Off The Record: కూటమి నేతలకు తలనొప్పిగా ఫీడ్ ఫైర్..

  • కూటమి నేతలకు తలనొప్పిగా ఫీడ్‌ ఫైర్‌..
  • ఎక్కువ మంది ఆందోళనకారులు కూటమి నేతలు, సానుభూతిపరులే..
  • ఒకవైపు ఫీడ్‌ కంపెనీల సిండికేట్‌, మరోవైపు రైతుల ఆందోళన..
  • ఆక్వా ఫీడ్‌ కంపెనీల దోపిడీ గురించే జనంలో చర్చ..
  • కంపెనీల్ని దారికి తెచ్చుకోలేక, రైతుల్ని సమాధానపరచలేక..
  • గోదావరి జిల్లాల్లో అక్వా రంగం మీద ఆధారపడి లక్షల మంది..
  • సిండికేట్‌ ఎలా దెబ్బ తీస్తోందో సొంత నేతలే చెబుతున్న వైనం..
  • వైసీపీ ఎంటర్‌ అయితే కొంప మునుగుతుందన్న భయం..
Otr Aqua Feed Crisis

Otr Aqua Feed Crisis

Off The Record: ఏపీలో చెలరేగిన ఆక్వా ఫీడ్ ఫైర్ అధికార కూటమి నేతలకు తలనొప్పిగా మారుతోందట. కొద్ది రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా… ఇటు ప్రభుత్వం నుంచి గాని అటు మేత తయారు చేసే కంపెనీల నుంచిగాని స్పందన లేదు. దాంతో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. మరోవైపు ఆక్వా రైతుల నిరసనలు, వారు ప్రస్తావిస్తున్న సమస్యల పరిష్కారం కోరుతూ మద్దతు పెరుగుతోంది. ఇదే కూటమి నాయకులకు తలనొప్పిగా మారుతోందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆందోళన బాట పట్టిన వారిలో అధిక శాతం కూటమి పార్టీలకు చెందిన నేతలు, సానుభూతిపరులే. అందుకే సమస్యను ఎలా డీల్‌ చేయాలో అర్ధం అవక మా పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైందని అంటున్నారట. ఒకవైపు ఫీడ్‌ సప్లయ్‌ కంపెనీలు సిండికేట్ అయ్యాయన్న ఆరోపణలున్నాయి. మరోవైపు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న రైతుల్ని ఆగమని చెప్పే పరిస్థితి లేదు. అలాగని ఉదాసీంగా చూస్తూ ఊరుకుందామా అంటే… ఆందోళనలు ముదిరి కొంప కొల్లేరయ్యే పరిస్థితి. ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందన్న భయం.

ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థంగాక ఈ ప్రభావం ఎక్కువగా ఉండే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూటమి నాయకులు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. రెండు మూడు నెలలుగా ఆక్వా రైతులు ప్రస్తావిస్తున్న అంశాల్లో అంతర్జాతీయ ఒడిదుడుకుల కంటే…. ఫీడ్ కంపెనీల దోపిడీనే ఎక్కువ ఉందన్న సంగతి జనంలోకి బాగా వెళ్ళింది. ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ఆక్వా రైతులు నిలదీస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకుంటే ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు సైతం పెరుగుతున్నాయి. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వోవరాల్‌గా కూటమినేతలదే హవా. అలాంటి చోట రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కడం.. వారిని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో నాయకులు లేకపోవడంతో ప్రభుత్వానికి ఇదో పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. అటు ఫీడ్ కంపెనీలను దారిలోకి తెచ్చుకోలేక, ఇటు రోడ్డెక్కుతున్న రైతులను సమాధానపరచలేక కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నట్టు తెలుస్తోంది. పైగా సొంత పార్టీల సానుభూతిపరులే ఈ స్థాయిలో ఆందోళనలు చేస్తుంటే.. ఇక ప్రతిపక్ష పార్టీలు రంగంలో దిగితే పరిస్థితులు తారు మారవుతాయన్న ఆందోళన కూడా పెరుగుతోందట. గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు.

×
×
Ad

కానీ… ఇప్పుడు ఆ రంగం సిండికేట్ వ్యవస్థ కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆలస్యం చేసే కొద్దీ రైతుల్లో అసంతృప్తి పెరిగిపోతుందని అంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి మైనస్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు ఇక్కడి నేతలు.. సొంత పార్టీల నేతలు సైతం ఆక్వా సిండికేట్ దెబ్బకు ఎంత నష్టపోయామో మైకుల ముందు చెప్పడం చూస్తుంటే…. క్షేత్ర స్థాయిలో రైతులు ఎంతగా మోసపోతున్నారరో అర్థం చేసుకోవచ్చుని అంటున్నారు. ఇదే సమయంలో YCP సైతం AQUA రైతులకు మద్దతుగా నిలవడంతోపాటు, వారి తరఫున పోరాడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే… రొయ్యలు కూటమి నేతల కొంప ముంచుతాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పశ్చిమలో చెలరేగిన ఫీడు ఫైర్ ఇపుడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ఆజ్యం పోస్తోంది. ఈ పరిస్థితుల్లో… ఫీడ్ కంపెనీలను కంట్రోల్ చేయాలా.. లేక ఆక్వా రైతులను గాలికి వదిలేయాలా అన్న విషయంలో ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం కూటమి పార్టీల నేతల్లోనే వ్యక్తం అవుతోంది.