NTV Telugu Site icon

Off The Record: వైసీపీ నేతలను ఆపడంలో బైరెడ్డి విఫలమయ్యారా..?

Byreddy

Byreddy

Off The Record: బైరెడ్డి సిద్దార్థరెడ్డి…వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఓ వెలుగు వెలిగారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. నందికొట్కూరులో అయితే ఎమ్మెల్యే కంటే ఎక్కువ పాలిటిక్స్‌ చేశారు. నిత్యం వార్తల్లో నిలిచారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో.. మాజీ శాప్ చైర్మన్, నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శిబిరంలో నేతలు జెండా ఎత్తేస్తున్నారట. రాష్ట్ర యువనేతగా పార్టీలో ప్రొజెక్ట్ అయినా సిద్దార్థరెడ్డి.. సొంత నియోజకవర్గంలో మాత్రం తన పట్టు నిలుపుకోలేకపోయారు. ఎన్నికల తరువాత ఏకంగా సొంత నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది. ఒకరు కాదు , ఇద్దరు కాదు. మున్సిపల్ చైర్మన్ సహా 16 మంది కౌన్సిలర్లు వైసీపీ జెండా ఎత్తేశారు. ఛైర్మన్‌తో పాటు కౌన్సిలర్లందరూ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలు.. ఇలా అందరూ గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారట.

నందికొట్కూరు నియోజకవర్గం అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి అంటే నందికొట్కూరు అనేలా వ్యవహరించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వైసీపీలో ఎమ్మెల్యే ఆర్థర్‌ని పక్కన పెట్టి.. ఆంతా తానై వ్యవహరించారు. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీని వీడాల్సి వచ్చిందట. కాంగ్రెస్‌లో చేరిన ఆర్థర్.. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 6 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఆర్థర్‌ ఓట్లు చీల్చడంతో.. నందికొట్కూరులో వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్థర్‌ని గెలిపించింది తానే అని చెప్పుకున్న సిద్ధార్థ రెడ్డి.. 2024 ఎన్నికల్లో గెలిపించలేకపోయారా అనే చర్చ జిల్లాలో జరుగుతోందట. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో.. ఇపుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం పక్క చూపులు చూస్తోందట. అధికార పార్టీ నేతలకు సిద్ధార్థరెడ్డి వర్గీయులు టచ్‌లోకి వెళ్లారట.

తన సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఛైర్మన్‌, కౌన్సిలర్లు పార్టీని వీడుతుంటే.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఛైర్మన్‌తో సహా కౌన్సిలర్లు పార్టీకి గుడ్‌బై చెబుతుంటే.. ఆపలేకపోయారా ? లేదంటే ఆపే ప్రయత్నం చేయలేదా అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. మున్సిపల్ చైర్మన్ సుధాకర్‌ రెడ్డి సహా 16 మంది కౌన్సిలర్లు ఒకేరోజు జెండా ఎత్తేయడంతో.. పార్టీ క్యాడర్ నీరసించిపోయిందట. ఇంకా ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు వైసీపీ కండువా పక్కన పెట్టేందుకు రెడీగా ఉన్నారట. పార్టీ గెలుపు, ఓటములు సర్వసాధారణమే అయినా అధికారం పోయిందని క్యాడర్‌ను నిలబెట్టుకోలేకపోతున్నారనే చర్చ వైసీపీలో ఉందట. ఎన్నికల ఫలితాల తరువాత కొద్ది రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్నారట. కొందరు నేతలు హైద్రాబాద్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. వైసీపీని నమ్ముకొని అప్పుల పాలయ్యామని, తమ పరిస్థితి ఏమిటని చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ రెడ్డి వర్గం అంతా వైసీపీని వీడి.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే సిద్ధార్థ రెడ్డే.. స్వయంగా పంపుతున్నారనే ప్రచారమూ జరుగుతోంది. అయితే సిద్ధార్థ రెడ్డి సన్నిహితులు మాత్రం.. ఇదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. కారణం ఏదైనా నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం నుంచి వలసలు కొనసాగుతాయనే ప్రత్యర్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అలర్టయి.. పార్టీ వీడకుండా ఆపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.