Site icon NTV Telugu

Off The Record: అంచనాలను అందుకోని కమలం..! బీజేపీ ఎందుకు ప్రభావం చూపలేకపోయింది..?

Otr Bjp Tg

Otr Bjp Tg

Off The Record: తెలంగాణలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదకపోయింది. 116 మున్సిపాలిటీలు…7 కార్పొరేషన్లలో పార్టీల బలాబలాలు ఏంటో తేలిపోయింది. ఏ పార్టీ ఎక్కడ సత్తా చాటింది ఎక్కడ చతికిల పడ్డది క్లారిటీ వచ్చింది. కమలం పార్టీ గతంలో ఎక్కడ అయితే ప్రభావం చూపిందో…ఇప్పుడు కూడా బలాన్ని నిరూపించుకుంది. ఆ మూడు ఉమ్మడి జిల్లాల ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో…ఆ పార్టీ గతం కన్నా ఏం మాత్రం మెరుగు పడలేదు. లెక్కలు చూస్తే ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 890 వార్డులు ఉన్నాయి. ఇందులో బీజేపీ 29 వార్డులను మాత్రమే గెలుచుకుంది. మొత్తం రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీ 11.2 శాతం వార్టులను గెలుచుకుంటే…ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కేవలం 3.2 శాతానికే పరిమితం అయింది. మొత్తం 38 మున్సిపాలిటీల్లో 22 మున్సిపాలిటీల్లో బీజేపీ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 407 వార్డులు ఉంటే…ఇందులో బీజేపీ గెలిచిన వార్డులు 19 మాత్రమే.

బీజేపీ ఖాతా తెరవని మున్సిపాలిటీలు 9 ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 8 మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు 223 ఉండగా, బీజేపీ గెలిచిన వార్డులు జస్ట్‌ రెండు మాత్రమే. బీజేపీ ఖాతా తెరవని మున్సిపాలిటీలు 6 ఉన్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం 12 మున్సిపాలిటీల లో 260 వార్డ్ లకు ఎన్నికలు జరిగాయి. 7 మున్సిపాలిటీలలో అసలు ఖాతానే తెరవలేదు. ఈ లెక్కలను బట్టి ఆ మూడు ఉమ్మడి జిల్లాలో కమలం పార్టీ ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లోనే ఆ పార్టీ అలా ఉంటే…గ్రామీణ ప్రాంతాల్లో ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిజెపి ఇక్కడ దారుణమైన ఫలితాలనే చవి చూసింది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అదే పరిస్థితి. పార్టీ నాయకత్వం ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టకపోతే…రాష్ట్రంలో అధికారం అందుకోవడం అనేది అందని ద్రాక్షనే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Exit mobile version