NTV Telugu Site icon

Off The Record: ఆ ఎమ్మెల్యేకి కాషాయం బోర్ కొట్టిందా.. మూడు రంగులు ముద్దు వస్తున్నాయా..?

Mla Rakesh Reddy

Mla Rakesh Reddy

Off The Record: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ మీద మనసు పారేసుకున్నారా…? అంటే అవుననే అనిపిస్తోందని అంటున్నాయి లోకల్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌. ఇదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయింది. తాజాగా జరిగిన పరిణామాలే ఈ అనుమానాలకు తావిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. తన నియోజకవర్గంలో అమృత్ కార్యక్రమాల పరిశీలనకు బోధన్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించారాయన. ఇక అందుకోసమే… ఎదురు చూస్తున్నానా అన్నట్టుగా… ఆయన పిలవడం, ఈయన వెళ్లడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు… పిలవగానే… మరోమాట లేకుండా వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారట బీజేపీ శాసనసభ్యుడు. తన ఇంట్లో తేనీటి విందు ఇచ్చాక… ఆర్మూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఇద్దరూ కలిసి పరిశీలించారు.

Read Also: Second Marriage: గుట్టుగా రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. ట్విస్ట్‌ ఇచ్చిన మొదటి భార్య..!

ఆ టైంలో కలుపుగోలుగా కలియదిరిగారట ఇద్దరూ. ఆ టూరే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సవాలక్ష సందేహాల్ని రేకెత్తిస్తోంది. దానిచుట్టూ రకరకాల ఊహాగానాలు, గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి పార్టీ మారే ఆలోచన ఉందని, సుదర్శన్ రెడ్డి పర్యటన వెనుక ఉద్దేశ్యం అదేనన్నది ఆ గుసగుసల సారాంశం. పారిశ్రామిక వేత్తగా ఉన్న పైడి రాకేష్ రెడ్డి మొదట్లోనే… కాంగ్రెస్ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేయాలని భావించారట. కానీ… రకరకాల పరిణామాలతో కథ ఊహించని మలుపులు తిరిగి… చివరికి కాషాయ కండువా కప్పుకున్నారాయన. బీజేపీ నుంచి ఆర్మూర్ టికెట్టు దక్కించుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆర్మూర్‌ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే తాను అయినా… కాంగ్రెస్ ఇంచార్జ్‌ మాటే చెల్లుబాటు అవుతోందట. ఈ విషయంలో తరచూ హర్ట్‌ అవుతున్న రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజ్యాంగ విలువలు కాపాడమంటూ విన్నపాలు చేశారు.

Read Also: Second Marriage: గుట్టుగా రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. ట్విస్ట్‌ ఇచ్చిన మొదటి భార్య..!

మరో వైపు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ.. అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించారాయన. ఇలాంటి పరిస్థితుల్లో.. అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియోజకవర్గానికి ఆహ్వానించడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. పైగా మాజీ మంత్రి కూడా అయిన సుదర్శన్ రెడ్డిని కొద్ది రోజులుగా బీజేపీ ఎంపీ అర్వింద్ టార్గెట్ చేస్తున్నారట. ప్రత్యర్ధి పార్టీ, పైగా ఎంపీ వ్యతిరేకించే ఎమ్మెల్యేను.. నియోజకవర్గానికి పిలిచి మర్యాదలు చేయడం ఏంటో బీజేపీ నేతలకు సైతం అంతుబట్టడం లేదట. ఈ ఎపిసోడ్‌పై అటు ఎంపీ అర్వింద్ వర్గం సైతం రుసరుసలాడుతున్నట్టు తెలిసింది. కొద్ది రోజులుగా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గ్యాప్ మొదలైందన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో. ఈ క్రమంలో సుదర్శన్ రెడ్డి ఆర్మూర్ పర్యటన అగ్గి రాజేసింది. కాంగ్రెస్ లో చేరాలంటే జిల్లాలో ముఖ్యుడైన సుదర్శన్ రెడ్డి ప్రమేయం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో… ఆయనతో మంత్రాంగం నడిపేందుకే రాకేష్‌రెడ్డి అభివృద్ధి పనుల పరిశీలన పేరిట పిలిచారన్న అనుమానాలు పెరుగుతున్నాయి రెండు పార్టీల్లో. ఫలితం ఎలా ఉన్నా.. ఈ విందు రాజకీయం మాత్రం అధికార, ప్రతిపక్షాలకు చెందిన స్థానిక వర్గాల్లో సంచలనమైంది. మరోవైపు ఈ ఎపిసోడ్‌పై కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ వినయ్ రెడ్డి సైతం నొచ్చుకున్నట్టు తెలిసింది. మరి ఈ తేనీటి విందు ఇందూరు రాజకీయాల్లో కీలక మార్పులకు పునాది వేయబోతోందా? పరిణామాలు ఎట్నుంచి ఎటు మారే ఛాన్స్‌ ఉందన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయవర్గాల్లో.