Off The Record: తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలైంది. పండగ కోసం పాటలు సిద్ధం చేసి విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు ఔత్సాహికులు. అలాగే పొలిటికల్ పార్టీలు కూడా… వేటి స్టైల్‌లో అవి సాంగ్స్ సిద్ధం చేసుకుంటున్నాయి. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ఈసారి మాత్రం బీఆర్‌ఎస్ బతుకమ్మ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఏళ్ళ తరబడి గులాబీ పార్టీ… బతుకమ్మ వేడుకలంటే…. కేరాఫ్ కవితే అన్నట్టుగా ఉండేది వ్యవహారం. అసలామె బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేవాళ్ళు సైతం ఉన్నారు పార్టీలో. కానీ… రోజులు మారాయ్…. పరిస్థితులు తిరగబడ్డాయ్…. ఇప్పుడసలు కవిత ఊసే లేకుండా బతుకమ్మ పండక్కి సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్. ఆమె… ఎంత పార్టీకి రాజీనామా చేసినా… కనీసం పండగ వేడుకల్లోనైనా కనిపిస్తుందని ఆశించారు కొందరు. కానీ… అలాంటిదేం లేదు, ఇక నో ఛాన్స్ అంటూ తన తాజా చర్య ద్వారా క్లారిటీ ఇచ్చేసింది పార్టీ అధిష్టానం. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు పార్టీ కేడర్‌తో కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసేవారు కవిత. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ… వివిధ జిల్లాల్లో వేడుకల్లో పాల్గొనేవారామె. ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి తరపున పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసి పార్టీకి సపోర్ట్‌గా ఉండేవారు. అప్పట్లో ఏర్పాట్లన్నిటినీ బీఆర్ఎస్ మహిళా నేతలు దగ్గరుండి చూసేవారు. ఉద్యమ సమయంలో జాగృతి బతుకమ్మ వేడుకలు సాంస్కృతికంగా సూపర్ హిట్ అయ్యాయి.
Read Also: Mirai : ఆ సినిమాలతో రూ.140 కోట్లు నష్టపోయా : టీజీ విశ్వ ప్రసాద్
ఇక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా… మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నాయకులు… ఇలా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు కవితతో కలిసి సెలబ్రేషన్స్‌లో పాల్గొనేవారు. కార్యక్రమం కోసం ఏటా ఓ కొత్త పాటను విడుదల చేస్తూ… పార్టీ తరపున అందుకు సంబంధించిన వ్యవహారాలన్నిటినీ కవితే చూసుకునే వారు. కానీ… ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశాక దృశ్యం మారిపోయింది. తొలిసారి ఆమె లేకుండా బీఆర్‌ఎస్ ఈ వేడుకల్ని ఎలా చేస్తుంది? సాంగ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురు చూశారు చాలామంది. అదే సమయంలో ఆ లోటు కనిపించకుండా ఉండటం కోసం పార్టీ కొన్ని జాగ్రత్తలు తీసుకుందట. అందుకోసం పార్టీ తరఫున ప్రత్యేకంగా మూడు పాటలు తయారు చేయించి విడుదల చేశారు. అయితే… మొత్తం మూడు పాటల్లో పొలిటికల్ టచ్ ఉంది తప్ప… కల్చరల్ యాక్టివిటీ కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదంటూ… రూపొందించిన పాటలతో ఈసారి బతుకమ్మ ఆడాలని మహిళలకు పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్. పాటల్లో ఎక్కడా… సాంస్కృతిక సందడి లేకపోదగా… కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆ పార్టీ నాయకుల ఫోటోలు, వీడియోలతో నిండిపోవడంతో… ఇవి ఫక్తు పొలిటికల్ సాంగ్స్ అభిప్రాయాలు బలపడుతున్నాయి. అక్కడక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన నిరసన కార్యక్రమాలను కూడా పాటల్లో చూపారు. మూడు సాంగ్స్ రిలీజ్ చేసినా… ఎక్కడా కవిత ఫోటో కూడా కనిపించకుండా జాగ్రత్త పడింది బీఆర్‌ఎస్ అధిష్టానం.
Read Also: High Court: కుటుంబం నుంచి విడిపోవాలని భర్తపై భార్య ఒత్తిడి.. హైకోర్టు సంచలన తీర్పు..
దీంతో ఇక పార్టీ పరంగా బతుకమ్మ బంధం కూడా పూర్తిగా తెగిపోయినట్టేనా అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. బీఆర్‌ఎస్‌లో బతుకమ్మ అంటే… ఠక్కున కవితే గుర్తుకు వచ్చే పరిస్థితి ఏర్పడటంతో… ఇక ఆ గుర్తుల్ని చెరిపేయడానికి పార్టీ పెద్దలు చాలా జాగ్రత్త పడ్డారన్న అభిప్రాయం ఏర్పడింది రాజకీయవర్గాల్లో. ప్రస్తుతం గులాబీ నాయకత్వం… కాంగ్రెస్, బీజేపీల్లాగే… కవితను కూడా ఓ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నట్టు కనిపిస్తోందంని అంటున్నారు కొందరు. అందుకే పార్టీ నుంచి ఆమె ఆనవాళ్ళను పూర్తిగా చెరిపేసే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈనెల 21న తెలంగాణ భవన్‌లో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న బతుకమ్మ వేడుకల్లో ఎట్టి పరిస్థితుల్లో గతంలో కవిత రూపొందించిన పాటలను ప్రదర్శించకూడదని, అవి వినిపించకూడదని ఖచ్చితమైన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఆమె లేకున్నా… వచ్చిన లోటేమీ లేదు. అంతకంటే బాగా ప్రోగ్రామ్ నిర్వహించడానికి మా మహిళా నేతలు యాక్టివ్‌గా ఉన్నారని చెప్పాలన్నది బీఆర్‌ఎస్ పెద్దల ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
