NTV Telugu Site icon

Off the Record about Bodhan TRS: బోధన్‌ టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే వర్సెస్‌ లీడర్స్‌,, పొమ్మనలేక పొగ పెడుతోంది ఎవరు?

Bodhan

Bodhan

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ టీఆర్‌ఎస్‌లో కొంత కాలంగా పార్టీ నేతల మధ్య పొసగడం లేదు. ఎమ్మెల్యే షకీల్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తూము పద్మ భర్త శరత్‌రెడ్డి మధ్య వైరం శ్రుతిమించింది. ఒకే పార్టీ అయినప్పటికీ..చిన్నగా మొదలైన విభేదాలు రెండు వర్గాలను శత్రువులుగా మార్చేశాయి. బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం కంటే ముందు వరకు.. ఎమ్మెల్యే షకీల్‌కు… శరత్ రెడ్డి ప్రధాన అనుచరునిగా ఉండేవారు. శివాజీ విగ్రహ విషయంలో శరత్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు గుర్తించి కేసు పెట్టడంతో రచ్చ రచ్చ అయ్యింది. అప్పటి నుంచి ఎమ్మెల్యేకు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ భర్తకు గ్యాప్‌ వచ్చిందని చెబుతారు. ఇదే సమయంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే సోదరుడు సోహెల్‌ అన్నింటిలోనూ జోక్యం చేసుకోవడం.. ఆ వివాదాలకు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.

నియోజకవర్గం టీఆర్ఎస్‌లో నెంబర్‌ 2గా ఎదిగేందుకు శరత్‌ రెడ్డి ప్రయత్నించడం.. బలం పెంచుకోవడం.. ఎమ్మెల్యే షకీల్‌కు గిట్టలేదని టాక్‌. ఇంతలోనే శరత్‌ పార్టీ మారిపోతారనే ప్రచారం ఊపందుకుంది. ఓ ప్రధాన పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఛైర్‌పర్సన్‌ తూము పద్మ అధికారాలకు ఎమ్మెల్యే కత్తెర వేయడం మొదలు పెట్టారట. మున్సిపల్‌ కమిషనర్‌ రూపంలో అధికారాలకు కోత పెడుతున్నారట. దాంతో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, కమిషనర్ల మధ్య కూడా మరో గొడవ రాజుకుంది. పోలీస్‌ స్టేషన్‌ మెట్టు ఎక్కే వరకు సమస్య శ్రుతిమించింది.

మున్సిపల్ పాలకవర్గంతో సంబంధం లేకుండా కమిషనర్‌ సమావేశం అజెండా రూపొందించడం వివాదానికి కారణంగా పైకి కనిపిస్తున్నా.. తెరవెనుక రాజకీయ మంటలు వేరే ఉన్నాయట. అయితే శరత్‌ ఎదుగుదలను ఓర్వలేక.. ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నారనే వాళ్లూ పార్టీలో ఉన్నారు. బోధన్‌ టీఆర్‌ఎస్‌లో గొడవల గురించి తెలిసినా పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకపోవడం వెనుక వ్యూహం ఉందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే బోధన గులాబీ శిబిరంలో నేతల మధ్య తగువులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని.. అవి ఎప్పుడు.. ఏ క్షణంలో ఏ విధంగా బరస్ట్‌ అవుతాయో చెప్పలేమని ఆందోళన చెందుతున్నాయట పార్టీ శ్రేణులు. మరి.. ఈ సమస్యకు పార్టీ పెద్దలు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.

బోధన్ టీఆర్ఎస్ నేతల మధ్య గొడవలు | Off The Record | Ntv