Off The Record: ఓపెన్ విత్ మంగ్లీ సాంగ్, డైలాగ్ ఫ్యాన్ ఫ్యాన్ అన్నవి ఇదే.. ఈ ఎన్నికల ప్రచారమే.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ని మరోసారి షేక్ చేస్తోంది. సింగర్ మంగ్లీ ట్రోల్‌కు కారణం అవుతోంది. దీన్ని బేస్ చేసుకునే.. టీడీపీ కేడర్ రచ్చో రచ్చస్య అంటోంది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీసూర్యనారాయణ దేవాలయంలో రధసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈసారి రాష్ట్ర పండగగా ప్రకటించడంతో… సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం వచ్చారు సింగర్ మంగ్లీ. తన ప్రోగ్రాం అయిపోయాక ఆదిత్యుని క్షీరాభిషేకంలో పాల్గొన్నారామె. అంత వరకు ఓకే. ఎలాంటి గొడవా లేదు. కానీ, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళడంతోనే అసలు రచ్చ మొదలైంది. ఇటు రామ్మోహన్ నాయుడిని, అటు మంగ్లీని కలిపి సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అందుకు కారణం ఏంటంటే.. ఇదిగో.. ఇదే.
గత ఎన్నికల టైంలో మంగ్లీ వైసీపీ కోసం పాటలు పాడారు, కొన్ని చోట్ల ప్రచారం కూడా చేశారు. ఆ విషయంలో కూడా తమ్ముళ్ళకు ఎలాంటి అభ్యంతరం లేదట. ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయని అంటున్నారు. కానీ.. అంతకు మించిన జరిగిన వ్యవహారాల విషయంలోనే… మంగ్లీ అంటే మాకు మంటెత్తి పోతోందని అంటున్నారట టీడీపీ కార్యకర్తలు. అందుకే మా నాయకుడని కూడా చూడకుండా రామ్మోహన్ నాయుడిని సైతం చెడుగుడు ఆడేస్తున్నామన్నది వాళ్ళ వెర్షన్. అప్పట్లో వైసీపీ కోసం పాడినట్టే తమ పార్టీకి కూడా ఎన్నికల ప్రచార గీతాలు పాడమంటూ మంగ్లీని సంప్రదించారట టీడీపీ నాయకులు. అందుకామె ముఖం మీదే తిరస్కరించడంతో పాటు అస్సలు తెలుగుదేశం కోసం నేను పాడే ప్రసక్తే లేదని, చంద్రబాబు నాయుడి పేరును కూడా నా నోటి నుంచి ఉచ్ఛరించబోనని కరాఖండీగా చెప్పేశారన్నది టీడీపీ వర్గాల అభియోగం. అలాంటి వ్యక్తిని ఇప్పుడు రాష్ట్ర పండుగ ఉత్సవాలకు ఆహ్వానించడం ఒక తప్పయితే… రామ్మోహన్ నాయుడు దగ్గరుండి మరీ ప్రోటోకాల్ దర్శనాలు చేయించడం ఏంటన్నది తమ్ముళ్ళు అభ్యంతరం. అందుకే ఇద్దర్నీ కలిపి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టు సమాచారం.
అదే సమయంలో మంగ్లీ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని కూడా లింక్ చేస్తూ… మంచి చెడు మీరే డిసైడ్ చేయండని జనం మీదికి వదులుతున్నారట. మంగ్లీ తనను తాను జగన్ అభిమానిగా చెప్పుకున్నారని, వైసీపీ హయాంలో ఎస్వీబీసీ ఛానల్ సలహాదారు పదవి కూడా దక్కిందని, ఆ విషయాలన్నీ రామ్మోహన్ నాయుడికి గుర్తుకు రాలేదా అంటూ… తమ నేతను కూడా సోషల్ మీడియాలో ఉతికారేస్తున్నారట టీడీపీ సానుభూతిపరులు. ప్రోగ్రామ్ బుక్ చేయడాన్ని ఒకలా తీసుకున్నా…. రామ్మోహన్ దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఫోటోలు దిగడాన్ని ఎలా చూడాలన్నది వాళ్ళ క్వశ్చన్. వైసీపీ మద్దతుదారులను, ఆ పార్టీకి అనుకూలంగా పని చేసిన వ్యక్తులను అందలం ఎక్కించడం ఫ్యాషన్‌గా మారిందా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఎవరి పాటికి వాళ్ళు ఇలా చేసుకుంటూపోతే… ఐదేళ్ళు పార్టీ కోసం నానా కష్టాలు పడి, లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకున్న వాళ్ళం సినిమా చూస్తూ కూర్చోవాలా అంటూ టీడీపీ కేడర్ సీరియస్ అవుతున్నట్టు సమాచారం. అయితే అతిథిగా వచ్చిన వ్యక్తిని దగ్గరుండి దర్శనం చేయిస్తే తప్పేంటన్నది రామ్మోహన్ అనుచరుల క్వశ్చన్. కానీ…కాలిపోతున్న టీడీపీ కేడర్ మాత్రం ఇలాంటి వివరణలు వినే స్థితిలో లేదట. గతంలో మంత్రులు పార్థసారధి, కొల్లు రవీంద్ర విషయంలో కూడా ఇలాంటి వివాదాలే రేగాయి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ… నాయకులు ఎంతటివాళ్ళయినా వదలడం లేదు.