చిరతపూడి, ఇరుసుమండ, అంబాజీపేట సొసైటీలతోపాటు అయినవిల్లి మండలంలోని నేదునూరు, సిరిపల్లి, మాగాం, పి.గన్నవరం మండలం ఊడిముడి సొసైటీలకు ఆ ప్రజాప్రతినిధి బంధువు అధికారిగా ఉన్నారట. ఆ అధికారి 25 లక్షలు దుర్వినియోగం చేశారని ఓ రిటైర్డ్‌ ఉద్యోగి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారట. దాంతో సెక్షన్‌ 51 ఎంక్వైరీ వేశారట. ఆ విచారణ ముందుకెళ్లకుండా ఆ ప్రజాప్రతినిధి పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ 25 లక్షలు తిరిగి చెల్లిస్తూ ఆ అధికారి ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అయినట్టు చెబుతున్నారు. బంధువైన ఆ అధికారిని అడ్డం పెట్టుకుని ఆ ప్రజాప్రతినిధి కొన్ని సొసైటీలలో ఉద్యోగాలు వేయించారట. ఈ వివాదంలో మరో అంశం కూడా ప్రచారంలోకి వస్తోంది. ఆ ప్రజాప్రతినిధికి కోటి రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయని.. ఆ అప్పు తీర్చడానికే త్రిసభ్య కమిటీలలో మార్పులు చేసి.. డబ్బులు ఇచ్చినవారికి పదవులు ఇస్తున్నారని అధికార పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొత్తానికి దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు ఇక్కడ సొసైటీలు పంచేసుకుంటున్నారని అధికారపార్టీ వర్గాలే సదరు ప్రజాప్రతినిధి తీరును చూసి నోరెళ్లబెడుతున్నాయి.