NTV Telugu Site icon

Off The Record: బాలినేనికి మంత్రి పదవి ప్రతిపాదన..? వైసీపీ మీద రివేంజ్ తీర్చుకుంటున్నారా..?

Balineni

Balineni

Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇతర చోట్ల కూడా వైసీపీకి అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు. ప్రస్తుతం ఆ పార్టీకి బైబై చెప్పేసి జనసేనలో ఉన్నారు. గత ఐదేళ్లలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఫస్ట్‌హాఫ్‌ బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం కలసి రాలేదు. అలకలు, బుజ్జగింపుల పర్వంతోనే పుణ్యకాలం గడిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బాలినేని టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినా, కుటుంబం నుంచి సానుకూలత లేకపోవడంతో… ఆ ప్రయత్నం విరమించుకున్నారట. ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావించిన మాజీ మంత్రి… తన దరిద్రం కొద్దీ.. అప్పట్లో టీడీపీలోకి వెళ్లలేక పోయానని ఓపెనైపోయారు కూడా. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై పోరాటం మొదలు పెట్టినా… వైసీపీ అధిష్టానం నుంచి సరైన మద్దతు లభించలేదన్న అసంతృప్తి ఉందట బాలినేనికి. ఇలాంటి రకరకాల కారణాలతో ఆయన ఫ్యాన్ పార్టీని వదిలి జనసేనలోకి వెళ్లిపోయారన్నది సన్నిహితులు చెప్పే మాట.

మాస్ లీడర్‌గా పేరున్న బాలినేనికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సత్సంబంధాలే ఉన్నాయట. అందుకే ఆయనకు జనసేన ద్వారాలు సులభంగానే తెరుచుకోవడంతో పాటు రాజకీయ భవిష్యత్‌పై గట్టి భరోసానే లభించినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయనకు హామీ లభించినట్లు సమాచారం. జనసేనలోకి బాలినేని ఎంట్రీని మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన కొందరు టీడీపీ నాయకులు కూడా తర్వాత సైలెంట్‌ అవక తప్పలేదు. ఒకరిద్దరు నాయకులు తప్ప జనసేన క్యాడర్‌తో పాటు పలువురు జిల్లా టీడీపీ నాయకులు కూడా బాలినేనికి టచ్‌లోకి వెళ్ళినట్టు సమాచారం. ఇదే సమయంలో విద్యుత్‌ ఒప్పందాల వివాదానికి సంబంధించి… నాటి అదే శాఖ మంత్రిగా బాలినేని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇంకా చెప్పాలంటే… వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పెట్టింది ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌. చెవిరెడ్డి లాంటి ఆ పార్టీ ముఖ్య నేతలు కొందరు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా… వారికి కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పారు బాలినేని. అవసరమైతే చెవిరెడ్డి అమెరికా వ్యవహారాలను బయట పెడతానంటూ చేసిన కామెంట్స్ ఇంకా కాక రేపాయి. దీంతో అసలు విషయం ఎటోపోయి చెవిరెడ్డి అమెరికాలో ఏం చేశారన్న పాయింట్‌ చుట్టూ రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ఇక బాలినేనికి మొదట్నుంచి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు అలవాటు అంటూ.. వైసీపీ నేతలు కూడా రివర్స్‌ అవడంతో రాజకీయ రచ్చ ఓ రేంజ్‌లో జరుగుతోంది.

ఇదే సమయంలో ఇన్నాళ్ళు కామ్‌గా ఉ్నన మాజీ మంత్రి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు? కేవలం వైసీపీని ఇరకాటంలో పెట్టి రివెంజ్‌ తీర్చుకోవడానికేనా? లేక అంతకు మించిన వ్యవహారం ఇంకేదన్నా ఉందా అని ఆరా తీస్తున్న వాళ్ళకు కొత్త విషయం తెలుస్తోందట. బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇప్పించాలన్నది పవన్ కళ్యాణ్‌ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్‌గాక మరో ఇద్దరు మంత్రులు ఉన్నారు. కాపు, కమ్మ కాంబినేషన్‌ ఉన్నందున
బాలినేనికి పదవి ఇప్పిస్తే… రెడ్లను కూడా సంతృప్తి పరిచినట్టు అవుతుందన్నది పవన్‌ ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అలాగే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో బాలినేనికి ఉన్న పరిచయాలతో పార్టీని బలోపేతం చేసుకోవచ్చన్నది జనసేన అధ్యక్షుడి ప్లాన్‌గా ప్రచారం ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే పవన్, బాలినేని, చంద్రబాబు భేటీ ఉండవచ్చని, ఆ తర్వాత అన్నీ లాంఛనంగా జరిగిపోతాయని మాట్లాడుకుంటున్నాయి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలు.

ఏపీ క్యాబినెట్ లో ఓ మంత్రి పదవి ఖాళీ ఉండటంతో దానిని బాలినేనితో భర్తీ చేయవచ్చన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణచక్రవర్తి, జయమంగళ వెంకట రమణ రాజీనామాలు చేశారు. దీంతో శాసన మండలి చైర్మన్ మోషేన్‌ రాజు ఇవాళ కాకుంటే రేపైనా వాటిని ఆమోదించక తప్పదని, ఆ తర్వాత కూటమి కోటాలోకి వచ్చే ఆ సీట్లలో ఒకటి బాలినేనికి ఇస్తారన్నది అంచనా. ఈ క్రమంలో తన పట్టు తగ్గకుండా, ఉనికి చాటుకునేందుకు కూడా బాలినేని కాస్త ఘాటైన ప్రకటనలు చేస్తుండవచ్చన్నది మరో వర్గం విశ్లేషణ. కారణం ఏదైనా మాజీ మంత్రి కామెంట్స్‌ మాత్రం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ… డిఫెన్స్‌లో పడేస్తున్నాయన్నది పొలిటికల్‌ పండిట్స్‌ మాట.