Site icon NTV Telugu

Off The Record: ఆ జాతీయపార్టీకి అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌ లేరు..!

Bjp

Bjp

Off The Record: తెలంగాణ అసెంబ్లీలో మొన్నటి వరకు బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌. వివాదాస్పద వ్యాఖ్యల ఘటనలో రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్‌ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని నోటీసు కూడా ఇచ్చింది. ఇది జరిగి నెలలు గడుస్తున్నా.. రాజాసింగ్‌ జైలు నుంచి బయటకొచ్చి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నా.. బీజేపీ నాయకత్వం స్పందించలేదు. సస్పెన్షన్‌ ఎత్తేస్తారని ప్రచారం జరిగినా అది ప్రచారంగానే మిగిలిపోయింది. రాజసింగ్‌ సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకోకపోగా.. ఆయన స్థానంలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరో కూడా తేల్చలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఫ్లోర్‌ లీడర్‌ లేకుండా పోయారు. బీజేపీకి అసెంబ్లీలో రాజాసింగ్‌తోపాటు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిని శాసనసభా పక్ష నేతగా ప్రకటిస్తారని చర్చ జరిగినా.. కాషాయ శిబిరం నుంచి ఉలుకు పలుకు లేదు. పైగా తాజా అసెంబ్లీ సమావేశాలకు ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు..

Read Also: Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..

బీజేపీ ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొంటున్నారు. రాజాసింగ్‌ పార్టీకి సంబంధంలేని ఎమ్మెల్యేగా సభకు వస్తున్నారు. కానీ.. సభలో ముగ్గురు ఎమ్మెల్యే ఒకే దగ్గర కూర్చుంటున్నారు. కలిసి తిరుగుతున్నారు. మొదటి రోజు అసెంబ్లీకి కలిసే వచ్చారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రఘునందన్‌రావు మాట్లాడగా.. బడ్జెట్‌పై జరిగిన చర్చల్లో ఈటల ప్రసంగించారు. స్పీకర్‌ సైతం సభలో మీరు ఇద్దరే సభ్యులు అని ప్రస్తావించారు. దాంతో రాజాసింగ్‌ను బీజేపీ సభ్యుడిగా గుర్తించడం లేదని స్పష్టం అవుతోంది. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈటల రాజేందర్‌ అసెంబ్లీ సమావేశాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. రెండుసార్లు ఆయన్ను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. కానీ.. తాజా సమావేశాల్లో ఈటల పాల్గొంటున్నారు. ఆయన మాట్లాడుతుండగా మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే బీజేపీ శాసనసభా పక్ష నేత ఎవరనేది పార్టీ ఎందుకు తేల్చడం లేదనేది చర్చ సాగుతోంది. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. అప్పటి వరకూ ఎల్పీ లీడర్‌ లేకుండానే కాలం వెళ్లదీయోచ్చని అనుకుంటున్నారు. మరి.. శాసనసభా పక్ష నేత విషయంలో బీజేపీ ఆలోచన ఏంటో కాలమే చెప్పాలి.

Exit mobile version