NTV Telugu Site icon

Off The Record: కాంగ్రెస్‌లో చేరికలకు బ్రేక్‌ పడిందా..? ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరా?

Brs

Brs

Off The Record: ఆ మధ్య రోజుకో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్‌లో చేరుతూ వెళ్ళారు. ఇప్పటికి పది మంది అలా కండువాలు మార్చేశారు. ఆ ఊపులో రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ఇంకేముంది బీఆర్ఎస్‌ పని అయిపోయింది. ఎమ్మెల్యేల్ని గంపగుత్తగా లాగేసి బీఆర్‌ఎస్‌ లెజిస్లేచర్‌ పార్టీని సీఎల్పీలో విలీనం చేస్తారని, అసెంబ్లీ సమావేశాలలోపే ఆ ప్రక్రియ పూర్తయిపోతుందన్న మాటలు సైతం వినిపించాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ…అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదు. అసలు కొద్ది రోజులుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికలు బ్రేకులు పడ్డాయి. నిబంధనల ప్రకారం గులాబీ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఎల్పీ విలీనం సాధ్యం. ప్రస్తుతం ఆ సంఖ్య పది దగ్గరే ఆగిపోయింది. దీంతో చేరికలు ఎందుకు ఆగిపోయాయన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ. వివిధ కారణాలతో తమ పార్టీనే తాత్కాలికంగా చేరికలకు బ్రేక్‌ వేసిందా? లేక కారు దిగడానికి మిగతా ఎమ్మెల్యేలు సుముఖంగా లేరా అని చర్చించుకుంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. పార్టీ ఫిరాయింపులపై ఓ వైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ కోర్టు మెట్లు ఎక్కాయి.

దీంతో, తీర్పులు వెలువడక ముందే… ఇబ్బందులు లేకుండా విలీన ప్రక్రియ ముగుస్తుందని భావించారు కాంగ్రెస్‌ నాయకులు. కానీ ఇప్పుడా ఊసే ఎందుకు లేదన్నది వాళ్ళకు క్వశ్చన్‌ మార్క్‌ అవుతోందట. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో… కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అధికార పక్షం శాసనసభ్యుల సీట్ల వెనుక వరుసలో కూర్చుంటున్నారు. వాళ్ళు కూడా ఒకేసారి ఎల్పీ విలీనం అవుతుందని భావించినా అలా జరక్కపోవడంతో కన్ప్యూజ్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో వాదన ప్రచారంలోకి వచ్చింది. బీఆర్ఎస్‌కు చెందిన ఓ కీలక నేత సొంత పార్టీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారని, కాంగ్రెస్ వైపు చూడకుండా… ఆర్థికంగా కొంత సర్దుబాటు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో… చేరికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడ్డట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌లో చేరినా పూర్తి స్థాయి భరోసా ఉంటుందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారన్న టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఎల్పీ విలీనం వార్తలతో బీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై విపరీతమైన వత్తిడి పెరిగిందని, ఆ క్రమంలోనే… ఓ కీలక నేత ఎమ్మెల్యేలకు అన్ని రకాలుగా నచ్చజెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యేల చేరిక కాస్త వాయిదా పడిందన్న చర్చ తెర మీదికి వచ్చింది.

ఎమ్మెల్యేల చేరిక అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. వాళ్ళు చేరిన వెంటనే సమాచారం ఇస్తామంటూ సమాధానం దాటవేశారాయన. అయితే అసెంబ్లీ సమావేశాల్లో అందర్నీ లాగేసి ప్రతిపక్షానికి ఆయుధం ఇవ్వడం ఎందుకు అనుకున్నారా? లేదంటే మరేదైనా ఎత్తుగడ ఉందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి రాజకీయ పరిశీలకులకు. విలీనానికి మించిన మరో ఆర్షన్‌ ఉందా అని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చిన వాళ్ళందర్నీ ఒక గ్రూప్‌గా గుర్తించే అంశం పరిశీలనలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే… చేరికలు ఆగడమన్నది తాత్కాలికమేనని, సినిమా అప్పుడే అయిపోలేదన్న టాక్‌ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. ఈ ఎపిసోడ్‌లో ముందు ముందు ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి మరి.