Off The Record: భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్….. 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు దారణమైన అనుభవాన్ని మిగిల్చిన నియోజకవర్గం. అదే చోట ఈసారి… 2024లో పార్టీ అభ్యర్థి గెలిచినా… ఆ ఆనందం రోజురోజుకీ ఆవిరి అయిపోతోందట. 2024లో నేను ఎక్కడ పోటీ చేసినా…. భీమవరాన్ని మాత్రం మర్చిపోను .. అభివృద్ధి చేసి చూపిస్తానని అప్పట్లో పవన్ ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోతోందని అంటున్నారు. అధినేత ఆశయాలను,ఇచ్చిన మాటను పక్కన పెడుతున్న భీమవరం జనసేన నేతలు… సంపాదన మీదే శ్రద్ధ పెడుతున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. వలస నేతల ఓవరాక్షన్ వల్లనే ఈ పరిస్థితి దాపురిస్తోందని నెత్తీ నోరూ బాదుకుంటున్నారు పాత జనసైనికులు. ఇటీవల భీమవరం పేకాట క్లబ్బుల పై జరుగుతున్న రాద్ధాంతం విషయంలో విచారణకు ఆదేశించిన జనసేన అధినేత….. సొంత నేతలు నడిపిస్తున్న వ్యవహారాల మీద ఎందుకు ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వలస నేతల ప్రభావం పెరగడమే అందుకు కారణం అన్నది లోకల్ కేడర్ వాయిస్.
2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన పులపర్తి రామాంజనేయులు… 2014 ఎన్నికల్లో టిడిపి గూటికి చేరారు. 2019లో టిడిపి తరఫున మరోసారి పోటీ చేసి ఓడిపోయిన పులపర్తి.. 24 ఎన్నికల నాటికి జనసేనలో చేరి మూడోసారి భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏ పార్టీలో చేరినా తన సొంత అనుచర గణానికి ప్రాధాన్యత కల్పించడం తప్ప ప్రాతినిధ్యం వహించే పార్టీ కార్యకర్తలను నాయకులను పట్టించుకోరన్నది ఆయనపై ఉన్న అతిపెద్ద విమర్శ. అందుకు బలం చేకూర్చుతూ ఇప్పుడు భీమవరంలో తన అనుచరగణంతో పేకాట క్లబ్‌ల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలసీలో భాగంగా…. గత రెండు మూడు నెలల నుంచి పేకాట క్లబ్‌లను మూసేయడంతో.. జనసేన ఎమ్మెల్యే ఆయన అనుచర గణానికి, ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే పార్టీలోకి వచ్చిన వలసనేతలకు ఆదాయ దారులు మూసుకుపోయాయట. దీంతో వలసనేతలంతా ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి భీమవరంలో పోలీసుల దగ్గరుండి పేకాట ఆడిస్తున్నారంటూ ఫిర్యాదులు చేశారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తన పరిధిలోకి వచ్చే ఏ విషయాన్నైనా సీరియస్ గా తీసుకునే డిప్యూటీ సీఎం…. అందులో భాగంగానే భీమవరం క్లబ్బుల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.
అయితే భీమవరం డంపింగ్ యార్డ్ సమస్య, రహదారులు, మౌలిక వసతుల కల్పనపై ఏడాదిన్నరగా ఫిర్యాదులు చేయడానికి ముందుకు వెళ్ళని జనసేన నేతలు…. ఇప్పుడు తమ పేకాట ఆదాయం ఆగిపోతే మాత్రం పరుగులు పెట్టి అధినేత దృష్టికి తీసుకువెళ్ళారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వలస నేతలు ముందు వరుసలో ఉంటే… పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వాళ్ళం మాత్రం… బలోపేతం చేయడం గురించి ఆలోచిస్తూ వెనక వరుసలో మిగిలిపోతున్నామని ఆవేదనగా ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో దిగేందుకు జనసేన జిల్లా అధ్యక్షుడితో సహా అనేకమంది నాయకులు సిద్ధమయ్యారు. కానీ… అధినేత వాళ్ళు ఎవర్నీ పట్టించుకోకుండా టిడిపి నుంచి పులపర్తి రామాంజనేయులును తీసుకువచ్చి పోటీ చేయించడంతో ఇప్పుడు ఒరిజినల్ కేడర్‌కు ప్రాధాన్యం దక్కకుండా పోయిందని చెప్పుకుంటున్నారు. వలస వచ్చిన వాళ్ళు అలాగే…. మళ్ళీ ఎన్నికల నాటికి ఏదోఒక పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశం లేకపోలేదని… కానీ.. వాళ్ళ వల్ల జరిగే డ్యామేజ్ మాత్రం పార్టీకి అలాగే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట సగటు జనసైనికుడు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఇప్పటికైనా… నిజా నిజాలు తెలుసుకొని భీమవరం నియోజకవర్గంలో ఎవరికి ప్రాధాన్య ఇవ్వాలో తేల్చుకోవాలంటున్నారు. లేదంటే ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే ఖాళీ చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో క్యాడర్ ముక్కలు ముక్కలుగా విడిపోయినట్టే తమకు కూడా జరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు.
