NTV Telugu Site icon

Off The Record: పది మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్‌.. మళ్లీ గులాబీ పిలుస్తోందా..?

Brs

Brs

Off The Record: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాలు చెప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్‌ అయ్యారు. మామూలుగా అయితే… ఇది రొటిన్‌ వ్యవహారంలాగే అనిపించేదిగానీ… పార్టీ ఫిరాయింపుల్ని బీఆర్‌ఎస్‌ సీరియస్‌గా తీసుకోవడంతో…. పొలిటికల్‌ ఫైర్‌ మొదలైంది. ఆ పది మంది మీద ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ఓ వైపు సుప్రీం కోర్ట్‌లో పెద్ద యుద్ధమే చేస్తోంది గులాబీ పార్టీ. మరోవైపు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు అంత కంఫర్ట్‌గా లేరని, వాళ్ళలో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోందన్న ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు కారు పార్టీ నాయకులు. ఇదోరకం మైండ్‌ గేమ్‌ అని కొందరు సర్దిచెప్పుకుంటుండగా… మరి కొందరు మాత్రం కొన్ని ఉదాహరణల్ని చూపిస్తున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి తన క్యాంప్‌ ఆఫీసు నుంచి కేసీఆర్‌ ఫోటోను తీసే ప్రసక్తే లేదని బహిరంగంగానే చెప్పేశారు. ఇక తాను పార్టీ మారినట్లు దుష్ర్పచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌ ప్లెక్సీల్లో తన ఫోటోను ముద్రిస్తున్నారంటూ ఏకంగా పోలీసు కంప్లయింట్‌ ఇచ్చేశారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి. ఎఫ్‌ఐఆర్‌ కూడా చేయించుకున్నారాయన. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైడ్రాపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. అలాగే.. ఫార్ములా ఈ కార్‌ రేసు విషయంలో కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు దానం.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరినప్పటికీ అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో… ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వస్తారనే ప్రచారం గులాబీ గూటి నుంచి గుప్పుమంటోంది. అయితే కాంగ్రెస్‌ మాత్రం ఈ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకుంటోందట. ఇదంతా బీఆర్‌ఎస్‌ మైండ్‌ గేమ్‌ పాలిటిక్స్‌ అని, తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం పటిష్టంగా ఉండడానికి కృషి చేస్తున్నారని, వాళ్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు కాంగ్రెస్‌ ముఖ్యులు. కానీ… నిప్పులేనిదే పొగరాదుకదా అన్నది కొందరి క్వశ్చన్‌. అలాగే ఈ పీఛేముడ్‌ ఎమ్మెల్యేలు ఎవరు? నిజంగానే ముగ్గురు ఉన్నారా? ప్రచారం జరుగుతున్నట్టు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే జరిగి మార్పులేంటి అంటూ తెగ చర్చ జరిగిపోతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. కాకపోతే ఇందులో వాస్తవం ఎంతన్న విషయంలో క్లారిటీ లేదు. సుప్రీం కోర్ట్‌ కేసు తర్వాతే ఈ విషయంలో క్లారిటీ వస్తుందన్నది ఎక్కువ మంది చెప్పే మాట. కాంగ్రెస్‌లో చేరిన 10మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కోర్ట్‌ తీర్పు వస్తే… తిరిగి సొంత పార్టీలోకి వచ్చి పదవి కాపాడుకోవడానికి కొంత మంది అయినా ప్రయత్నిస్తారని, అలా ఎంతమది చేస్తారన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. అయితే అలా చేసినా పదవి కాపాడుకోవడం అంత తేలికకాదన్న మరో వాదన సైతం ఉంది. వేటు వేయాలని కోర్ట్‌ చెప్పినా…., స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నా…. అది అందరికి వర్తిస్తుంది. అంతే తప్ప కోర్ట్‌ తీర్పు వచ్చిన వెంటనే గబుక్కున మళ్ళీ కారెక్కేసి తూచ్‌…. మేం బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామంటే కుదరదని, లీగల్‌గా అది చెల్లబోదని అంటున్నారు కాంగ్రెస్‌ నాయకులు. దీంతో త్రిశంకుస్వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల పల్స్‌ రేట్‌ పెరిగిపోతోందట. సుప్రీం కోర్ట్‌ తీర్పు తర్వాతగానీ… ఈ విషయంలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు