Off The Record: కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి స్టైల్…కూటమిలో చర్చనీయాంశంగా మారింది. నిజం చెప్పాలంటే ఆదోని ప్రాంతంలో బీజేపీకి బలం లేదు. కూటమి పొత్తులో భాగంగా ఆదోని టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో ఆ పార్టీ టికెట్ దక్కించుకుని పార్థసారథి గెలుపొందారు. గతంలోనూ టీడీపీ పొత్తులో ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోందట. వాస్తవంగా అదోనిలో విజయానికి బీజేపీ తరపున పోటీ చేసిన పార్థసారథి బాగా కష్టపడ్డారు. స్థానికేతరుడైనా, సొంత వర్గం, సొంత బలం, పార్టీ బలం లేకపోయినా వ్యూహాత్మకంగా బలమైన వైసీపీ ప్రత్యర్థిని ఢీకొని గెలుపొందారు. టీడీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని అవమానాలు భరించి ఎన్నికల ప్రక్రియలో విజయం సాధించారు. అయితే ఎన్నికల తరువాత ఎమ్మెల్యే పదవి రాగానే పార్థసారథి మాటతీరే మారిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే పార్థసారథి తీరుపై అటు బీజేపీలో, ఇటు టీడీపీ, జనసేనతో పాటు ప్రతిపక్ష వైసీపీలోను తీవ్ర చర్చ జరుగుతోందట. బీజేపీ ఎమ్మెల్యే దూకుడుగా వ్యవహరిస్తున్నారని, ఫ్యాక్షన్ నేతల తరహాలో మాట్లాడుతున్నారనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటున్నారు. కూటమి కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణుల్లో, నాయకుల్లో చర్చకు వచ్చాయట. ఎమ్మెల్యే తీరు తమ పార్టీలకు నష్టం కలిగిస్తుందని టీడీపీ, జనసేనలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లేనని కామెంట్స్ చేశారు. పార్థసారథి వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
Read Also: YS Jagan Kadapa Tour: రేపటి నుంచి కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
వైసీపీ అనుకూలురు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదలేసి వెళ్ళాలని హుకుం జారీ చేశారట. ఆర్థిక లబ్ధి చేకూర్చే అన్నిటినీ విడిచి పెట్టాలని, లేక పోతే లెక్క వేరేగా ఉంటుందని బెదిరింపు ధోరణిలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడారు. వైసిపి వాళ్ళు పదేళ్లుగా చేసుకున్నది చాలని.. తమ కార్యకర్తలకు అప్పగించాలని హుకుం జారీ చేశారట. అధికారుల నుంచి ఏలాంటి లేఖలు తెచ్చుకోం, నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్ అంటూ అన్నీ తానేననే ధోరణిలో కూటమి పార్టీల కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ స్థాయిలో బెదిరించిన ఎమ్మెల్యే చివరిలో శాంతి యుతంగా ఉండాలి…రౌడీయిజం, గుండాయిజం నచ్చదు అంటూ చిలుక పలుకులు పలకడం ఎంటనే చర్చ షురూ అయింది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అలా మాట్లాడారో లేదో…బీజేపీలోని కొందరు కార్యకర్తలు రెచ్చిపోయారట. ఎమ్మెల్యే వ్యాఖ్యల తరువాత 5 రేషన్ షాపులకు తాళాలు వేశారట. ఆ రేషన్ షాపులు మాకేనంటూ లాగేసుకున్నారట బీజేపీ కార్యకర్తలు. ఇదంతా ఎమ్మెల్యే కామెంట్స్ పరిణామాలేననే చర్చ నడుస్తోంది. గతంలో కూడా ఎమ్మెల్యే పార్థసారథి అనేక సందర్భాల్లో ఇలా వ్యవహరించారట. ఆదోని మండలం సాంబగల్లుకు పార్థసారథి వెళ్లిన సందర్భంలో…గ్రామంలో నీళ్ల సమస్యను ఎమ్మెల్యే ముందు గ్రామస్తులు ప్రస్తావించారు. సర్పంచ్‌ను చొక్కా పట్టుకొని అడగాలని గ్రామస్తులకు హుకుం జారీ చేశారట. మాంత్రికి గ్రామంలోనూ నీటి సమస్యపైనే జనం మాట్లాడితే…వాటర్ మ్యాన్‌ను చెట్టుకు కట్టేసి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో హోం మంత్రి అండ తనకు ఉందని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరని కార్యకర్తలు, నాయకుల ముందు చెబుతున్నారట.
బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఎందుకిలా వ్యవహరిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్షన్ నేతలు కూడా తనను చూసి భయపడాలని ఇలా చేస్తున్నారా..? లేదంటే ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న కర్నూలు జిల్లాలో నిలబడాలంటే ఇలా మాట్లాడాల్సిందేననే ధోరణితో ఉన్నారా అన్నది కూటమి పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదట. బీజేపీ నేతలందరి కంటే తాను యూనిక్‌గా ఉండాలని, గుర్తింపు రావాలని ఇలా మాట్లాడుతున్నారా అన్నది అంతుచిక్కడం లేదు.