NTV Telugu Site icon

Off The Record: ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి ఎందుకు ప్రత్యేకం..?

Bjp

Bjp

Off The Record: తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగబోతున్న ఎన్నికల్ని చాలా సీరియస్‌గా తీసుకుని వర్కౌట్‌ చేస్తోంది బీజేపీ. రెండు ఉపాధ్యాయ,ఒక గ్రాడ్యుయేట్‌ స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా…షెడ్యూల్ రాక ముందే తమ అభ్యర్థులను ప్రకటించి అప్పట్నుంచి దూకుడుగానే ఉంది. అంగబలం, అర్థ బలం ఉన్న వారినే అభ్యర్థులుగా ప్రకటించి.. సాధారణ ఎన్నికల స్థాయిలో మేటర్‌ని సీరియస్‌గా తీసుకున్నారు కాషాయ నేతలు. ఈ ఎన్నికల ఓటర్లంతా చదువుకున్నవారు కావడం, ఆయా వర్గాల్లో తమ పార్టీకి పట్టుందన్న నమ్మకంతో… ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని డిసైడైందట కమలదళం. అందుకే పార్టీ ముఖ్య నాయకులంతా… కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నట్టు తెలుస్తోంది. జరుగుతున్నది ఎమ్మెల్సీ ఎన్నికలే కదా… అందులోనూ ప్రభావం చూపగలిగే గ్రాడ్యుయేట్స్‌ సీటు ఒక్కటే. అయినా సరే… బీజేపీ ఎందుకింత తపన పడుతోంది? ఆ స్థాయి ఎఫర్ట్స్‌ ఎందుకు పెడుతున్నారని అంటే…. అసలు లెక్క అక్కడే ఉందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. టీచర్‌ స్థానాలను పక్కనబెడితే… ఇప్పుడు ఎన్నికలు జరగబోతోంది ఒక్క గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గానికే అయినా… అది ఉత్తర తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ సెగ్మెంట్స్‌ పరిధిలో ఉంది. ఓటర్ల సంఖ్య దాదాపు మూడున్నర లక్షలు. ఈ లెక్కన చూసుకుంటే… పేరుకు ఒక్క సీటే అయినా… ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఢిల్లీ పెద్దలు… ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రాక్టీస్‌ మ్యాచ్‌లా చూస్తున్నారట. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్స్‌ ఉండగా… అందులో 42 నియోజకవర్గాలు ఇప్పుడు ఎలక్షన్‌ పరిధిలో ఉన్నందున ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ని పర్‌ఫెక్ట్‌గా ఆడితే… రేపు అసెంబ్లీ ఎన్నికలకు ఈజీగా ఉంటుందని భావిస్తున్నారట. ఆ క్రమంలోనే అటు ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఆల్రెడీ రంగంలోకి దిగినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొదలుపెట్టి ఇక అసెంబ్లీ ఎన్నికల దాకా ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రౌండ్‌ వర్క్‌ చేస్తుందని, అందుకే ఈ ఎలక్షన్‌ కూడా బీజేపీకి ప్రతిష్టాత్మకం అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ద్వారా… పార్లమెంట్ ఎలక్షన్స్‌ ఊపును కొనసాగించి…అసెంబ్లీకి రూట్‌ క్లియర్‌ చేసుకోవాలన్నది కాషాయ దళం ప్లానింగ్‌ అట. అందుకే మిగతా పార్టీలకంటే ఎక్కువగా అంత సీరియస్‌గా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మూడు సీట్లు గెలవడం ద్వారా… తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని రుజువు చేయాలనుకుంటున్నారట.

రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం 40 లక్షలు దాటింది. ఆ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించాలని … తమది వాపుకాదని నిరూపించుకోవాలనుకుంటున్నారట. ఆ క్రమంలోనే కేంద్ర నాయకత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే… పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తాజాగా రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించి ఎమ్మెల్సీ ఎన్నికల పై రివ్యూ చేశారు. పోటీ చేస్తున్న అభ్యర్థులతో విడివిడిగా భేటీ అయ్యారు. ఎన్నికల్ని లైట్‌గా తీసుకోవద్దని సీరియస్‌గా చెప్పారట. అటు పార్టీ ముఖ్య నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారట. తెలంగాణ పై ఎప్పటి నుండో కన్నేసిన కేంద్ర పార్టీ… ఇక ఏ అవకాశాన్ని వదులు కోవద్దని భావిస్తోందట. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే తెలంగాణలో భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందన్నది బీజేపీ ఢిల్లీ పెద్దల ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి.