Off The Record: ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక పరిస్థితులు మెల్లిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే… రకరకాల విశ్లేషణలు జరిగాయి. అయితే… ఓవరాల్‌గా ఆయన టీడీపీని వ్యతిరేకించే వ్యక్తి కాదని, కూటమి ప్రయాణం కూడా సాఫీగానే సాగుతుందని లెక్కలేశారు. అయితే… టైం గడిచేకొద్దీ…. ఆయన స్వరం సవరించుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల మాధవ్ చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి మాధవ్ చేసిన తాజా వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీలో సంస్కరణలు రావాలని, ప్రభుత్వం భారీగా బకాయిలు పడిందన్న మాటలు ఎవర్ని ఉద్దేశించి అన్న చర్చలు జరుగుతున్నాయి. అలాగే పాఠశాల విద్య దారుణంగా ఉందని, దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో టీచర్స్‌కు జీతాలు ఇస్తున్నామని అనడం వెనక ఆంతర్యం ఏంటి? ఆయన ఎవర్ని టార్గెట్ చేస్తున్నారన్నది అర్ధం కావడం లేదంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిధిలోనే ఉండటంతో మాధవ్ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులు, అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలమవుతున్నామంటూ చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఆ విషయంలో ఆయన ఎవర్ని టార్గెట్ చేశారు? ఎవర్ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. తాము కూడా ఏపీ ప్రభుత్వంలో భాగస్వాములం అన్న సంగతిని మాధవ్ మర్చిపోయారా? లేక కూటమి ధర్మం గుర్తుకు రావడం లేదా అని కూడా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో మాధవ్ ఉనికి చాటుకునేందుకు అలా మాట్లాడుతున్నారా అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట కొందరికి. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ మీద పట్టు బిగించే క్రమంలో… స్వరం పెంచి అలా మాట్లాడితేనే గుర్తింపు, గౌరవం దక్కుతాయని భావిస్తున్నారా అన్నది కొందరి అనుమానం. లేక ఏదో చెప్పబోయి ఇంకేదో మాట్లాడుతున్నారా అని కూడా ఆరా తీస్తోంది ఓ వర్గం. వైసీపీ హయాంలో ఏదో జరిగిందని చెప్పబోయి… ఇలా ఓపెన్ అయి ఉంటారన్నది పార్టీలోని ఓ వర్గం సర్దుబాటు మాట. కక్షలు, కార్పణ్యాలన్న మాటలు ఆయన నోటి నుంచి అందుకే వచ్చి ఉంటాయంటున్నారు.
Read Also: Stock Market: ట్రంప్ టారీఫ్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లు కేవలం 10 నిమిషాల్లో రూ.3 లక్షల కోట్లు ఆవిరి
అయితే మాధవ్ గుర్తింపు కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా? గట్టిగా మాట్లాడి ప్రభుత్వాన్ని బెదిరిస్తేనే తనను గుర్తిస్తారని అనుకుంటున్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట కొందరికి. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతమై ఉందనే వాదనతో ఏకీభవిస్తున్నానని అన్నమాటల్ని…. ఈ బెదిరింపు అభిప్రాయాలతో పోల్చి చూసుకుంటున్నారు కొందరు. ఏతావాతా ఏదో రకంగా ఆయన గుర్తింపు కోరుకుంటున్నారని, అందుకే… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి, లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖను టార్గెట్ చేసి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి రాజకీయవర్గాల్లో. మరి అది బెదిరించి గుర్తింపు పొందాలన్న ఆరాటమా? లేక మరోటా అన్నది తేలాలంటే… ఇంకొన్నాళ్ళు వేచి చూడాలని అంటున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.
