Site icon NTV Telugu

Off The Record: రామ్మోహన్ నాయుడు మాటలన్నీ పైపై డబులేనా..?

Kinjarapu Ram Mohan Naidu

Kinjarapu Ram Mohan Naidu

Off The Record: హ్యాట్రిక్‌ విజయాలు…, చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి…., మంచి వాగ్ధాటి, రాజకీయ వారసత్వం కలిసొచ్చి డైనమిక్‌ లీడర్‌గా గుర్తింపు. శ్రీకాకుళం ఎంపీ, సెంట్రల్ మినిస్టర్‌ రామ్మోహన్‌ నాయుడి గురించి చెప్పుకునే పాజిటివ్‌ మాటలివి. అన్నట్టుగానే… ఇందులో ఏదీ అసత్యం లేదు, కాదనేవాళ్ళు ఎవరూ లేరు. కానీ… ఎదుగుదల మొత్తం ఆయన వ్యక్తిగతానికేనా? తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించిన సిక్కోలు జనానికి అవసరం లేదా అన్నది ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న. ఈసారి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన పాత్ర పోషించటడం, అందుకు తగ్గట్టే రామ్మోహన్‌ నాయుడికి కూడా ప్రాధాన్యత పెరగడంతో… ఏళ్ళ తరబడి ఎదుగూ బొదుగూ లేకుండా పోయిన శ్రీకాకుళం వాసుల పొలాల్లో ఆశల మొలకలెత్తాయి. ఇంకేముంది…. మనోడి పరపతి అరచేతి మందాన పెరిగిపోయింది. వద్దన్నా అభివృద్ధే అంటూ తెగ మురిసిపోయారట. అందుకు తగ్గట్టే రామ్మోహన్‌ నాయుడు కూడా మొదట్లో బాగానే హడావిడి చేశారు. కానీ… ఏడాది తిరిగేసరికి ఆశల మొలకలన్నీ అలాగే ఇగిరిపోయాయట. అసలు మన కోసం ఎంపీ ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ వాసుల ప్రశ్న.

Read Also: Cyclone and Heavy Rains: భారీ వర్షాలపై సర్కార్‌ హైఅలర్ట్.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

విమానయాన శాఖ మంత్రిగా… జిల్లాకు కార్గో ఎయిర్‌పోర్ట్‌ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారట ఆయన అనుచరులు. అయితే… దాని వల్ల ఎవరికి, ఎంతవరకు ఉపయోగం, కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది లోకల్‌ డౌట్‌. కనీసం ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పించగలిగే ఏదన్నా పరిశ్రమను తీసుకువస్తే… జీవితాలు బాగుపడతాయిగానీ…. కార్గో ఎయిర్‌పోర్ట్‌వల్ల నియోజకవర్గంలోని సామాన్యులకు ఏం ఒరుగుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయట. ఆ పని చేయలేకుంటే…. ఇప్పుడు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నట్టు… చివరికి రైల్వే స్టేషన్‌లో స్టీల్‌ కుర్చీలు మినహా ఎలాంటి అభివృద్ధి కనిపించబోదని లోకల్‌ టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. మారిన పరిస్థితుల దృష్ట్యా… ఈసారి ఎంపీ మీద అంచనాలు బాగా పెరిగాయి. కానీ… ఏడాదిలో ఏ మార్పు కనిపించకపోవడంతో… అసహనం పెరుగుతోందట. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయల నిధులు తీసుకువస్తానని గతంలో ప్రకటించారు రామ్మోహన్‌. ఆ నిధులతో.. అత్యంత ప్రాముఖ్యం ఉన్న అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలను అభివృద్ధి చేస్తామని, జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తామని కొత్తల్లో చెప్పారాయన.

Read Also: Delhi: అక్రమ మత మార్పిడి ముఠా గుట్టురట్టు.. అనేక రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌.. హిందూ యువతులే టార్గెట్..!

కానీ… ప్రస్తుతం ఇవేవీ పట్టాలెక్కుతున్న సూచనలు కనిపించడం లేదన్నది లోకల్‌ టాక్‌. వైసీపీ హయంలో పనులు మొదలైన మూలపేట పోర్ట్‌కు అనుసంధానంగా వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. అక్కడ పెట్రోకెమికల్ హబ్ తీసుకువస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించేశారు బాబాయ్ అచ్చెన్నాయుడు, అబ్బాయ్ రామ్మోహన్‌ నాయుడు. కానీ… అసలా ప్రక్రియ మొదలైందో లేదో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కేంద్రంలో ఇంత పలుకుబడి ఉన్నప్పుడు ఇప్పుడు కాకుంటే… ఇంకెప్పుడు నియోజకవర్గానికి మంచి చేస్తారన్నది స్థానికుల ప్రశ్న. అదంతా ఒక ఎత్తయితే… అసలు రామ్మోహన్‌ నాయుడు నియోజకవర్గానికి చుట్టంలా మారిపోయారన్నది ఇంకో వెర్షన్‌. ఎంత కేంద్ర మంత్రి అయితే మాత్రం… గెలిపించిన జనానికి దూరమైతే ఎలాగన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. మరోవైపు రామ్మోహన్‌ ఇప్పటికీ బాబాయ్‌ నీడలోనే ఉన్నారని, ఎదన్నా పని అడిగితే… బాబాయ్‌ చూసుకుంటారని చెబుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు ఆయన పరిధిలోని ఎమ్మెల్యేలు. అన్నీ బాబాయే చేస్తే… ఇక ఆయన ఎందుకన్నది వాళ్ళ ప్రశ్న అట. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. పూలమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి రావచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకుని బేస్‌ వదలకుండా ఉంటే మంచిదంటూ అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నారట కేంద్ర మంత్రి సన్నిహితులు కొందరు. బాబాయ్‌ రాష్ట్రంలో, అబ్బాయ్‌ కేంద్రంలో మంత్రులుగా ఉన్నందున జిల్లాను అభివృద్ధి చేయడానికి ఇంతకు మించిన టైం దొరకదన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. స్ననిహితులు, శ్రేయోభిలాషుల వార్నింగ్స్‌ని పాజిటివ్‌గా తీసుకుని మార్చుకుంటారో లేక వీళ్ళా… మాకు చెప్పేది అంటూ వదిలేస్తారో… అది వాళ్ళ ఇష్టం అంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.

Exit mobile version